
కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఫండ్ కావేరి ఇంజన్ అనే హ్యాష్ ట్యాంగ్ వైరల్ అవుతోంది. అసలు ఏంటీ కావేరి ఇంజన్..? దీనికి భారత రక్షణ సామర్థ్యానికి మధ్య సంబంధం ఏంటి..? అసలు కావేరి ఇంజిన్ దేనికి పనిచేస్తుంది..? దీనిని ఎవరు తయారు చేస్తున్నారు..?
ఫండ్‌కావేరిఇంజిన్.. సోషల్ మీడియాలో ప్రస్తుతం బాగా ట్రెండ్ అవుతోన్న హ్యాష్ ట్యాగ్ ఇది. ఈ ఇంజిన్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతూ అనేక మంది రక్షణ రంగ నిపుణులు, ఔత్సాహికులు, సామాన్య పౌరులు సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేస్తున్నారు. వాయుసేన సాంకేతికతలో ఆత్మనిర్భరత సాధించేలా.. ఈ ప్రాజెక్ట్‌కు నిధులు, వనరులు సమకూర్చాలని మోదీ సర్కారును కోరుతున్నారు. జాతి ప్రయోజనాలకు చాలా కీలకమైన ఈ ప్రాజెక్ట్‌తో విదేశీ ఫైటర్ జెట్ ఇంజిన్లపై భారత్ ఆధారపడటం తగ్గుతుందనేది నిపుణుల అభిప్రాయం. ఈ ఇంజిన్ భారతదేశ యుద్ధ విమానాలకు స్వదేశీ శక్తిని అందిస్తుందని, విదేశీ దేశాలపై ఆధారపడటం వల్ల వచ్చే రాజకీయ , ఆర్థిక సమస్యలను తగ్గిస్తుందని భావిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ ట్రెండ్ దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షిస్తోంది. ఎందుకంటే ఇది భారతదేశ స్వదేశీ సాంకేతికతను ప్రోత్సహించే ఒక ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు.
అసలు కావేరి ఇంజిన్ అంటే ఏమిటి?
కావేరి ఇంజిన్ అనేది DRDO ఆధ్వర్యంలోని గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్‌మెంట్ అనే ల్యాబ్‌లో అభివృద్ధి చేయబడుతున్న స్వదేశీ జెట్ ఇంజిన్. ఇది స్వదేశీ యుద్ధ విమానాలను శక్తిమంతం చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది 80 కిలోన్యూటన్ థ్రస్ట్ ఉత్పత్తి చేస్తుంది. అంటే యుద్ధ విమానాన్ని గాలిలో అత్యంత వేగంగా నడిపే సామర్థ్యం వస్తుంది. ఈ ఇంజిన్‌ను లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ తేజస్ కోసం రూపొందించారు. కానీ ఇప్పుడు దీనిని అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ -అమ్కా, ఘటక్ వంటి స్టెల్త్ డ్రోన్‌ల కోసం కూడా అభివృద్ధి చేస్తున్నారు. 1980లలో ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది. విదేశీ ఇంజిన్‌లపై ఆధారపడకుండా.. స్వదేశీ సాంకేతికతతో శక్తివంతమైన ఇంజిన్‌ను తయారు చేయడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం.
కావేరి ఇంజిన్ భారతదేశానికి ఎందుకు ముఖ్యం?
కావేరి ఇంజిన్ భారతదేశ రక్షణ రంగంలో స్వావలంబన సాధించడానికి ఒక కీలకమైన అడుగు. ప్రస్తుతం, భారతదేశం తయారు చేసిన తేజస్ విమానాలు అమెరికా GE F404, F414 ఇంజిన్‌లపై ఆధారపడుతున్నాయి. విదేశీ ఇంజిన్‌లపై ఆధారపడటం వల్ల ఖర్చు ఎక్కువ అవడమే కాకుండా, రాజకీయ ఒత్తిడి, సరఫరా ఆలస్యం వంటి సమస్యలు తలెత్తుతాయి. కావేరి ఇంజిన్ విజయవంతంగా అభివృద్ధి స్తే.., భారతదేశం ఈ ఆధారపడటాన్ని తగ్గించి, స్వదేశీ యుద్ధ విమానాలను సొంత ఇంజిన్‌లతో తయారు చేయగలదు. ఇది దేశ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేస్తుంది. అలాగే ఆర్థికంగా కూడా లాభం కూడా. అంతేకాకుండా, ఈ ఇంజిన్ అమ్కా వంటి ఐదవ తరం స్టెల్త్ విమానాలకు శక్తినిస్తుంది. ఇది శత్రువుల రాడార్‌లకు కనిపించకుండా రహస్య ఆపరేషన్లను నిర్వహించే సామర్థ్యాన్ని పెంచుతుంది. ఇది భారతదేశాన్ని అమెరికా, రష్యా, చైనా వంటి దేశాల సరసన నిలబెట్టే ఒక ముఖ్యమైన సాంకేతిక పురోగతి.
కావేరి ఇంజిన్ తయారీ కోసం భారతదేశం ఏం చేస్తోంది?
భారతదేశం కావేరి ఇంజిన్ అభివృద్ధికి గత కొన్ని దశాబ్దాలుగా కృషి చేస్తోంది. 1989లో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్‌లో ఇప్పటివరకు 2,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టారు. ఇప్పటివరకు 9 ప్రోటోటైప్ ఇంజిన్‌లు, 4 కోర్ ఇంజిన్‌లను తయారు చేసి, వివిధ పరీక్షలు నిర్వహించారు. అయితే, ఈ ఇంజిన్ పూర్తి స్థాయిలో తేజస్ విమానాలకు అనుకూలంగా లేకపోవడంతో, దాని అభివృద్ధి కొనసాగుతోంది. ప్రస్తుతం, DRDO, GTRE ఈ ఇంజిన్‌ను అమ్కా, ఘటక్ డ్రోన్‌లకు అనుగుణంగా అభివృద్ధి చేస్తున్నాయి. 2024లో, కావేరి ఇంజిన్ అభివృద్ధిని వేగవంతం చేయడానికి భారతదేశం ఫ్రాన్స్‌కు చెందిన సాఫ్రాన్ కంపెనీతో జాయింట్ వెంచర్ కోసం చర్చలు జరిపింది. సాఫ్రాన్ అనేది రాఫెల్ విమానాలకు ఇంజిన్‌లు తయారు చేసే ప్రముఖ కంపెనీ. దీని సాంకేతిక సహాయంతో కావేరి ఇంజిన్‌ను 110-120 kN థ్రస్ట్ సామర్థ్యంతో అప్‌గ్రేడ్ చేయాలని భారతదేశం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సహకారం ద్వారా భారతీయ శాస్త్రవేత్తలు అధునాతన సాంకేతికతను నేర్చుకోవచ్చు. ఇంజిన్‌ను ఐదవ తరం యుద్ధ విమానాలకు అనుకూలంగా తయారు చేయవచ్చు. అంతేకాకుండా, భారతదేశం స్వదేశీ రక్షణ పరిశ్రమలను ప్రోత్సహించడానికి హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఇతర ప్రైవేట్ కంపెనీలను కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగం చేస్తోంది.
కావేరి ఇంజిన్ టెక్నాలజీ అందిపుచ్చుకోవడం అంత కష్టమా?
కావేరి ఇంజిన్ వంటి అధునాతన జెట్ ఇంజిన్‌ను అభివృద్ధి చేయడం చాలా సవాలుతో కూడిన పని. జెట్ ఇంజిన్‌ల తయారీకి అధునాతన మెటీరియల్ సైన్స్, హై-టెంపరేచర్ అల్లాయ్‌లు అంటే అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే లోహాలు, ఖచ్చితమైన ఇంజనీరింగ్, సంక్లిష్టమైన డిజైన్ టెక్నాలజీ అవసరం. ఈ ఇంజిన్‌లు అత్యంత వేగంతో, అధిక ఉష్ణోగ్రతలలో, తీవ్రమైన ఒత్తిడిలో పనిచేయాలి. అందుకే వాటి డిజైన్, తయారీలో ఒక్క చిన్న తప్పు కూడా పెద్ద ప్రమాదానికి దారితీయవచ్చు. భారతదేశం వంటి దేశానికి, ఈ సాంకేతికతను సొంతంగా అభివృద్ధి చేయడం కష్టం ఎందుకంటే.. జెట్ ఇంజిన్‌ల తయారీలో అమెరికా, రష్యా, ఫ్రాన్స్ వంటి దేశాలు దశాబ్దాల అనుభవాన్ని కలిగి ఉన్నాయి. భారతదేశానికి ఈ స్థాయి అనుభవం ఇంకా పూర్తిగా రాలేదు. ఇంజిన్ భాగాలు అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోవడానికి సింగిల్-క్రిస్టల్ బ్లేడ్‌లు, సూపర్ అల్లాయ్‌లు అవసరం. ఇవి తయారు చేయడం చాలా కష్టం. జెట్ ఇంజిన్‌లను పరీక్షించడానికి అధునాతన సౌకర్యాలు అవసరం, ఇవి భారతదేశంలో పరిమితంగా ఉన్నాయి. ఇటువంటి ప్రాజెక్ట్‌లకు భారీగా నిధులు, దీర్ఘకాల పరిశోధన అవసరం, ఇది చాలా టైమ్ తీసుకునే ప్రాజెక్టులు. ఇన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, భారతదేశం ఈ సాంకేతికతను అభివృద్ధి చేయడానికి తీవ్రంగా కృషి చేస్తోంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇది దేశ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేస్తుంది.
కావేరి ఇంజిన్ అందుబాటులోకి వస్తే ఏం జరుగుతుంది?
కావేరి ఇంజిన్ విజయవంతంగా అభివృద్ధి చేయబడి, అందుబాటులోకి వస్తే భారతదేశానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ప్రధానంగా విదేశీ ఇంజిన్‌లపై ఆధారపడటం తగ్గుతుంది, దీనివల్ల రాజకీయ ఒత్తిడి, సరఫరా ఆలస్యం వంటి సమస్యలు ఉండవు. స్వదేశీ ఇంజిన్‌ల తయారీ వల్ల విదేశీ ఇంజిన్‌ల కొనుగోలు, నిర్వహణ ఖర్చులు తగ్గుతాయి. అమ్కా, ఘటక్ డ్రోన్‌ల వంటి ఐదవ తరం విమానాలకు శక్తినిచ్చే స్వదేశీ ఇంజిన్ భారత వైమానిక దళ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుంది. ఈ ఇంజిన్ అభివృద్ధి భారత రక్షణ పరిశ్రమలో మెటీరియల్ సైన్స్, ఇంజనీరింగ్, తయారీ సామర్థ్యాలను మెరుగుపరుస్తుంది. స్వదేశీ తయారీ వల్ల దేశీయ పరిశ్రమలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. రక్షణ ఉత్పత్తుల ఎగుమతి సామర్థ్యం కూడా పెరుగుతుంది. స్వదేశీ ఇంజిన్‌లతో, భారతదేశం రక్షణ సామర్థ్యాలను స్వతంత్రంగా నిర్వహించగలదు, ఇది జాతీయ భద్రతకు కీలకం. మొత్తంగా, కావేరి ఇంజిన్ అందుబాటులోకి వస్తే, భారతదేశం రక్షణ రంగంలో స్వావలంబన సాధించడమే కాకుండా, ఆధునిక యుద్ధ సాంకేతికతలో ప్రపంచంలోని అగ్రగామి దేశాల సరసన నిలుస్తుంది. ఈ ఇంజిన్ భారత వైమానిక దళాన్ని మరింత శక్తివంతంగా చేస్తుంది. అలాగే దేశ ఆర్థిక, సాంకేతిక, వ్యూహాత్మక సామర్థ్యాలను బలోపేతం చేస్తుంది. అందుకే దీనిని అభివృద్ధి చేయాలని హ్యాష్ ట్యాగ్ ల రూపంలో ట్రెండ్ చేస్తున్నారు.