S400 తర్వాత S500 భారత్ కొంటోందా..? రష్యా, భారత్ తో ఒప్పందానికి అమెరికాకు ఎందుకు అభ్యంతరం.?

భారత్, పాకిస్థాన్ ఉద్రిక్తతలకు ముందు.. మన దేశం తరుచూ క్షిపణి ప్రయోగాలు.. రష్యాతో పాటు ఇతర దేశాలతో ఆయుధాల కొనుగోళ్ల డీల్స్ చేసుకుంటుండేది. అప్పట్లో తెలియదు వీటి ఉపయోగం ఎంత ఉందోనని.. భారత్ శాంతిని కోరకునే దేశం అలాంటి దేశానికి ఇంతలా ఆయుధాలు ఎందుకనే ప్రశ్నలు కూడా వచ్చాయి. అయితే ఆయుధాలు శాంతికి మార్గమనే విషయం ఇప్పుడు అర్థమైంది. అత్యాధునిక ఆయుధాలు ఉంటే శత్రువును ఎలా దారిలోకి తెచ్చుకోవచ్చో.. తెలిసింది. ముఖ్యంగా S400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కొనుగోలు చేసుకోవడం ఎంత లాభమో అర్థమైంది.. భారత్ సరిహద్దులను ఇది ఎంతగా రక్షించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరి S400 తర్వాత ఏంటి..? రష్యా తయారీ S500 డీల్ ఎంత వరకు వచ్చింది..? దీనికి అమెరికా ఎందుకు అడ్డుపడుతోంది..? అసలు S500 భారత్ కు ఎందుకు అవసరం..?

భారత్ దాడి చేసే సామర్థ్యంతో పాటు.. దాటిని అడ్డుకునే సామర్థ్యం ఉన్న ఆయుధాల విషయంలోను ఎంత జాగ్రత్తలు తీసుకుందో.. ఇటీవలి పరిణామాల తర్వాత అర్థమైంది. ఫైటర్ జెట్లు, క్షిపణులు, డ్రోన్లు ఇలా ఆకాశంలో నుంచి శత్రువు ప్రయోగించే ఆయుధాలను అడ్డుకోవడం అంత సులభం కాదు. కాని భారత్ రష్యా దగ్గర నుంచి కొనుగోలు చేసిన S400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ భారత రక్షణ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటింది. ఇప్పుడు రక్షణ రంగం అభివృద్ధి, పెట్టుబడులు ఎంత ముఖ్యమో అందరికీ అర్థమైంది. అందుకే S400కు మించి శక్తివంతమైన S400 కొనుగోలుకు చర్యలు చేపట్టింది. అయితే దీనికి అనేక సవాళ్లు ఉన్నాయి.

ఆపరేషన్ సింధూర్ భాగంగా భారత వైమానిక దళం పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలపై ఖచ్చితమైన ఎయిర్‌స్ట్రైక్‌లు జరిపింది. దీనికి ప్రతీకారంగా పాకిస్థాన్ జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్ సరిహద్దు ప్రాంతాల్లో పలు క్షిపణులు డ్రోన్‌లతో దాడులు చేసింది. కానీ, భారతదేశం అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అయిన S-400 ఈ దాడులను ఆకాశంలోనే అడ్డుకుంది. దీనివల్ల పెద్దగా నష్టం జరగకుండా ఉంది. S-400 సిస్టమ్‌ను కీలకమైన ప్రాంతాల్లో వ్యూహాత్మకంగా ఉంచారు. ఇది శత్రువుల డ్రోన్‌లు, క్షిపణులను అడ్డుకోవడంతో పాటు, పాకిస్థాన్ యుద్ధ విమానాలు తోకముడుకుని పారిపోయేలా చేసింది. ఈ సిస్టమ్ వల్ల సామాన్య ప్రజలకు హాని, ఆస్తి నష్టం చాలా వరకు తగ్గిందని సైనిక నిపుణులు చెబుతున్నారు.

S-400 ట్రయంఫ్ అనేది రష్యాకు చెందిన అల్మాజ్ సెంట్రల్ డిజైన్ బ్యూరో అభివృద్ధి చేసిన ఒక శక్తివంతమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇది 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రు ఆయుధాలను గుర్తించగలదు. 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఖచ్చితంగా నాశనం చేయగలదు. ఇది స్టెల్త్ విమానాలు, క్రూయిజ్ క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణులను కూడా నాశనం చేయగల సామర్థ్యం కలిగి ఉంది. ఈ సిస్టమ్‌ను త్వరగా ఒక చోట నుంచి మరో చోటికి తరలించవచ్చు, ఇది యుద్ధ సమయంలో చాలా ఉపయోగకరం. భారతదేశం 2018లో రష్యాతో 35,000 కోట్ల రూపాయల ఒప్పందం కుదుర్చుకుని ఐదు S-400 స్క్వాడ్రన్‌లను కొనుగోలు చేసింది. మొదటి స్క్వాడ్రన్ 2021లో పంజాబ్‌లో ఉంచారు. ఇది పాకిస్తాన్, చైనా నుంచి వచ్చే బెదిరింపులను ఎదుర్కొనేలా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మూడు స్క్వాడ్రన్‌లు పనిచేస్తున్నాయి, మిగిలిన రెండు 2026 నాటికి వస్తాయి. భారత సైన్యంలో ఈ సిస్టమ్‌ను సుదర్శన చక్రం అని పిలుస్తారు, దీని శక్తి, ఖచ్చితత్వాన్ని ఈ పేరు తెలియజేస్తుంది.

S-400 ఇప్పటికే తన సామర్థ్యాన్ని నిరూపించుకుంది. కానీ భారతదేశం ఇప్పుడు మరింత ఆధునికమైన S-500 ప్రోమిథియస్ ను కొనుగోలు చేయడానికి ఆలోచిస్తోంది. రష్యా సైన్యంలో 2021లో చేరిన ఈ సిస్టమ్ ఎయిర్ డిఫెన్స్ టెక్నాలజీలో ఒక పెద్ద ముందడుగు.
S-500 కేవలం ఆకాశం నుంచి జరిగే దాడులను మాత్రమే కాకుండా, అంతరిక్షంలో ఉన్న లక్ష్యాలను కూడా నాశనం చేయగలదు. ఇది హైపర్‌సోనిక్ గ్లైడ్ వెహికల్స్ , హై-స్పీడ్ డ్రోన్‌లు, తక్కువ ఎత్తులో ఉన్న ఉపగ్రహాలను కూడా నాశనం చేయగలదు. ఈ సిస్టమ్ బాలిస్టిక్ లక్ష్యాలను 2,000 కిలోమీటర్ల దూరంలో గుర్తించగలదు, 600 కిలోమీటర్ల దూరంలో నాశనం చేయగలదు. దీనిలోని 77N6 క్షిపణులు హిట్-టు-కిల్ సాంకేతికతను ఉపయోగిస్తాయి. అంటే లక్ష్యాన్ని నేరుగా ఢీకొట్టి నాశనం చేస్తాయి. ఇది ఒకేసారి 10 లక్ష్యాలను ట్రాక్ చేసి నాశనం చేయగల సామర్థ్యం కలిగి ఉంది. ఇది మల్టిపుల్ దాడులను ఎదుర్కొనడానికి ఉపయోగపడుతుంది. ఒకవేళ భారతదేశం ఈ సిస్టమ్‌ను కొనుగోలు చేయాలని నిర్ణయిస్తే, అది S-500ను కొనుగోలు చేసే మొదటి విదేశీ దేశం కావచ్చు. కానీ ఈ ఒప్పందం అంత సులభం కాదంటున్నారు.

రష్యా నుంచి S500 కొనుగోలుకు ఓ పెద్ద అడ్డంకి ఉంది.. అదే అమెరికా. అమెరికా 2018లో తీసుకొచ్చిన కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ థ్రూ శాంక్షన్స్ యాక్ట్ -CAATSA చట్టం ప్రకారం, రష్యాతో పెద్ద ఎత్తున రక్షణ ఒప్పందాలు చేసే దేశాలపై ఆంక్షలు విధించవచ్చు. భారతదేశం S-400 కొనుగోలు చేసినప్పుడు, భారతీయ-అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా ప్రతిపాదించిన 2022 చట్ట సవరణ వల్ల తాత్కాలిక ఆంక్షల మినహాయింపు లభించింది. కానీ S-500 కొనుగోలు చేస్తే అలాంటి మినహాయింపు హామీ రాకపోవచ్చు. హైపర్‌సోనిక్ క్షిపణులు, అంతరిక్షం నుంచి ఆపదలు పెరుగుతున్న నేపథ్యంలో, S-500 భారతదేశానికి కేవలం ఒక ఆయుధం కాదు, ఇది వ్యూహాత్మకంగా చాలా ముఖ్యం. అయినప్పటికీ, ఈ ఒప్పందం రాజకీయంగా కూడా క్లిష్టమైంది. అమెరికాతో సంబంధాలు దెబ్బతినకుండా చేస్తూనే, రష్యాతో రక్షణ సహకారాన్ని కొనసాగించడం భారతదేశానికి ఒక సవాలు.

S-500 తరహాలో భారత్ సొంత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను తయారు చేసుకోవచ్చు కదా?
రష్యా తయారీ S-500 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వంటి అత్యాధునిక సాంకేతికత కలిగిన స్వదేశీ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను భారతదేశం అభివృద్ధి చేయడం అంత ఆషామాషీ విషయం కాదు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ నేతృత్వంలో, భారతదేశం స్వదేశీ సాంకేతికతతో ఆకాశ బెదిరింపులను ఎదుర్కొనే వ్యవస్థలను తయారు చేస్తోంది. ప్రస్తుతం, భారత్ వద్ద ఆకాశ్, ఆకాశ్-NG, బరాక్-8 వంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లు ఉన్నాయి. అయితే వీటికి S-500 లా హైపర్‌సోనిక్ క్షిపణులు, అంతరిక్ష దాడులు, లాంగ్ రేంజ్ థ్రెట్స్ అడ్డుకునే సామర్థ్యం అంతగా లేదు. అయినప్పటికీ, భారత్ తన రక్షణ సామర్థ్యాలను మెరుగుపరచడానికి అనేక స్వదేశీ ప్రాజెక్టులను చేపడుతోంది. ముఖ్యంగా, DRDO ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ కుష్ అనే ఒక అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అభివృద్ధి జరుగుతోంది. ఈ సిస్టమ్ బాలిస్టిక్ క్షిపణులు, క్రూయిజ్ క్షిపణులు, హైపర్‌సోనిక్ ఆయుధాలను అడ్డుకోగల సామర్థ్యం కోసం రూపొందించబడుతోంది. ఈ ప్రాజెక్ట్ లాంగ్ రేంజ్ రాడార్‌లు, అధునాతన సెన్సార్‌లు, ఖచ్చితమైన ఇంటర్‌సెప్టర్ క్షిపణులను కలిగి ఉంటుంది. ఇది S-500 లాంటి సామర్థ్యంతో సమానంగా ఉండేలా చేస్తున్నారు. అయితే, ఈ సిస్టమ్ ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది, పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడానికి ఇంకా కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు.

భారత్ ప్రస్తుతం ఆకాశ్-NG వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది, ఇది ఆకాశ్ సిస్టమ్ కు అప్ గ్రేడ్ వర్షన్. ఈ సిస్టమ్ 50-70 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను అడ్డుకోగల సామర్థ్యం కలిగి ఉంది. ఇది డ్రోన్‌లు, యుద్ధ విమానాలు, కొన్ని రకాల క్షిపణులను నాశనం చేయగలదు. అయితే, ఇది S-500లా 600 కిలోమీటర్ల ఇంటర్‌సెప్షన్ రేంజ్, హైపర్‌సోనిక్ ఆయుధాలను అడ్డుకునే సామర్థ్యంతో పోల్చితే చాలా పరిమిత స్థాయిలో ఉంది. భారత్ ఇజ్రాయెల్‌తో కలిసి అభివృద్ధి చేసిన బరాక్-8 సిస్టమ్‌ను నౌకాదళం, వైమానిక దళంలో ఉపయోగిస్తోంది. ఇది 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను నాశనం చేయగలదు. కానీ S-500 లాంటి అంతరిక్ష లక్ష్యాలను, హైపర్‌సోనిక్ బెదిరింపులను ఎదుర్కోవడంలో దీని సామర్థ్యం పరిమితం.
భారతదేశం ఈ స్వదేశీ సిస్టమ్‌లను అభివృద్ధి చేస్తూ, విదేశీ సాంకేతికతపై ఆధారపడటాన్ని తగ్గించే దిశగా పనిచేస్తోంది. ఆకాశ్, బరాక్-8 సిస్టమ్‌లలో స్వదేశీ సాంకేతికత ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కానీ S-500 స్థాయి సాంకేతికతకు చేరుకోవడానికి ఇంకా అధునాతన రాడార్‌లు, ఇంటర్‌సెప్టర్ క్షిపణులు, అంతరిక్ష-ఆధారిత సామర్థ్యాలను అభివృద్ధి చేయాల్సి ఉంది. DRDO ఈ దిశగా అడ్వాన్స్‌డ్ ఎయిర్ డిఫెన్స్, ఫేజ్-2 బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ ప్రాజెక్టులను కొనసాగిస్తోంది. ఈ BMD సిస్టమ్ బాలిస్టిక్ క్షిపణులను ఆకాశంలోనే అడ్డుకోగల సామర్థ్యం కలిగి ఉంది. దీనిని లాంగ్ రేంజ్ థ్రెట్స్ ను ఎదుర్కొనేలా మెరుగుపరుస్తున్నారు. అయితే, ఈ సిస్టమ్‌లు ఇంకా S-500లా 2,000 కిలోమీటర్లు, అంతరిక్ష లక్ష్యాలను నాశనం చేసే సామర్థ్యానికి సమానంగా రాలేదు. భారతదేశం S-500 తరహా సామర్థ్యాలను సాధించడానికి ఇస్రో తో కలిసి అంతరిక్ష-ఆధారిత సెన్సార్‌లు, రాడార్‌లను అభివృద్ధి చేయడంపై దృష్టి సారిస్తోంది. అప్పటి వరకు రష్యా తయారు చేసిన S-500ను కొనుగోలు చేయాల్సిందే.