
అసలు బంగ్లాదేశ్ లో ఏం జరుగుతోంది. తాత్కాలిక పాలకుడు యూనస్, సైన్యాధిపతి జామాన్ మధ్య గొడవలు ఏంటి..? యూనస్ తన పదవిని వదులుకోవాలని అనుకుంటున్నాడా..? అవామీ లీగ్ పార్టీని ఎందుకు నిషేధించారు.? దీనిపై షేక్ హసిన రియాక్షన్ ఏంటి..? భారత్ పై సంబంధాలను యూస్ ఎందుకు తెగదెంపులు చేసుకుంటున్నారు.
బంగ్లాదేశ్ లో పరిస్థితులు మారిపోతున్నాయి. అక్కడ తాత్కాలిక ప్రభుత్వానికి.. సౌన్యానికి మధ్య దూరం పెరుగుతోంది. మరోసారి అక్కడ ప్రభుత్వం పడిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. షేక్ హసీనా పదవి కోల్పోయిన తర్వాత తాత్కాలిక ప్రభుత్వాధినేతగా యూనస్ బాధ్యతలు చేపట్టాడు. తాజాగా యూనస్ ఆ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దేశంలో రాజకీయ పార్టీల మధ్య సఖ్యత కుదరకపోవడం వల్లే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నేషనల్ సిటిజన్ పార్టీ చీఫ్ నహిద్ ఇస్లామ్.. యూనస్ రాజీనామాపై క్లారిటీ ఇచ్చారు. యూనస్ రాజీనామా గురించి వచ్చిన వార్తలు తాను విన్నానని… దానిపై చర్చించేందుకు ఆయన్ను కలిశానని… రాజీనామా గురించే ఆలోచిస్తున్నానని యూనస్ తనతో చెప్పినట్టు నహిద్ ఇస్లామ్ తెలిపారు. అయితే ఇటీవల యూనస్ ప్రభుత్వం పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. అందులో బంగ్లా ఆర్మీ చీఫ్ జనరల్ వకార్- ఉజ్- జమాన్‌తో నెలకొన్న విభేదాలు ముఖ్యమైనవి. హసీనా రాజీనామా తర్వాత వీరు కలిసే ఉన్నప్పటికీ.. ఎన్నికల నిర్వహణ, సైనిక వ్యవహారాల్లో జోక్యంతో సహా యూనస్ తీసుకొంటున్న పలు నిర్ణయాల విషయంలో వీరి మధ్య విభేదాలు ఏర్పడినట్లు తెలుస్తోంది. 2026 జూన్‌లో ఎన్నికలు జరుగుతాయని యూనస్ పేర్కొనడంపై దేశంలోని కొన్ని పార్టీలు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి.
మరోవైపు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం భారత్‌తో పూర్తిగా తెగదెంపులు చేసుకునే చర్యలు చేపడుతోంది. ఇప్పటికే యూనస్ సలహాలతో పనిచేసే ప్రభుత్వం భారత్ కు వ్యతిరేకంగా పలు చర్యలు చేపట్టింది. తాజాగా మరో నిర్ణయం వీటికి తోడైంది. సముద్రంలో వినియోగించే అత్యాధునిక టగ్ బోట్ నిర్మాణం కోసం కోల్‌కతాకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్-ఇంజినీర్స్ తో ఉన్న ఓ ఒప్పందాన్ని రద్దు చేసుకొంది. దీని విలువ రూ.180.25 కోట్లు. జీఆర్‌ఎస్‌ఈ రక్షణశాఖ కింద పని చేస్తోంది. తాజాగా బంగ్లాదేశ్ ఈ ఒప్పందం రద్దు విషయాన్ని స్టాక్ మార్కెట్‌కు తెలియజేసింది. ఇటీవల కాలంలో యూనస్‌కు చైనాతో సంబంధాలు బలపడుతున్నాయి. దీంతో బంగ్లాదేశ్ నిర్ణయాలు తరచూ భారత్‌కు వ్యతిరేకంగా వెలువడుతున్నాయి. దీనికితోడు చైనా పర్యటనలో యూనస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్ ఈశాన్య రాష్ట్రాల చుట్టూ భూభాగంతో మూసుకుపోయాయని.. ఈ ప్రాంతాలకు సముద్రంతో అనుసంధానించేందుకు ఢాకానే దిక్కని అన్నారు. దీనికితోడు ఆయన కార్యవర్గంలోని వారు తరచూ భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాలపై ప్రకటనలు చేస్తున్నారు. ఈ చర్యలు భారత్‌తో దూరాన్ని పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల భారత్ ప్రతిచర్యలకు దిగింది. బంగ్లాదేశ్ సరకును మన దేశం మీద నుంచి రవాణాకు ఉన్న అన్ని అనుమతులను రద్దు చేసింది.
మరోవైపు యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఒక షాకింగ్ నిర్ణయం తీసుకుంది. షేక్ హసినాకు చెందిన అవామీ లీగ్ పార్టీని అధికారికంగా నిషేధించింది. ఈ ప్రకటన దేశంలో రాజకీయ ఉద్రిక్తతలను మరింత పెంచింది. ఈ నిషేధానికి వ్యతిరేకంగా గట్టిగా పోరాడాలని అవామీ లీగ్ పార్టీ నిర్ణయించింది. యూనస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అవామీ లీగ్ నాయకులపై దాడులు పెరిగిపోయాయి. వారి ఇళ్లను ధ్వంసం చేశారు. అసలు ఆ పార్టీ లేకుండా చేయాలని చాలా ప్రయత్నాలు చేశారు. చివరికి పార్టీని కూడా నిషేధించారు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జనరల్ జమాన్ సీనియర్ అధికారులతో సమావేశమై దీనిపై చర్చించారు. ఇటీవల యూనస్ కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా ఖైదీలను విడుదల చేయడం సైన్యానికి అతిపెద్ద సమస్యగా ఉందని అంటున్నారు. దీనికి తోడు యూనస్ సైన్యాధిపతి లేని సమయంలో జాతీయ భద్రతా సలహాదారును నియమించడం ద్వారా సైన్యంలో విభజన సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని భావిస్తున్నారు. జమాన్ మొదట యూనస్‌కు సహాయం చేయడానికి ప్రయత్నించినప్పటికీ, విదేశీ జోక్యం కారణంగా ఆయన ఇప్పుడు త్వరగా ఎన్నికలు జరపాలని కోరుకుంటున్నారంట. ఆయన ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలతో రహస్యంగా సంప్రదింపులు జరిపి, ప్రజాస్వామ్యం కోసం కలిసి పోటీ చేయాలని కోరినట్లు తెలిసింది. దేశంలో ఇస్లామిక్ ఉగ్రవాదం పెరిగిపోతోందని జమాన్ భావిస్తున్నారు. దీనిని అరికట్టాల్సిన అవసరం ఉందని చెబుతన్నారు.
బంగ్లాదేశ్‌లో పరిస్థితులు రోజురోజుకూ అస్తవ్యస్తంగా మారుతున్నాయి. అవామీ లీగ్ పై నిషేధం, యూనస్, ఆర్మీ చీఫ్ మధ్య గొడవలు అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్ లో చైనా, పాకిస్థాన్ జోక్యాన్ని జమాన్ అసలు ఒప్పుకోవడం లేదు. ఇటీవల పాకిస్థాన్ ఐఎస్ఐ అధిపతి లెఫ్ట్‌నెంట్ జనరల్ ఆసిమ్ మాలిక్ ఈ ఏడాది ప్రారంభంలో క్వార్టర్ మాస్టర్ లెఫ్ట్‌నెంట్ జనరల్ ఫైజుర్ రహ్మాన్‌తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భారతదేశ ఈశాన్య ప్రాంతంలో ఇబ్బందులు కలిగించడం, చొరబాట్ల అంశంపై పాకిస్థాన్ కుట్రలు చేసినట్టు తెలుస్తోంది. దీని తర్వాత ఫైజుర్ రహ్మాన్ నేతృత్వంలో ఒక తిరుగుబాటు ప్రయత్నం విఫలమైంది. క్రమశిక్షణ కలిగిన అధికారులు సైన్యాధిపతి జమాన్ కి వ్యతిరేకంగా వెళ్లడానికి నిరాకరించారని తెలుస్తోంది. రహ్మాన్ ఇస్లామిస్ట్, పాకిస్థాన్ అనుకూల ధోరణి, జమాన్ భారత్ అనుకూల ధోరణి వల్ల సైన్యంలో గ్రూపులు ఏర్పడ్డాయి. ఎక్కువ మంది జమాన్ వైపే నిలిచారు. ఎందుకంటే ఎక్కువ మంది బంగ్లాదేశీ సైనికులు తమ దేశంలో పాకిస్థాన్ జోక్యాన్ని కోరుకోవడం లేదు. అటు తన తిరుగుబాటు ప్రయత్నం విఫలం కావడంతో ఫైజుర్ రహ్మాన్ జమాన్ పై కుట్రలకు ప్లాన్ చేస్తున్నాడు. దీంతో దేశంలో ఎన్నికలు జరిగితేనే ప్రస్తుత పరిస్థితులు చక్కబడతాయని సైన్యాధిపతి జమాన్ భావిస్తున్నారంట. అంతేకాదు యూనస్ ఆధ్వర్యంలో తాత్కాలిక ప్రభుత్వం దేశాన్ని చక్కదిద్దడంలో విఫలమైనందుకు జమాన్ బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దేశంలో స్థిరత్వం పునరుద్ధరించబడిన తర్వాతే సైన్యం తిరిగి బ్యారక్‌లకు వెళ్లాలని సూచించారు. అప్పటి వరకు అలర్ట్ గా ఉండాలని అంటున్నారు. అయితే ఒక వేళ ఎన్నికల జరిగితే యూనస్ కు వ్యతిరేకత ఉండే అవకాశం చాలా ఉందంటున్నారు. ఎందుకంటే షేక్ హసీనపై కోపంతో విద్యార్థి నేతలు.. యూనస్ ను గద్దె ఎక్కించారు కాని.. ఆ తర్వత పరిస్థితి వాళ్ల పరిస్థితి పెనంపై నుంచి పొయ్యిలో పడిందని అంటున్నారు. దేశంలో అశాంతి రేగింది. దీంతో చాలా మంది యూనస్ ను గద్దె దిగాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో వ్యతిరేకత పెరుగుతోందని భావిస్తోన్న యూనస్ స్వయంగా గద్దె దిగే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.