
యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు మరోసారి ఇజ్రాయిల్ పై గురిపెట్టారు. ఆ దేశంలోని బెన్ గురియన్ ఎయిర్‌పోర్టు లక్ష్యంగా హైపర్‌సోనిక్ క్షిపణి దాడి చేశారు. అయితే ఇది ఎయిర్ పోర్ట్ పక్కన పడింది. ఈ దాడిలో ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు. దాడి కారణంగా ఎయిర్‌పోర్టులో విమానా సేవలు తాత్కాలికంగా నిలిపివేశారు. బెన్ గురియన్ ఎయిర్‌పోర్టును లక్ష్యంగా చేసుకుని తమ సామర్థ్యం ఏంటో చూపించామని హౌతీలు సోషల్ మీడియాలో ప్రకటించారు. ఈ దాడి గాజాలో ఇజ్రాయిల్ చర్యలకు ప్రతీకారంగా జరిగినట్లు హౌతీలు చెప్పారు. ఈ దాడిపై ఇజ్రాయిల్ రక్షణ మంత్రి తీవ్రంగా స్పందిచారు. తమపై దాడి చేసిన వారిని దెబ్బకు దెబ్బ తీస్తామని హెచ్చరించారు.
ఇజ్రాయిల్ పై మరోసారి దాడి జరిగింది. శత్రు దుర్భేద్యంగా ఉండే ఆ దేశంలోకి అత్యాధునికి హైపర్ సోనిక్ క్షిపిణి వచ్చి పడింది. దీంతో ఇజ్రాయిల్‌లోని బెన్ గురియన్ ఎయిర్‌పోర్టులో అలజడి రేగింది. ఈ దాడి ఎలా జరిగింది? ఎవరు దీని వెనుక ఉన్నారు? ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు ఎలా స్పందించారు? భారత్ విమానం ఎలా తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది..?
ఇజ్రాయిల్ పై క్షిపణి దాడి కారణంగా భారత్‌కు చెందిన ఎయిర్ ఇండియా విమానం, ఢిల్లీ నుంచి టెల్ అవీవ్ వెళ్తూ అబుదాబికి డైవర్ట్ చేయబడింది. ఈ విమానం సురక్షితంగా అబుదాబిలో ల్యాండ్ అయింది. అటు ఈ విమానంలో తెలుగువారు కూడా ఉన్నట్టు సమాజారం. అటు ఇజ్రాయిల్ వెళ్లే విమానాలను మే 6 వరకు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. ప్రయాణికులు, సిబ్బంది భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది.
క్షిపణి దాడిలో హౌతీ తిరుగుబాటుదారులు హైపర్‌సోనిక్ క్షిపణిని ప్రయోగించారు. ఇజ్రాయిల్ గగనతలంలోకి ఈ క్షిపణి ప్రవేశించినప్పుడు ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్ గుర్తించినా నిలువరించలేకపోయాయి. ఎయిర్‌పోర్టుకు సమీపంలో ఉన్న ఖాళీ ప్రదేశంలో క్షిపణి పడింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. కానీ ఎయిర్‌పోర్టు టెర్మినల్‌లో ఉన్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇజ్రాయిల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఐరన్ డోమ్ ఈ క్షిపణిని అడ్డుకోలేకపోయాయని అంటున్నారు.
హౌతీలు గతంలో కూడా ఇజ్రాయిల్‌పై క్షిపణి, డ్రోన్ దాడులు చేశారు. కానీ ఈసారి హైపర్‌సోనిక్ క్షిపణి ప్రయోగించారు. ఇది ఇజ్రాయిల్ రక్షణ వ్యవస్థలకు సవాలుగా మారింది. ఈ దాడి హిజ్బుల్లా నాయకుడు హసన్ నస్రల్లా మరణానికి ప్రతీకారంగా జరిగినట్లు హౌతీ నాయకుడు అబ్దుల్ మాలిక్ అల్-హౌతీ ప్రకటించాడు. ఇలాంటి దాడులు ఇంకా కొనసాగుతాయని.. ఇజ్రాయిల్ సిద్ధంగా ఉండాలని హెచ్చరించాడు.
ఈ దాడి తర్వాత ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మంత్రులు, రక్షణ శాఖ అధికారులతో సమావేశమై ఈ ఘటనపై చర్చించారు. నెతన్యాహు ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. హౌతీలకు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో హౌతీలకు వ్యతిరేకంగా తీవ్రమైన దాడులు జరిగే అవకాశం ఉంది. తమపై దాడి చేసేవారికి తగిన బుద్ధి చెబుతామని.. ఇజ్రాయిల్ ఇప్పటికే వార్నింగ్ ఇచ్చింది. దీనికి తోడు ఇరాన్ ను హెచ్చరించారు. ఇరాన్ తో పాటు మిడిల్ ఈస్ట్‌లో ఇజ్రాయిల్ ఎక్కడికైనా దాడి చేయగలదని చెప్పారు.
ఈ దాడి తర్వాత ఇజ్రాయిల్‌లో భద్రతా ఏర్పాట్లను మరింత కఠినతరం చేశారు. బెన్ గురియన్ ఎయిర్‌పోర్టులో తాత్కాలికంగా విమాన సేవలు నిలిపివేయడంతో అంతర్జాతీయ ప్రయాణికులు ఇబ్బందులు పడుతన్నారు. ఈ దాడి ఇజ్రాయిల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ల సామర్థ్యంపై ప్రశ్నలు లేవనెత్తింది. ముఖ్యంగా హైపర్‌సోనిక్ క్షిపణిని అడ్డుకోలేకపోయినట్లు కొందరు ఆరోపించారు. ఇజ్రాయిల్ సైన్యం ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతోంది. హౌతీలు మరిన్ని దాడులు చేస్తామని హెచ్చరించడంతో, మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ పరిణామాలు ఎలా రాజకీయంగా ప్రభావితం చేశాయి?
హౌతీలు గతంలో కూడా బెన్ గురియన్ ఎయిర్‌పోర్టును లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపారు. నెతన్యాహు అమెరికా నుంచి తిరిగి వస్తుండగా, హౌతీలు 2 బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించారు. అయితే వాటిని ఇజ్రాయిల్ యారో డిఫెన్స్ సిస్టమ్ అడ్డుకుంది. మార్చి 20 మరో హైపర్‌సోనిక్ క్షిపణి దాడి జరిగింది. దీనిని కూడా ఇజ్రాయిల్ అడ్డుకుంది. ముఖ్యంగా హిజ్బుల్లా నాయకుడు నస్రల్లా మరణం తర్వాత ఇజ్రాయిల్‌పై ఈ దాడులు ఎక్కువయ్యాయి.
ఈ క్షిపణి దాడి మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలను మరింత పెంచింది. హౌతీలపై ఇజ్రాయిల్ ప్రతీకార చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇది ఇరాన్, హిజ్బుల్లాపై ఇజ్రాయిల్ ప్రతీకారం తీర్చుకునే దిశగా వెళ్లొచ్చు. ఈ వ్యవహారం ఇజ్రాయిల్, ఇరాన్ మద్దతు గల గ్రూపుల మధ్య దూరాన్ని పెంచుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే గాజాపై ఇజ్రాయిల్ దాడితో మొత్తం ధ్వంసమైంది. ఇప్పుడు ఇజ్రాయిల్ ఏం చేస్తుందనే ఉత్కంఠ నెలకొంది.