
Kolkata Law College Student Gang rape: పశ్చిమ బెంగాల్‌లో మరో దారుణ ఘటన జరిగింది. కోల్‌కతాలోని ఆర్జీ కర్ ఆసుపత్రిలో జరిగిన అత్యాచారం, హత్య ఘటన ఇంకా మరవకముందే.. ఓ లా కాలేజీలో 24 ఏళ్ల విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ ఘటన కలకలం రేపింది. నిందితుల్లో ఒకరు టీఎంసీ నేత కావడంతో రాజకీయ దుమారం రేగింది. అసలు లా కాలేజీలో ఏం జరిగింది..? ఈ ఘటన రాజకీయ రంగు పులుముకోవడానికి కారణం ఏంటి..? మమతా బెనర్జీ సర్కార్‌పై బీజేపీ నేతలు ఎందుకు తీవ్ర విమర్శలు చేస్తున్నారు?
కోల్‌కతాలోని ఓ ప్రముఖ లా కాలేజీలో 24 ఏళ్ల విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ ఘటన సంచలన రేపింది. 2024 ఆగస్టు ఆర్జీ కర్ ఆసుపత్రి అత్యాచారం, హత్య వ్యవహారం మర్చిపోకముందే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఈ ఘటన జరగడం తీవ్ర దుమారానికి కారణమైంది. లా కాలేజీలో చదువుతున్న ఓ యువతిని ఇద్దరు సీనియర్ విద్యార్థులు, ఒక మాజీ విద్యార్థి కలిసి కాలేజీ క్యాంపస్‌లోని ఓ గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. బాధితురాలు కస్బా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. Kolkata Law College Student Gang rape.
క్యాంపస్‌లోని సీసీటీవీ ఫుటేజ్, ఇతర ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నారు. పోలీసులు బాధితురాలి స్టేట్ మెంట్ రికార్డ్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మోనోజిత్ మిశ్రాను కాళ్లు పట్టుకొని బతిమిలాడినా తనను వదిలిపెట్టలేదని.. పైగా ఈ దుశ్చర్యను వారు ఫోన్లలో రికార్డు చేశారని బాధితురాలు వాపోయింది. మోనోజిత్ ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి విభాగమైన తృణమూల్ కాంగ్రెస్ ఛత్ర పరిషత్ దక్షిణ కోల్‌కతా జిల్లా యూనిట్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. తనను పెళ్లి చేసుకోవాలని కోరగా.. తనకు బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడంటూ ఆమె నిరాకరించడం వల్లే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. బాయ్‌ఫ్రెండ్‌ను చంపేస్తానని, తన తల్లిదండ్రులను తప్పుడు కేసుల్లో ఇరికిస్తానని బెదిరిస్తూ కళాశాలలో బంధించాడని బాధితురాలు ఆరోపించింది. మరో ఇద్దరు విద్యార్థులు జుబీర్ అహ్మద్ , ప్రామిత్ ముఖర్జీతో కలిసి తనపై దాడి చేయగా ప్రతిఘటించేందుకు ప్రయత్నించానని బాధితురాలు పోలీసులకు తెలిపింది. మోనోజిత్ కాళ్లు పట్టుకొని వదిలేయాలని ప్రాధాయపడినా.. వదల్లేదని బాధితురాలు వాపోయింది. ఆ తర్వాత సెక్యూరిటీ గార్డు రూమ్‌లోకి బలవంతంగా లాక్కెళ్లి అత్యాచారానికి ఒడిగట్టారని తెలిపింది.
అటు ఈ దారుణంపై జాతీయ మహిళా కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. న్యాయ కళాశాల ప్రాంగణంలో జరిగిన ఈ దుర్మార్గపు ఘటనను సుమోటోగా తీసుకున్న కమిషన్.. దీనిపై సమగ్ర విచారణ జరపాలని కోల్‌కతా నగర పోలీస్ కమిషనర్‌కు లేఖ రాసింది. బాధితురాలికి వైద్య, మానసికపరమైన, న్యాయపరమైన సహకారం అందించాలని కమిషన్ ఛైర్‌పర్సన్ విజయ రహత్కర్ సూచించారు. ఈ ఘటనలో తీసుకున్న చర్యలపై మూడు రోజుల్లో నివేదిక సమర్పించాలని కోరారు.
గ్యాంగ్ రేప్ ఘటనపై బీజేపీ నేతలు మమతా బెనర్జీ సర్కార్‌ను తీవ్రంగా విమర్శిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ లో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి సుకాంత మజుందార్ విమర్శించారు. మమతా బెనర్జీ స్వయంగా హోం శాఖ చూస్తున్నా, ఆడవాళ్లు కాలేజీల్లో కూడా సురక్షితంగా లేరని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్త నిరసనలు చేస్తామని బీజేపీ నేత సువేందు అధికారీ హెచ్చరించారు. ఓ టీఎంసీ నేత కొడుకు ఈ కేసులో ఉన్నాడని బీజేపీ నేత అమిత్ మాలవీ ఆరోపించారు. ఈ ఆరోపణలు రాజకీయ రగడను రేపాయి. మమతా రాజీనామా చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో ఆడవాళ్ల భద్రత సమస్యను ఈ ఘటన మళ్లీ ప్రశ్నిస్తోందని వారు అంటున్నారు. ఈ విమర్శలు టీఎంసీ సర్కార్‌పై ఒత్తిడిని పెంచాయి.
2024 ఆగస్టు 9న కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో 31 ఏళ్ల మహిళా డాక్టర్‌పై అత్యాచారం, హత్య జరిగింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆసుపత్రిలోని సెమినార్ హాల్‌లో ఆమె మృతదేహం కనిపించింది. కోల్‌కతా పోలీసులు మొదట విచారణ చేపట్టి, శాంజయ్ రాయ్ అనే సివిక్ వాలంటీర్‌ను అరెస్ట్ చేశారు. విచారణలో జాప్యం, పొరపాట్ల కారణంగా కలకత్తా హైకోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగించింది. సీబీఐ విచారణలో శాంజయ్ రాయ్ ఒక్కడే నేరస్తుడని, ఇది గ్యాంగ్ రేప్ కాదని తేలింది. 2025 జనవరిలో కోల్‌కతా కోర్టు రాయ్‌కు జీవిత ఖైదు విధించింది. ఈ ఘటన తర్వాత జూనియర్ డాక్టర్లు 42 రోజుల పాటు సమ్మె చేశారు. దేశవ్యాప్తంగా నిరసనలు జరిగాయి. సుప్రీంకోర్టు ఈ కేసును స్వయంగా స్వీకరించి, డాక్టర్ల భద్రత కోసం జాతీయ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది.
కోల్‌కతా లా కాలేజీ గ్యాంగ్ రేప్ ఘటన మమతా బెనర్జీ ప్రభుత్వంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆర్జీ కర్ ఘటన తర్వాత రాష్ట్రంలో ఆడవాళ్ల భద్రతపై ఇప్పటికే పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. ఈ కొత్త ఘటన ఆ ఒత్తిడిని మరింత పెంచింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. మమతా బెనర్జీ స్వయంగా హోం శాఖ చూస్తున్నందున, ఈ ఘటనపై ఆమెపై నేరుగా విమర్శలు వస్తున్నాయి. ఓ టీఎంసీ నేత కొడుకు ఈ కేసులో ఉన్నాడనే ఆరోపణలు రాజకీయ రగడను తీవ్రం చేశాయి. ఈ ఘటన తర్వాత రాష్ట్రవ్యాప్త నిరసనలు, బీజేపీ ఆందోళనలు పెరిగాయి. ఈ ఘటన మమతా సర్కార్‌పై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఆడవాళ్ల భద్రత గురించి మరింత చర్చ జరిగేలా ఈ ఘటన చేస్తుంది.