
భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్తితులు నెలకొనడంతో కేంద్ర హోం శాఖ ఇవాళ దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా 259 ప్రాంతాల్లో నిర్వహిస్తోన్న ఈ మాక్ డ్రిల్ ద్వారా సంక్షోభ సమయంలో తమను తాము ఎలా రక్షించుకోవాలో ప్రజలకు చెబుతారు. ఇందులో భాగంగా హైదరాబాద్ లో ఆపరేషన్ అభ్యాస్ పేరుతో డిఫెన్స్ మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. దీంతో నగరమంతా సైరన్ల మోత మోగనుంది. ఇవాళ సాయంత్రం 4 గం. 15 ని. నగరంలోని సికింద్రాబాద్, గోల్కొండ, కంచన్ బాగ్, డీఆర్డీఓ, మౌలాలి ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహిస్తారు. ఇందులో పోలీసులు, ఫైర్ సిబ్బందితో పాటు ఎన్డీఆర్ఎఫ్, వైద్య, రెవెన్యూ అధికారులు పాల్గొంటారు. అలాగే ఈ నాలుగు ప్రాంతాల్లో ఎయిర్ రైడ్ డ్రిల్ కూడా నిర్వహిస్తారు. దీంతో హైదరాబాద్ మొత్తం సైరన్ల మోత మోగనుంది. అలాగే నగరంలోని అన్ని చౌరస్తాలో రెండు నిమిషాల పాటు సైరన్లు మోగుతాయి. సైరన్ రాగానే ఎలక్ట్రికల్ పరికరాలు, లైట్లు, స్టవ్ లు ఆపాలని అధికారలు సూచించారు. ఇప్పటికే ఈ మాక్ డ్రిల్ లో పాల్గొనాలని సివిల్ డిఫెన్స్ వార్డెన్లు, వాలంటీర్లు, హోంగార్డులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, నెహ్రూ యువజన కేంద్ర సంఘటన్ తో పాటు కాలేజీ, పాఠశాలల విద్యార్థులకు ప్రభుత్వం పిలుపిచ్చింది.