మణిపూర్‌లో మళ్లీ హింస.. అరంబై తెంగోల్ నాయకుడి అరెస్ట్‌తో ఉద్రిక్తతలు.!!

మణిపూర్‌ మళ్లీ అల్లకల్లోలం మారింది. రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌తో సహా ఐదు జిల్లాల్లో హింసాత్మక ఆందోళనలు చెలరేగాయి. మైతీ సంస్థ అరంబై తెంగోల్ నాయకుడు కానన్ సింగ్‌ను అరెస్ట్ చేయడం ఈ గొడవలకు కారణమైంది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో అధికారులు ఐదు జిల్లాల్లో కర్ఫ్యూ, ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. ఇంతకీ ఈ అరంబై తెంగోల్ సంస్థ ఏమిటి? ఈ హింస ఎందుకు చెలరేగింది? మణిపూర్‌లో ప్రస్తుత పరిస్థితి ఏమిటి? గతంలో జరిగిన అల్లర్లకు ఇప్పటి గొడవలకు సంబంధం ఏంటి..?

మణిపూర్‌లో కొనసాగుతున్న మైతీ-కుకీ-జో జాతుల మధ్య హింస మళ్లీ ఉద్ధృతమైంది. ఈ హింసలో ఇప్పటివరకు 260 మందికి పైగా మరణించారు. దాదాపు 60 వేల మంది నిరాశ్రయులయ్యారు. తాజాగా మైతీ సంస్థ అరంబై తెంగోల్ నాయకుడు కానన్ సింగ్‌తో సహా ఐదుగురు సభ్యులను కేంద్ర దర్యాప్తు సంస్థ, జాతీయ దర్యాప్తు సంస్థ ఇంఫాల్ విమానాశ్రయంలో అరెస్ట్ చేశాయి. కానన్ సింగ్, గతంలో మణిపూర్ పోలీసు కమాండో విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేశాడు.. 2024 ఫిబ్రవరిలో ఒక సీనియర్ పోలీసు అధికారి ఇంటిపై దాడి, కిడ్నాప్ కేసులో నిందితుడిగా ఉన్నాడు. డ్యూటీలో నిర్లక్ష్యంగా ఉన్న కారణంగా పోలీసు ఉద్యోగం నుంచి సస్పెండ్ అయ్యాడు. అరంబై తెంగోల్ సంస్థ, మైతీ సంస్కృతిని పరిరక్షించే సాంస్కృతిక సంస్థగా మొదలై, ఆ తర్వాత వివాదాస్పద సంస్థగా మారింది. ఇందులో కీలక నాయకుడే కానన్ సింగ్. 2023లో మణిపూర్ హింసలో ఈ సంస్థ సభ్యులు 6,000కు పైగా ఆయుధాలను రాష్ట్ర ఆయుధాగారాల నుంచి దొంగిలించారని, కుకీ-జో గ్రామాలపై దాడులు చేశారని ఆరోపణలు ఉన్నాయి. కానన్ సింగ్ అరెస్ట్ వార్త వ్యాపించడంతో ఇంఫాల్‌లో ఆందోళనలు మొదలయ్యాయి.

కానన్ సింగ్, మరో నలుగురు అరంబై తెంగోల్ సభ్యుల అరెస్ట్‌తో మణిపూర్‌లో శనివారం రాత్రి నుంచి హింసాత్మక ఆందోళనలు చెలరేగాయి. ఇంఫాల్ వెస్ట్, ఇంఫాల్ ఈస్ట్, థౌబల్, బిష్ణుపూర్, కాక్చింగ్ జిల్లాల్లో ఆందోళనకారులు రోడ్లపై వాహనాలను తగలబెట్టారు. ఇంఫాల్ ఈస్ట్‌లో ఒక బస్సును మంటల్లో దహనం చేశారు. కొందరు ఆందోళనకారులు ఆత్మహత్య చేసుకుంటామని బెదిరింపులతో పెట్రోల్‌ను తమపై పోసుకున్నారు. అరెస్ట్ చేసిన నాయకులను తరలించకుండా అడ్డుకునేందుకు ఇంఫాల్ అంతర్జాతీయ విమానాశ్రయ గేట్‌ను ఆందోళనకారులు ముట్టడించారు. ఈ ఆందోళనల్లో ఒక జర్నలిస్ట్‌తో సహా 10 మంది గాయపడ్డారు. కానన్ సింగ్ అరెస్ట్‌కు నిరసనగా ఆదివారం నుంచి 10 రోజుల పాటు ఇంఫాల్ లోయ జిల్లాల్లో పూర్తి బంద్‌కు పిలుపునిచ్చింది. కానన్ సింగ్ భార్య ఆసెమ్ గుని, తన భర్త రాష్ట్ర సమగ్రతను కాపాడేందుకు ప్రజా రక్షణ కార్యక్రమంలో చేరాడని, అతని అరెస్ట్ అన్యాయమని తెలిపారు. ఈ హింసాత్మక ఆందోళనలు మణిపూర్‌లో ఇప్పటికే ఉన్న జాతి ఉద్రిక్తతలను మరింత తీవ్రతరం చేశాయి.

మణిపూర్‌లో ఈ హింసాత్మక ఆందోళనలను అదుపు చేసేందుకు అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. ఇంఫాల్ వెస్ట్, ఇంఫాల్ ఈస్ట్, థౌబల్, బిష్ణుపూర్, కాక్చింగ్ జిల్లాల్లో నిషేధాజ్ఞలు విధించారు. ఇంఫాల్ ఈస్ట్ జిల్లాలో రాత్రుళ్లు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా కర్ఫ్యూ విధించారు. ఈ ఐదు జిల్లాల్లో ఇంటర్నెట్, మొబైల్ డేటా సేవలు ఐదు రోజుల పాటు నిషేధించారు. సోషల్ మీడియా ద్వారా హింసను రెచ్చగొట్టే ఫోటోలు, హేట్ స్పీచ్, వీడియోల వ్యాప్తిని అడ్డుకోవడానికి ఈ చర్యలు చేపట్టారు. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదనంగా, కేంద్ర, రాష్ట్ర బలగాలను భారీగా మోహరించారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ వాడారు. ఈ ఘర్షణల్లో ముగ్గురు గాయపడ్డారు.

మణిపూర్‌లో ప్రస్తుత పరిస్థితి ఇప్పటికీ ఉద్రిక్తంగా ఉంది. అరంబై తెంగోల్ నాయకుల అరెస్ట్‌కు నిరసనగా జరిగిన ఆందోళనలు రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌తో సహా ఐదు జిల్లాల్లో హింసాత్మకంగా మారాయి. ఈ ఆందోళనల నేపథ్యంలో 25 మంది శాసనసభ్యులు, ఒక ఎంపీ ఆదివారం రాష్ట్ర గవర్నర్ అజయ్ కుమార్ భల్లాను కలిసి, ఈ హింస, రాష్ట్రంలో ఎన్నికైన ప్రభుత్వాన్ని పునరుద్ధరించే అంశంపై చర్చించారు. 2023 మే నుంచి మైతీ, కుకీ-జో జాతుల మధ్య జరుగుతున్న హింస కారణంగా మణిపూర్‌లో రాజకీయ సంక్షోభం నెలకొంది. ఈ ఏడాది ఫిబ్రవరి 13న ముఖ్యమంత్రి ఎన్. బీరెన్ సింగ్ రాజీనామాతో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు. ఈ హింసల కారణంగా 2023 నుంచి జరుగుతున్న కేసుల విచారణను మణిపూర్ నుంచి గౌహతికి తరలించారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్, మణిపూర్ హింసకు అక్రమ వలసలు, డ్రగ్స్ వ్యాపారం ప్రధాన కారణాలని ఆరోపించారు. అరంబై తెంగోల్ సంస్థ, కుకీ-జో సంఘాలపై దాడులతో పాటు, రాష్ట్రంలో హింసను రెచ్చగొట్టడంలో ఇవి ముఖ్య పాత్ర పోషించినట్టు ఆరోపణలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఈ ఉద్రిక్తతలు ఎలా సాగుతాయి? శాంతి కోసం ఏం చర్యలు తీసుకుంటారు? అనే చర్చ కొనసాగుతోంది.