
ఐపీఎల్ పోరుకు సర్వ సిద్ధమైంది. నరేంద్రమోడీ స్టేడియంలో పందెంలో గెలిచేందుకు రేసు గుర్రాలు కయ్యానికి కాలు దువ్వతున్నాయి. నువ్వా నేనా అంటూ సాగే ఈ సమరంలో పంజాబ్ పవర్ చూపింస్తుందా….18 ఏళ్ల నాటి ఫ్యాన్స్ బెంగను బెంగుళూరు తీరుస్తుందా….? సమ ఉజ్జీవులుగా బరిలోకి దిగుతున్న పంజాబ్ బెంగుళూరు జట్లలో ప్రేక్షకుల మనుసులో నిలిచేదెవరు….మొదటి సారి కప్ ముద్దాడేది ఎవరు…? కొత్త ఛాంపియన్స్‌గా చరిత్ర పుటల్లోకి ఎక్కేదెవరు…హోరా హోరీగా సాగబోతున్న ఐపీఎల్ ఆఖరి పోరుపై మెగా 9 టీవీ స్పెషల్ డ్రైవ్….
క్వాలిఫయర్ 2లో ముంబై ఇండియన్స్‌పై అద్భుత విజయాన్ని సాధించిన పంజాబ్ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఐపీఎల్ ఫైనల్ లో పంజాబ్ కింగ్స్ అడుగుపెట్టిన పంజాబ్…. తుది పోరులో బెంగళూరుతో తలపడబోతోంది. ఇప్పటి వరకూ అటు బెంగళూరు, ఇటు పంజాబ్ ఒక్క ఐపీఎల్ టోర్నీ కూడా గెలవలేదు. ఎవరు విజేతగా నిలిచినా.. అది చరిత్రే అవ్వనుంది.
అటు 18 సీజన్ల పాటు ఐపీఎల్ కప్పు బెంగళూరుని ఊరిస్తూనే ఉంది. ఈసారి కప్ మనదే అంటూ ప్రతీసారీ అభిమానులకు మాట ఇవ్వడం, ఉత్తి చేతులతో ఇంటికి వెళ్లడం బెంగళూరుకు ఆనవాయితీగా వస్తోంది. ఈసారి మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ కప్పు చేజారిపోకూడదన్న కసి.. బెంగళూరు ఆటగాళ్లలో కనిపిస్తోంది. పైగా 18 అనేది కోహ్లీ జెర్సీ నెంబర్. ఇది 18వ ఐపీఎల్. సెంటిమెంట్ ప్రకారం.. కప్పు కొట్టే ఛాన్స్ బెంగళూరుదే అని అభిమానులు లెక్కలేస్తున్నారు. బెంగళూరు టాప్ ఆర్డర్ ఫామ్ లో ఉండడం, కోహ్లీ నిలకడగా ఆడుతుండడం, బౌలర్లు సమష్టిగా రాణించడం, అభిమానుల అండ, దండ ఇవన్నీ బెంగళూరుకు ప్లస్ పాయింట్స్. అయితే కీలకమైన మ్యాచ్‌లలో చేతులెత్తేయడం కూడా ఈ జట్టుకు ఆనవాయితేనే. అది బలహీనతగా మారకూడదని ఫ్యాన్స్ కోరకుకుంటున్నారు.
ఇక మరోవైపు పంజాబ్ కింగ్స్ పై ముందు నుంచీ ఎవరికీ నమ్మకాల్లేవు. కానీ ఆ జట్టు అందరినీ ఆశ్చర్యపరుస్తూ అద్భుతమైన ఫలితాల్ని అందుకొంది. ఓపెనర్లు శుభారంభాల్ని అందిస్తున్నారు. ఇంగ్లీస్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. క్వాలిఫయింగ్ 2లో ముంబై చేతిలోంచి మ్యాచ్ లాగేసుకోవడం వెనుక ఇంగ్లీస్ పాత్ర కీలకం. బుమ్రా ఓవర్లో 20 రన్స్ కొట్టి, ముంబై ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీశాడు. బ్యాటింగ్ లైనప్ కూడా చాలా బలంగా ఉంది.
అన్నింటికంటే ముఖ్యంగా శ్రేయాస్ అయ్యర్ జట్టుని ముందుండి నడిపిస్తున్న విధానం అబ్బుర పరుస్తోంది. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో తను చాలా కామ్‌గా తన పని తాను చేసుకపోయాడు. 204 పరుగుల ఛేజింగ్ లో ఎక్కడా తడబడలేదు. విన్నింగ్ షాట్ కొట్టినా సంబరాలు చేసుకోలేదు. కప్పు కొట్టాకే పండగ అన్నట్టు కనిపించాడు. తన కెప్టెన్సీ కూడా గొప్పగా అనిపిస్తోంది. గతేడాది కొలకొత్తాని గెలిపించిన సారధి కూడా శ్రేయాసే. ఈసారి కూడా తానే పంజాబ్‌ను గెలిపించిన సారథిగా చరిత్రకెక్కాలని అయ్యర్ భావిస్తున్నాడు.
ఈసారి మనకు కొత్త IPL ఛాంపియన్ జట్టు దొరుకుతుందని ఖాయం అనే చెప్పొచ్చు…., ఎందుకంటే 2008 నుంచి ఆడుతున్న పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటివరకు ఏ IPL టైటిల్‌ను గెలవలేదు. రెండు జట్లు నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంలో ఫైనల్‌లో తలపడతాయి. ఐపీఎల్ టోర్నీల్లో ఆర్‌సిబి, పంజాబ్ ఇరు జట్లు ముఖాముఖి పోరులో 36 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఈ 36 మ్యాచ్‌ల్లో ఆర్‌సిబి జట్టు 18 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా పంజాబ్ జట్టు 18 సార్లు గెలిచింది. అంటే ఇద్దరు సమ ఉజ్జీవులు కప్ కోసం ఈ సారి బరిలోకి దిగుతున్నారు.
మొత్తానికి ఏ జట్టు గెలిచినా అభిమానులకు ఆ సంబరం చూడడం కనుల పండుగగా ఉంటుందనే చెప్పాలి. ఎందుకంటే ఈ రెండు జట్లలో ఏ జట్టు కూడా ఇంతవరకూ…కప్ గెలవలేదు. దీంతో ఏ జట్టు గెలిచినా చరిత్రే అవుతుంది. మరి ఈ సారి కప్ ఎవరిదో మరికొద్ది సేపట్లోనే తేలనుంది.