హైదరాబాద్‌లో ఐపీఎల్ లేదు..!

మనదేశంలో ఫుల్ క్రేజ్ ఉండే ఐపీఎల్ రివైజ్డ్ షెడ్యూల్ వచ్చేసింది. భారత్ పాక్ ఉద్రిక్తతలో మ్యాచులు ఆపేశారు. అయితే ప్రస్తుతం కాల్పుల విరమణ కొనసాగుతుండడంతో మళ్లీ షెడ్యూల్ ఇచ్చారు. అయితే ఇక్కడో ట్విస్ట్ ఉంది. పాకిస్తాన్ బార్డర్ కు చాలా దూరంలో ఉండే హైదరాబాద్, చెన్నైలలో ఒక్క మ్యాచ్ కూడా పెట్టలేదు. అదే సమయంలో బార్డర్ కు దగ్గర ఉండే సిటీల్లో మిగితా మ్యాచ్ లకు ప్లాన్ చేశారు. ఇదేం లెక్క అన్నది సగటు హైదరాబాదీ క్రికెట్ ఫ్యాన్స్ ప్రశ్నలు సంధిస్తున్నారు.

ఈ నెల 17 నుంచి ఐపీఎల్‌ను పునరుద్ధరించాలని నిర్ణయించిన బీసీసీఐ.. విదేశీ ఆటగాళ్లను తిరిగి రప్పించడం కోసం గట్టిగా ప్రయత్నిస్తోంది. ఆటగాళ్లను భారత్‌కు పంపేలా విదేశీ బోర్డులపై ఒత్తిడి పెంచుతోంది. అయితే 6 గ్రౌండ్స్ లోనే మిగితా ఐపీఎల్ మ్యాచ్ లు ఉంటాయని రివైజ్డ్ షెడ్యూల్ ఇచ్చింది ఐపీఎల్ గవర్నింగ్ బాడీ. ఇందులో బెంగళూరు, జైపూర్, ఢిల్లీ, లక్నో, అహ్మదాబాద్, ముంబై ఉన్నాయి. ఇందులో రాజస్థాన్ పాకిస్తాన్ కు సరిహద్దు రాష్ట్రంగా ఉంది. అహ్మదాబాద్, ఢిల్లీ, ముంబై కూడా ఏమంత దూరంలో లేవు.

ఆల్ ఆఫ్ సడెన్ గా టెన్షన్స్ పెరిగితే పరిస్థితి ఏంటన్న క్వశ్చన్ వస్తోంది. మళ్లీ ప్లే గ్రౌండ్ లో లైట్లు ఆర్పేసి మ్యాచ్ ఆపేస్తారా అన్న ప్రశ్నలు సోషల్ మీడియాలో పెరుగుతున్నాయి. అసలు క్రికెట్ అంటే ఫుల్ క్రేజ్ ఉన్న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం నుంచి మ్యాచులను ఎందుకు తరలించారన్నది బీసీసీఐ, ఐపీఎల్ గవర్నింగ్ బాడీ స్పష్టమైన ప్రకటన ఏదీ రిలీజ్ చేయలేకపోయాయి. అయితే.. పరిమిత వేదికల్లోనే మిగితా ఐపీఎల్ మ్యాచులు నిర్వహించాలని నిర్ణయించారంటున్నారు. దీనివల్ల హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరగాల్సిన మ్యాచ్‌లు ఢిల్లీకి షిఫ్ట్ చేశారు. ఈ నిర్ణయం వెనుక కచ్చితమైన కారణాలు బయటకు రానప్పటికీ, భద్రతా ఏర్పాట్లలో సమస్యలు, లాజిస్టికల్ లిమిటేషన్స్ తోనే కొన్ని గ్రౌండ్లకే పరిమితం చేశారంటున్నారు.

కొన్ని గ్రౌండ్స్ కు పరిమితం చేయాలనుకుంటే.. పాకిస్తాన్ కు సరిహద్దులుగా ఉన్న చోట, దగ్గరగా ఉన్న నగరాల్లో రిస్క్ తీసుకుని ఎందుకు రివైజ్డ్ షెడ్యూల్ ఇచ్చారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే పాకిస్తాన్ ను నమ్మలేం. ఎప్పుడు ఏ క్షణంలో అటాక్ చేస్తుందో చెప్పలేం. ఎలాగూ కాల్పుల విరమణ అమలులో ఉంది కాబట్టి S-400 డీయాక్టివేట్ చేస్తే… పాకిస్తాన్ నుంచి వచ్చే మిసైల్స్ కు ఎవరు బాధ్యత వహిస్తారన్న ప్రశ్నలు వస్తున్నాయి. గ్రౌండ్ లో ప్రేక్షకులకు రిస్క్ పెరగదా అని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.

నిజానికి హైదరాబాద్ లో తాజాగా మిస్ వరల్డ్ ఈవెంట్స్ జరుగుతున్నాయి. గ్లోబల్ అటెన్షన్ ఉంది. సెక్యూరిటీ ఇవ్వడానికి ప్రత్యేక కమిషనరేట్ కూడా ఉంది. పాకిస్తాన్ కు చాలా దూరం కూడా. అయినా సరే ఎందుకు హైదరాబాద్ ను సెలక్ట్ చేయలేదన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఈ విషయంలో హైదరాబాద్ కు అన్యాయం జరిగినట్లే అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్. ఎందుకంటే హైదరాబాద్ ప్లే ఆఫ్స్ దాకా వెళ్లకపోయినా సరే మిగితా మ్యాచ్ లకు స్టేడియం ఫుల్ అయింది. అంటే దీనర్థం ఏంటి..? క్రికెట్ క్రేజ్ ఎక్కువుంది. అలాంటప్పుడు హైదరాబాద్ పేరును ఎందుకు తీసేస్తారన్న ప్రశ్నలు వస్తున్నాయి.