వాట్సాప్‌లో మరో కీలక అప్డేట్..!

ప్రముఖ టెక్ సంస్థ మెటాకు (Meta) చెందిన వాట్సాప్‌ (Whatsapp) తమ యూజర్ల కోసం మరో ముఖ్యమైన అప్‌డేట్‌ను అందిస్తోంది. వాట్సాప్ వాయిస్ చాట్ ఫీచర్‌ (Voice chat feature) గురించి ఈ యాప్ వినియోగించేవారికి ఇదివరకే తెలిసి ఉంటుంది. ఈ ఫీచర్ ఇప్పటివరకు పలు ప్రధాన గ్రూపుల్లో మాత్రమే అందుబాటులో ఉండేది. అయితే తాజాగా ఈ వాయిస్ చాట్ ఫీచర్‌ను అన్ని వాట్సాప్ గ్రూపులకు అందుబాటులోకి తెచ్చింది. ఈ విషయాన్ని వాట్సాప్ తన బ్లాగ్ పోస్టులో రీసెంట్ గా తెలిపింది.

ఈ ఫీచర్ ఎలా పని చేస్తుందంటే.. తమ మొబైల్లో అచ్చం గ్రూప్ కాల్ లాగానే పనిచేస్తుంది. అయితే, ప్రతి గ్రూప్ మెంబర్ కు ఒక్కొక్కరికి రింగ్ అవ్వడాన్ని నివారిస్తుంది. ఈ ఫీచర్ ఎనేబుల్ చేసుకోవడం ద్వారా గ్రూపు కాల్ వచ్చినా రింగ్‌టోన్ అనేది రాదు. బదులుగా ఇది ఇన్-చాట్ పాప్-అప్ నోటిఫికేషన్‌ను చూపిస్తుంది. ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు లేదా బయటికెళ్ళినప్పుడు ఇలాంటి గ్రూప్ కాల్స్ వస్తే అటు లిఫ్ట్ చేసి మాట్లాడలేం, అవాయిడ్ చేయలేం. ఇందుకోసమే ఈ తరహా ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వాట్సాప్ వాయిస్ చాట్ ఫీచర్ ను రిలీజ్ చేసింది. అలాగే వాయిస్ చాట్ ఫీచర్ ద్వారా గ్రూపు కాల్‌ ఎండ్ అయ్యేలోపు ఏ సమయంలోనైనా ఈజీగా జాయిన్‌ అవ్వొచ్చన్నమాట.