
సాధారణంగా మనం ఏదైనా ఎలక్ట్రానిక్స్ షాప్‌లో వాషింగ్ మెషీన్, ఫ్రిడ్జ్ ఇలా ఏదైనా ప్రొడక్ట్ కొనాలంటే.. ఆ ప్రొడక్ట్‌పై స్టార్ రేటింగ్ చూస్తాం. చాలామందికి ఈ స్టార్ రేటింగ్ గురించి పెద్దగా తెలియదు. ఈ క్రమంలో మన బడ్జెట్‌లో వస్తుంది కదా అని తక్కువ స్టార్ మార్క్ ఉన్న వస్తువులను కొనేస్తుంటాం. అసలు ఈ రేటింగ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఎలక్ట్రానిక్స్ స్టార్ రేటింగ్ అనేది ఉత్పత్తి శక్తి సామర్థ్యాన్ని సూచించే ఒక విధానం. ఇది వినియోగదారులు ఒక ప్రొడక్ట్‌ను కొనుగోలు చేసేటప్పుడు మంచి ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవడానికి సహాయపడుతుంది. ఈ స్టార్ రేటింగ్‌లు ఏ ఉత్పత్తి తక్కువ శక్తిని ఉపయోగిస్తుందో, ఏది అధిక శక్తిని ఉపయోగిస్తుందో తెలియజేస్తాయి. ఈ రేటింగ్‌లు కొన్ని సందర్భాల్లో విద్యుత్ బిల్లులను తగ్గించడానికి కూడా హెల్ప్ చేస్తాయి.
అసలు స్టార్ రేటింగ్ అంటే..
సాధారణంగా ఎల్‌ఈడీ బల్బులు, గీజర్లు, ఏసీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, కూలర్ వంటి ఎలక్ట్రిక్ పరికరాలకు BEE (Bureau of Energy Efficiency) సంస్థ అనేది ఎనర్జీ రేటింగ్ ఇస్తుంది. ఇందులో రెండు నుంచి మూడు స్టార్లు ఉన్న విద్యుత్ పరికరాలు ఎక్కువ విద్యుత్ వినియోగిస్తాయని.. నాలుగు నుంచి ఐదు స్టార్ల మధ్య ఉన్న విద్యుత్ పరికరాలు తక్కువ విద్యుత్ ను వినియోగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ కరెంట్ బిల్లు రాకుండా ఉండాలంటే.. ఎక్కువ స్టార్లు ఉన్న పరికరాలు వినియోగించడం మంచిది.
నకిలీ స్టార్ రేటింగ్ ఎలా గుర్తించాలి..?
మార్కెట్లో ప్రస్తుతం నకిలీ స్టార్ రేటింగ్ ఉన్న విద్యుత్ వస్తువులను కస్టమర్లను మోసం చేసి అంటగట్టే ఉదంతాలు మనం చూస్తూనే ఉంటాం. ఈ మోసగాళ్ల బారిన పడకుండా ఉండాలంటే నకిలీ స్టార్ రేటింగ్ స్టిక్కర్లను గుర్తించాలి. అందుకోసం ఆ ప్రొడక్ట్ రేటింగ్ కనుగొనేందుకు BEE (Bureau of Energy Efficiency) వెబ్‌సైట్ https://beestarlabel.com/ ద్వారా మీరు కొనాలనుకునే ప్రొడక్ట్ రేటింగ్ చెక్ చేసుకోవచ్చు. తేడా ఉంటే ఫిర్యాదు కూడా చేయొచ్చు.