
ప్రస్తుతం మార్కెట్లో గమనిస్తే ఎన్నో బ్రాండ్ పేర్లతో ఎన్నో ఏసీలు ఉన్నాయి కానీ ఏసిల్లో రెండు ప్రధాన రకాలే ఉంటాయి. ఒకటి ఇన్వర్టర్ ఏసీ. మరొకటి నాన్-ఇన్వర్టర్ ఏసీ. ఈ రెండింటిలో ఏ రకమైన ఎయిర్ కండిషనర్ బాగా పనిచేస్తుంది. డబ్బు, కరెంట్ బిల్లు తక్కువగా ఆదా చేయడంలో సహాయపడుతుందో తెలుసుకుందాం:
- ఇన్వర్టర్ AC అంటే?
ఇన్వర్టర్ AC కంప్రెసర్ వేగాన్ని కంట్రోల్ చేసే అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తాయి. మీరు ACని ఆన్ చేసినప్పుడు ఇది గదికి కావలసిన ఉష్ణోగ్రతకు తెచ్చి త్వరగా చల్లబరుస్తుంది. ఆ తర్వాత కంప్రెసర్‌ను ఆపివేయడానికి బదులుగా వేగాన్ని తగ్గిస్తుంది. దీనివల్ల తక్కువ విద్యుత్తును వాడుతూ స్థిరమైన శీతలీకరణను మాత్రమే అనుమతిస్తుంది. క్లియర్ గా చెప్పాలంటే ఇన్వర్టర్ AC ఆన్, ఆఫ్ కాకుండా తక్కువ వేగంతో నడుస్తుంది. ఒక్కసారి గది కూల్ అయ్యాక ఆన్‌లో ఉన్నా వేగంగా పనిచేయకుండా ఒకేలాంటి చల్లదనం ఉండేలా చూస్తుంది.
- నాన్-ఇన్వర్టర్ AC అంటే?
నాన్-ఇన్వర్టర్ ACల్లో కంప్రెసర్ పూర్తి శక్తితో పనిచేస్తుంది లేదా అసలు పనిచేయదు. మీరు మొదట దీన్ని ఆన్ చేసినప్పుడు గదికి కావలసిన ఉష్ణోగ్రతకు చేరుకునేవరకు కంప్రెసర్ నడుస్తుంది. తర్వాత ఆగిపోతుంది. ఉష్ణోగ్రత మళ్లీ పెరగడం మొదలవగానే కంప్రెసర్ తిరిగి పనిచేస్తుంది. ఇలా పదే పదే ఆన్, ఆఫ్ అవుతూ పనిచేయడం వల్ల విద్యుత్ వినియోగం అనేది ఆటోమేటిక్ గా పెరుగుతుంది. రిజల్ట్ కరెంటు బిల్లు ఎక్కువగా వస్తుంది.
కూలింగ్ కెపాసిటీ విషయానికి వస్తే ఇన్వర్టర్ ACలు మంచివి. గది తగినంత చల్లగా ఉన్నప్పటికీ వాటి కంప్రెసర్‌లు చక్కగా పనిచేస్తాయి. చల్లని గాలి స్థిరంగా వస్తుంది. అదే ఇన్వర్టర్ కాని ACలు గదిని త్వరగా చల్లబరుస్తాయి కానీ వాటి స్థిరమైన ఆన్-అండ్-ఆఫ్ సైక్లింగ్ కారణంగా తరచుగా ఉష్ణోగ్రతలో హెచ్చుతగ్గులు వస్తాయి. అందువల్ల, కరెంట్ బిల్లులు ఎక్కువైపోతాయి. పని సామర్థ్యం తగ్గిపోతుంది. కాబట్టి ఇన్వర్టర్ ఏసీ కొనడమే బెస్ట్ ఛాయిస్!