
చీకట్లో మనం ఏది సరిగా చూడలేం.. వేరే ఏదైనా వెలుతురు నీడ ఉంటే తప్ప చూడలేం. లేదంటే మనకు మొత్తం చీకటిగా అనిపిస్తుంది. అయితే యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆఫ్ చైనా సైంటిస్టులు ఇటీవల వినూత్నంగా చీకట్లోనూ మన కళ్ళతో చూడగలిగేలా ఒక ఇన్నోవేషన్ చేశారు. దాని పేరు ‘ఇన్‌ఫ్రారెడ్ కాంటాక్ట్ లెన్స్’.
ఈ కాంటాక్ట్ లెన్స్‌ను ధరించిన వాళ్లకు.. కనురెప్పలు మూసుకున్నా సరే కళ్ల ముందు ఉన్నది స్పష్టంగా కనిపిస్తుందట. పరారుణ కాంతి కిరణాలను దృశ్య తరంగాలుగా మార్చి కంటి లోపలికి చేర్చుతాయి. అందువల్ల వీటిని ఇన్‌ఫ్రారెడ్ లెన్స్ (పరారుణ కటకాలు) గా పిలుస్తారు.
ఇవి కనురెప్పను దాటి కంటి లోపలికి సైతం వెళ్లగలవు. దీనివల్లే కనురెప్ప మూసినా.. ముందున్నది చూడగలుగుతారు. కొన్ని రకాల పాలిమర్స్, నానో పార్టికల్స్‌తో ఈ లెన్సెస్‌ను సైంటిస్టులు రూపొందించడం విశేషం.
ఈ టెక్నాలజీని దట్టమైన పొగమంచు, దుమ్ముతో కూడిన వాతావరణం, రక్షణ, అత్యవసర సమయాల్లో ఉపయోగించేందుకు ఉద్దేశించి తయారుచేసినట్లు ఆ యూనివర్సిటీ అధ్యయనం పేర్కొంది. మొదట ఎలుకలపై చేసిన ప్రయోగాలు మంచి ఫలితాల్ని ఇవ్వటంతో, మానవులపైనా ట్రయల్స్ నిర్వహించినట్టు ఆయా పరిశోధకులు, సైంటిస్టులు తెలిపారు. భలే ఉంది కదూ!