
స్మార్ట్ ఫోన్ ల పుణ్యమాని ఇప్పుడు హెడ్ ఫోన్స్.. ఇయర్ బడ్స్ రోజువారీ జీవితంలో ఒక భాగంగా మారాయి. కాల్స్ మాట్లాడటం, మ్యూజిక్ వినటం, వెబ్ సిరీస్లు చూడటం, గేమ్స్ ఆడటం, విశ్రాంతి పొందటం ఇలా అన్నిటిలో వీటి అవసరం పెరిగింది. ఇలా అత్యవసరమైన ఈ గ్యాడ్జెట్ల వాడకంలో కొంత జాగ్రత్త అవసరం అంటున్నారు టెక్ నిపుణులు.. వాల్యూమ్ శ్రుతి మించినా, గంటలకొద్దీ వాడుతున్నా ఒక్కోసారి వినికిడి దెబ్బతినొచ్చు. కాబట్టి వీటిని వాడేటప్పుడు వాల్యూమ్ కొన్నిసార్లు 100 డెసిబెల్స్ దాటిపోవచ్చు. ఈ స్థాయి శబ్దానికి కేవలం 15 నిమిషాలసేపు విన్నా.. వినికిడి శాశ్వతంగా దెబ్బతినే ప్రమాదముంది. దీన్ని గుర్తించేసరికే జరగాల్సిన నష్టం జరగొచ్చు. అలాగనీ వీటిని పూర్తిగా పక్కన పెట్టేయాల్సినవసరమేమీ లేదు.
వాల్యూమ్ తక్కువగా..
పరికరం వాల్యూమ్ ను దాని మాక్సిమం స్థాయిలో 50-60 శాతం దాటకుండా చూసుకోవాలి. కొన్ని పరికరాల్లో మాన్యువల్ గా వాల్యూమ్ ను సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ ఫీచర్ లేనట్టయితే వాల్యూమ్ మానిటరింగ్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు హెడ్ఫోన్స్ లో వింటున్నది మీకు సమీపంలో ఉన్నవారికి కూడా వినిపిస్తున్నట్టయితే వాల్యూమ్ మరీ ఎక్కువగా ఉందనే అర్ధం చేసుకోవాలి.
మధ్య మధ్యలో విరామం..
అదేపనిగా గంటలకొద్దీ హెడ్ ఫోన్ వాడితే తాత్కాలికంగా శబ్దాలను గ్రహించే కెపాసిటీ తగ్గుతుంది. మానసికంగా, శారీరకంగా, భావోద్వేగ పరంగా తీవ్రమైన అలసట కూడా వస్తుంది. కాబట్టి ప్రతీ గంటకూ 10-15 నిమిషాల విరామం ఇవ్వటం మేలు. రోజులో 8 గంటలకు మించి వాడకుండా చూసుకుంటే ఇంకా ఉత్తమం. చెవిలో ఒదిగిపోయే ఇయర్ బడ్స్ విషయంలో ఇది మరింత ముఖ్యం. ఎందుకంటే ఇవి కర్ణభేరికి చాలా దగ్గరలో ఉంటాయి. విమానాలు, మార్కెట్ల వంటి రణగొణ ధ్వనులతో కూడిన వాతావరణాల్లో నాయిస్ క్యాన్సెలింగ్ హెడ్ఫోన్స్ ను వాడుకోవాలి. ఇవి చుట్టుపక్కల శబ్దాలను రద్దు చేయటం ద్వారా తక్కువ వాల్యూమ్ లో క్లియర్ గా వినపడతాయి.
ఇయర్ బడ్స్ చెవుల లోపల కుదురుగా ఉంటాయి. అందువల్ల వీటితో వినికిడి దెబ్బతినే ప్రమాదంఎక్కువ… ముఖ్యంగా గంటలకొద్దీ వింటుంటే ముప్పు ఎక్కువ. కాబట్టి చెవుల చుట్టూ కప్పుకొని ఉండే వాటిని వాడుకోవటం మంచిది. ఇవి చెవి వెలుపల ఉండటం వల్ల ఎక్కువసేపు విన్నా అంత ప్రమాదకరం కావు. తక్కువ వాల్యూమ్ లోనే స్పష్టంగా సంగీతం, మాటలు వినిపిస్తాయి. వాల్యూమ్ పరిమిత పరికరాలు వినికిడిని కాపాడటానికి కొన్ని హెడ్ ఫోన్లు, చిల్డ్రన్ వాల్యూమ్ పరిమితులతోనూ వస్తున్నాయి. వీటిల్లో సాధారణంగా సుమారు 85 డెసిబెల్స్ వాల్యూమ్ పరిమితి విధించి ఉంటుంది. పిల్లలకు దీర్ఘకాలం వినికిడిని కాపాడుకోవాలనుకునే వారికివి బాగా ఉపయోగపడతాయి. కాబట్టి వీటిని అనుసరించి కొనడం.. వాడటం వల్ల మీ చెవులను కాపాడుకున్నవారవుతారు.