ఇంటర్నెట్ లేకుండా యూస్ చేయగలిగే సరికొత్త ఏఐ ఎడ్జ్ యాప్..!

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రోజుకో కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ క్రమంలో టెక్నాలజీ దిగ్గజం ఆయిన గూగుల్ సంస్థ… స్మార్ట్ ఫోన్లలో ఏఐ వినియోగాన్ని డిఫరెంట్ అండ్ ఇంట్రెస్ట్ గా మార్చే ఓ క్రేజీ యాప్ ను తీసుకొచ్చింది. దీని పేరే ‘ఏఐ ఎడ్జ్ గ్యాలరీ’. ఈ యాప్ ద్వారా శక్తిమంతమైన ఏఐ మోడల్స్ ను మొబైల్ ఆఫ్లైన్లోనే రన్ చేయొచ్చు. అంటే ఎటువంటి ఇంటర్నెట్ అవసరం లేకుండానే ఏఐతో ఇమేజ్లను సృష్టించడం, కోడ్ రాయడం, సమాధానాలు రాబట్టడం వంటివి చేయవచ్చు. ఇందులో ముఖ్యమైన ప్రయోజనం ఏంటంటే.. యూజర్ ప్రైవసీకి ఇబ్బంది కలుగదు.

ముప్పు చాలా తక్కువ. ఎందుకంటే యూజర్లు అందించే డేటా క్లౌడ్ సర్వర్లకు వెళ్లకుండా మొత్తం ఫోన్లోనే బ్యాక్ఎండ్ లో రన్ అవుతుంది. ఇది సెక్యూరిటీ రిస్క్ ను తగ్గిస్తుంది. అలాగే పనితీరు కూడా చాలా వేగంగా ఉంటుంది. సర్వర్ కోసం వేచిచూసే పనిలేకుండా యూజర్లు అడిగే ప్రశ్నలకు నేరుగా స్పందించేందుకు ఏఐకి ఆస్కారం కలుగుతుంది. గెమ్మా 31బీ అనే లాంగ్వేజ్ మోడల్ పై ఆధారపడి ఈ యాప్ పనిచేస్తుంది. కేవలం 529 ఎంబీ పరిమాణంలో వచ్చే ఈ కాంపాక్ట్ మోడల్ ఒక సెకనుకు 2,585 టోకెన్లను ప్రాసెస్ చేయగలదు. పెద్ద మొత్తంలో టెక్ట్స్ ను క్షణాల్లో జనరేట్ చేయగలదు.

గెమ్మా పరిమాణం చిన్నదైనప్పటికీ కోరిన కంటెంట్ ను సృష్టించడం, డాక్యుమెంట్లను విశ్లేషణ చేయడం, స్మార్ట్ రిప్లైల వరకు అన్నింటినీ క్షణాల్లో చేయగలదు. ప్రస్తుతానికి ఈ యాప్ ను ప్రయోగాత్మక ఆల్ఫా విడుదలగా గూగుల్ పేర్కొంటుంది. ఓపెన్ సోర్స్ ఈ యాప్ అందుబాటులో ఉంది. అంటే డెవలపర్లు, కంపెనీలు దీనిని ఉపయోగించవచ్చు. కావలసిన మార్పులు చేయవచ్చు. వాణిజ్య ఉత్పత్తుల్లో జోడించవచ్చు. కాగా గూగుల్ ఏఐ ఎడ్జ్ గ్యాలరీ యాప్ ఐఓఎస్ వెర్షన్ కూడా అందుబాటులోకి రావడం విశేషం.