
స్మార్ట్‌ఫోన్‌ల వాడకం పెరిగిన ఈరోజుల్లో.. మొబైల్ కి ఛార్జింగ్ చేయడం అనేది కీలక పాత్ర పోషిస్తోంది. అయితే ఫోన్ కి ఛార్జ్ చేయడం వల్ల కరెంట్ బిల్ అనేది పెరుగుతోందా.. అనేది చాలామందికి డౌంట్ వస్తోంది. నిజానికి ఫోన్ ఛార్జింగ్ చాలా తక్కువ విద్యుత్తును వినియోగిస్తుంది. మీ ఫోన్‌ను ప్రతిరోజూ ఛార్జ్ చేయడం ద్వారా ఎంత విద్యుత్ ఖర్చవుతుందో ఇప్పుడు చూద్దాం:
సాధారణంగా ఫోన్ ఛార్జర్లు 5 నుంచి 20 వాట్ల శక్తిని కలిగి ఉంటాయి. సాధారణ ఛార్జర్లు దాదాపు 5 వాట్స్ కెపాసిటీతో ఉంటాయి. ఫాస్ట్ ఛార్జర్లు 18- 20 వాట్స్ లేదా అంతకంటే ఎక్కువ ఉండవచ్చు. ఒక ఫోన్ పూర్తిగా ఛార్జ్ కావడానికి దాదాపు 1 నుంచి 2 గంటలు పడుతుంది. అయితే ఇది ఫోన్ మోడల్, ఛార్జర్‌పై ఆధారపడి ఉంటుందనీ మర్చిపోవద్దు. ఇక మొబైల్ ఫోన్‌ను ఛార్జ్ చేయడానికి ఎంత విద్యుత్ అవసరం అవుతుందంటే..
ఉదాహరణకు.. మీరు 10 వాట్ల ఛార్జర్‌ని ఉపయోగించి 2 గంటల్లో ఫోన్‌ను ఛార్జ్ చేస్తారనుకుందాం. అంటే ఇక్కడ ఫోన్‌ను ఒకసారి ఛార్జ్ చేయడానికి కేవలం 0.02 యూనిట్ల విద్యుత్ మాత్రమే ఖర్చు అవుతుంది. మీరు మీ ఫోన్‌ను రోజుకోసారి ఛార్జ్ చేస్తే.. సంవత్సరానికి దాదాపు 7 నుంచి 10 యూనిట్లు కరెంట్ అవసరం అవుతుంది. యూనిట్‌కు 7 రూపీస్ బిల్ అవుతుంది అనుకుంటే.. అప్పుడు ఛార్జింగ్ ఖర్చు సంవత్సరానికి 70 రూపాయలు అన్నమాట. అయితే, ఈ ఖర్చు యూనిట్ ధరపై ఆధారపడి ఉంటుంది.
చాలాసార్లు ఫోన్ పూర్తిగా ఛార్జ్ అయిన తర్వాత కూడా చాలామంది నిర్లక్ష్యంగా ఛార్జర్‌ను ప్లగ్ ఆన్‌లో ఉంచుతారు. దీనివల్ల కనీసంలో కనీసం కొంత విద్యుత్తు ఖర్చవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది విద్యుత్తును వృధా చేస్తుంది. ఇది సాధారణంగా కొన్ని వాట్స్ మాత్రమే అయినా.. ఖర్చును పెంచే అవకాశం ఉండొచ్చు. అందువల్ల, విద్యుత్ బిల్లు పెరగకుండా ఉండేందుకు.. ఫోన్ పూర్తిగా ఛార్జ్ అయిన తర్వాత ప్లగ్ నుంచి ఛార్జర్‌ను తీసివేయండి. మరీ పాతది అయ్యేదాక.. ఏళ్ళకెళ్ళు వాడకుండా బదులుగా కొత్తది, మరింత సమర్థవంతమైన ఛార్జర్‌ను ఉపయోగించడం వల్ల నెల మొత్తానికి వినియోగించే విద్యుత్ మొత్తాన్ని కొంచం తగ్గించవచ్చు.