
ఛత్తీస్ గడ్ దండకారణ్యంలో అపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రత దళాలు అడవుల్లో వేగంగా చొచ్చుకుపోతున్నాయి. దేశవ్యాప్తంగా జరుగుతున్న వరుస ఎన్ కౌంటర్లలో నేలకొరుగుతున్నరు మావోయిస్టులు. అక్కడ వారు మొన్నటి వరకు ఆధిపత్యం చెలాయించారు. పోటీ ప్రభుత్వాన్ని నిర్వహించారు. దేశ సార్వబౌమత్వాన్ని ప్రశ్నించారు. కాని నేడు అది ముందుకు పోవడం సాద్యం కావడం లేదా అంటే అవుననే అనిపిస్తోంది. మావోయిస్టుల కంచుకోటకు బీటలు వారుతున్నాయా! ఆపరేషన్ కగారితో సైనిక దళాలు మావోయిస్టులపై …పై చేయి సాధించారంటే అవుననే చెప్పాలి. డబుల్ ఇంజన్ సర్కార్ ఇప్పుడు మావోయిస్టుల పాలిట శాపంగా మారింది.
ఉత్తర తెలంగాణలో పీపుల్స్ వార్ పార్టీ బలహీనపడ్డాక ఛత్తీస్ గఢ్ నుంచే భారత కమ్యూనిస్టు పార్టీ పేరుతో మావోయిస్టుల కార్యకలాపాలు ఎక్కువగా సాగుతున్నాయి. కరోనా సంక్షోభం ముగిసే నాటికి తెలంగాణ రాష్ట్ర కమిటీతో పాటు బీకే-ఏఎస్ఆర్, జేఎండబ్ల్యూపీ, కేబీఎం డివిజన్ కమిటీలే మిగిలి ఉన్నాయి. వీటి పర్యవేక్షణలో పెద్దపల్లి, ఏటూరునాగారం-మహదేవపూర్, వాజేడు- వెంకటాపురం, ఇల్లెందు- నర్సంపేట, మంగి, ఇంద్రవెల్లి, సిర్పూర్, చర్ల- శబరి, మణుగూరు- పాల్వంచ, కోల్బెల్ట్ ఏరియా కమిటీల పేర్లతో సాయుధ దళాలు సంచరిస్తూ పార్టీ విస్తరణకు పనిచేసేవి. ఈ ఏరియా, డివిజన్ కమిటీల పేర్లతోనే లేఖలు జారీ అయ్యేవి. మొత్తంగా ఒక రాష్ట్ర కమిటీ, మూడు డివిజనల్ కమిటీలు, పది ఏరియా కమిటీలు యాక్టివ్ గా ఉండేవి. ఇందులో వంద మంది వరకు మావోయిస్టులు వివిధ హోదాల్లో పనిచేస్తున్నట్టుగా పోలీసు రికార్డులు చెబుతున్నాయి.
2024 జనవరిలో యాంటీ నక్సల్స్ కోసం చేపట్టిన ఆపరేషన్ కగార్ ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్ మహారాష్ట్రల్లోనూ ఎదురుకాల్పుల ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు వివిధ ఎన్ కౌంటర్లలో 300 మందికి పైగా మావోయిస్టులు చనిపోయారు. ఇలా చనిపోయిన వారిలో ఏరియా కమిటీ నుంచి కేంద్ర కమిటీ సభ్యుడి వరకు ఉన్నారు. ఛత్తీస్ గఢ్- తెలంగాణ సరిహద్దు కర్రిగుట్టల్లో, 16న పూజారి కాంకేర్- మారేడు బాక అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్లో 12 మందికి పైగా మావోలు చనిపోయారు. ఇది జరిగిన కొద్ది రోజులకే గరియాబంద్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్లో కేంద్ర కమిటీ సభ్యుడు రామచంద్రారెడ్డి ఆలియాస్ చలపతి మరణించారు. దీంతో తెలంగాణకు చెందిన వివిధ కమిటీల్లో ఎంతమంది మావోయిస్టులు ఉన్నారు.. అదే విధంగా అజ్ఞాతంలో ఉంటూ దేశంలోని ఇతర కమిటీల్లో పని చేస్తున్న తెలంగాణ నేతలు ఎవరనే అంశంపై పోలీసు శాఖ మరోసారి ఆరా తీయడం మొదలెట్టింది…
2024 సెప్టెంబర్ 4వ తేదినా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో పాల్వంచ-మణుగూరు ఏరియా కమిటీ, అదే సంవత్సరం డిసెంబర్ 1న ములుగు జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్లో నర్సంపేట-ఇల్లెందు, ఏటూరునాగారం-మహదేవపూర్ కమిటీలు, అంతకు ముందు 2014 మార్చిలో గడ్చిరోలి జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్లో ఇంద్రవెల్లి, మంగి ఏరియా కమిటీలు బలహీనపడినట్టు గుర్తించారు. అయితే ఏ కమిటీ ఎంతమేర బలహీన పడింది?, అందులో ఎంతమంది దళ సభ్యులు ప్రస్తుతం ఉన్నారనే ప్రొఫైల్ రూప కల్పనపై ఖాకీలు దృష్టి సారించారు. క్రమం తప్పకుండా చోటు చేసుకుంటున్న ఎదురుకాల్పులు, విస్తృతమైన కూంబింగ్ ఆపరేషన్ల కారణంగా ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందడం కష్టంగా మారినట్లు తెలుస్తోంది. అయినా స్పష్టమైన సమాచారం కోసం ఇంటెలిజెన్స్ కు పోలీసులు పదును పెడుతున్నారు.
వరుస ఎన్ కౌంటర్లలో దళ సభ్యులు, ఏరియా కమిటీ కమాండర్లు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇప్పటికీ బీకే -ఏఎస్ఆర్ కమిటీకి కొయ్యాడ సాంబయ్య ఆలియాస్ ఆజాద్, జేఎండబ్ల్యూపీకి వెంకటేశ్, కేబీఎం కి మైలారవుడెళ్లు అలియాస్ భాస్కర్ నేతృత్వం వహిస్తున్నారు. ఈ ముగ్గురు డివిజన్ కమిటీ నేతలు సేఫ్ గానే ఉండగా… తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి దామోదర్ సైతం సురక్షితమేనని ఇటీవల మావోయిస్టులు విడుదల చేసిన లేఖ ద్వారా వెల్లడైంది. ఏది ఏమైనా మావోయిస్టులకు గడ్డుకాలం నడుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. మావోయిస్టులపై భద్రత బలగాలు ఎప్పటికప్పుడు పై చేయి సాధిస్తూనే వస్తున్నాయి.వరుస ఎన్ కౌంటర్లలో ఎక్కువ సంఖ్యలో మావోయిస్టులు మృతిచెందుతున్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టు రహిత సమాజాన్ని నిర్మించాలని చూస్తున్న డబుల్ ఇంజన్ సర్కార్ సక్సెస్ అయిందనే చెప్పుకోవాలి.మరికొద్ది నెలల్లో మావోయిస్టులు పూర్తిగా అంతం అవుతారా లేదా అనేది వేచిచూడాల్సి ఉంది.