
పవర్ ఉంటే ఓ లెక్క ఇప్పుడో లెక్క అన్నట్టు కొనసాగుతుంది అక్కడి రాజకీయం .. అధికారం కోల్పోయిన తరువాత అక్కడి గులాబీ కోటలో వర్గ పోరుకు బీజం పడిందట.. ముందొచ్చిన చెవులకంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టు అక్కడి మాజీ ఎమ్మెల్యే శిబిరాన్ని తాజా ఎమ్మెల్సీ శిబిరం తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోందంట.. వచ్చే ఎన్నికల నాటికి తన కుమారుడికి టికెట్ ఇప్పించి అసెంబ్లీకి పంపించాలని కలలుగంటున్న అ మాజీ ఎమ్మెల్యే ప్రయత్నాలకు అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్సీ చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారంట.. ఇంతకీ ఏదా నియోజక వర్గం? బీఆర్ఎస్‌లో ఆ రెండు వర్గాల లెక్కలేంటి?
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం బీఆర్ఎస్‌లో వర్గపోరు పీక్ స్టేజ్‌కి చేరుతోంది.. ఇటీవల రెండు వర్గాలుగా చీలిన గులాబీ శ్రేణులు ఆధిపత్యం కోసం సిగపట్లకు దిగుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ , సిట్టింగ్ ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి వర్గాలుగా విడిపోవడంతో అక్కడి గులాబీ పార్టిలో చీలిక వచ్చి గ్యాప్ పెరిగిపోతోంది. ఆ ఇంటిమీద కాకి ఈ ఇంటి మీద వాలకూడదన్నట్టు, అక్కడికి వెళ్లిన వారు ఇక్కడికి రావొద్దు, ఇక్కడి వారు అక్కడికి పోవద్దంటూ ఇద్దరు నాయకులు లైన్‌లు గీసేసినట్లు చర్చించుకుంటున్నారు. పార్టీ కార్యక్రమాలు, రజతోత్సవ సన్నాహక కార్యక్రమాలు సైతం రెండు వర్గాలు వేర్వేరుగానే నిర్వహించడం క్షేత్రస్థాయి నాయకులకు తలనొప్పిగా మారిందంట
గడిచిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది ఎమ్మెల్యేగా కొనసాగిన అంజయ్య యాదవ్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలై మాజీ అయ్యారు. ఎన్నికల ముందు నుంచే పార్టీ వ్యవహారాలతో పాటు, పాలనా వ్యవహారాల్లోనూ అంజయ్య కు వెన్నుదన్నుగా ఆయన కుమారుడు రవియాదవ్ ఉన్నారు. అంజయ్య వయోభారంతో ఇబ్బంది పడుతుండటంతో కుమారుడు అండగా ఉంటూ వస్తున్నారు. ప్రస్తుత విపక్ష పాత్ర లో కూడా షాద్‌నగర్ గులాబీ క్యాడర్‌కు రవి యాదవే పెద్ద దిక్కుగా ఉంటుండటంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకే టికెట్ దక్కుతుందని పార్టీ క్యాడర్ భావిస్తోంది. ఇప్పటికే ఎంపీపీగా పనిచేసిన అనుభవంతో పాటు తండ్రి అంజయ్య యాదవ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పడు ఆయనకు చేదోడు వాదోడుగా రవియాదవ్ కొనసాగారు. ఆ క్రమంలో నియోజక వర్గంపై ఉన్న పట్టు , పార్టీ పెద్దలతో ఉన్న పరిచయాలతో తనకు వచ్చే ఎన్నికల్లో టికెట్‌తో దక్కి అసెంబ్లీలో అడుగుపెడతాననే నమ్మకంతో రవియాదవ్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నారు.
అదలా ఉంటే కసిరెడ్డి నారాయణ రెడ్డి రాజీనామాతో వచ్చిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందిన నవీన్ కుమార్ రెడ్డి షాద్ నగర్ నియోజకవర్గానికే చెందిన వ్యక్తే కావడంతో…వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఇక్కడ పట్టు బిగించి, టికెట్ దక్కించుకుని ఎమ్మెల్యేగా అసెంబ్లీ లో అడుగు పెట్టాలనే తలంపుతో అడుగులు వేస్తున్నట్లు టాక్ నడుస్తోందట. దీంతో షాద్ నగర్ గులాబీ పార్టిలో వర్గ పోరుకు బీజం పడినట్లైనని చర్చించుకుంటున్నారట. మొన్నటి వరకు అంజయ్య యాదవ్ వెంట కనిపించిన కొందరు గులాబీ శ్రేణులు…ప్రస్తుతం ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి శిబిరంలో కనిపిస్తున్నారట.. దీంతో మాజీ ఎమ్మెల్యే, తాజా ఎమ్మెల్సీ అనుచర వర్గం రేపేంటి అన్న బెంగతో తలలు పట్టుకోవాల్సి వస్తోందంట.
ఇదంతా ఒక ఎత్తు అయితే షాద్ నగర్ గులాబీ పార్టీలో చీలిక అంశాన్ని అక్కడి బీఆర్ఎస్ దళం కొట్టి పడేస్తోంది . గెలుపొందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇచ్చిన హమీలకు అనుగుణంగా ఆయన పాలన సాగడం లేదని , కాంగ్రెస్ కు ధీటుగా బీఆర్ఎస్ బలంగా ఉందని , మాజీ ఎమ్మెల్యే , సిట్టింగ్ ఎమ్మెల్సీల మధ్యే క్యాడర్ ఉందని , మా పార్టీ నేతలు ఎవరు జెండాలు మార్చి ఇతర పార్టిలో చేరలేదని చెప్పుకొస్తుంది . మొత్తం మీద ప్రెజెంట్ జరుగుతున్న పరిణామాలతో షాద్ నగర్ గులాబీ పార్టి రాజకీయం ఎటు టర్న్ అవుతుందో , భవిష్యత్తులో ఎవరిని టికెట్ వరిస్తుందో , ఎవరు అందలం ఎక్కుతారో వేచి చూడాలి