
తెలంగాణ మంత్రివర్గ విస్తరణ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయా? ఈ సారి కూడా ఆ ఎమ్మెల్యే కు పెద్ద షాక్ తగిలిందా? జిల్లాలోని రాజకీయ సమీకరణలు, పార్టీలో జరిగిన లాబీయింగ్ ఆయన్ను పక్కన పెట్టాయా? ఆయనకు మంత్రి పదవి రాకపోవడానికి అదే కారణమా..! ఇప్పుడు బయటపడుతున్న నిజాలేంటి? ఆయన స్పందన ఏంటి? పార్టీకి విధేయుడిగా పని చేస్తారా? లేక మరోసారి తిరుగుబాటు జెండా ఎగరేస్తారా? ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు లెట్స్ వాచ్ దిస్ ఆఫ్ ది రికార్డ్.
ఆదివారం జరిగిన మంత్రివర్గ విస్తరణలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ సమక్షంలో ముగ్గురు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. వాకిటి శ్రీహరి, అద్దూరి లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామిలు క్యాబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. అయితే, ఈ జాబితాలో మునుగోడు ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు లేకపోవడం రాజకీయ వర్గాల్లో పెద్ద కలకలం రేపింది. మాజీ ఎంపీగా, ఎమ్మెల్సీగా, సీనియర్ ఎమ్మెల్యేగా విస్తృత అనుభవం ఉన్న రాజగోపాల్‌కు మంత్రి పదవి రాకపోవడం ఆయనకు తీవ్ర నిరాశను మిగిల్చింది. పార్టీలోని ఆయన వర్గం తీవ్ర అసంతృప్తితో ఉంది.
రాజగోపాల్‌కి మంత్రి పదవి దక్కకపోవడం వెనుక ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయ సమీకరణాలే ప్రధాన కారణమనే చర్చ నడుస్తోంది. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి. కీలక మంత్రి పదవుల్లో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో మూడో రెడ్డిని మంత్రిగా చేస్తే పార్టీపై తప్పుడు సంకేతాలు వెళతాయని, ఒకే సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు అవుతుందని అధిష్టానం భావించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక, జిల్లాకు చెందిన సీనియర్ నేత జానా రెడ్డి కూడా ఈ నిర్ణయానికి పరోక్షంగా ప్రభావితం చేసినట్టు పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. రాజగోపాల్‌కు పదవి రాకపోవడానికి ఇదే ప్రధాన అంతర్గత కారణమని చెబుతున్నారు.
రాజగోపాల్ రెడ్డి రాజకీయ ప్రయాణంలో ఈసారి మంత్రి పదవి హామీ ఒక కీలక మలుపు. బీజేపీలో చేరిన అనంతరం మునుగోడు ఉపఎన్నికలో పోటీ చేసి ఓటమి పాలైన రాజగోపాల్, ఆపై కాంగ్రెస్‌లోకి తిరిగి వచ్చారు. బీజేపీలో ఉన్న వివేక్ వెంకటస్వామితో పాటు పార్టీలోకి వచ్చే సమయంలో, ఇద్దరికీ మంత్రి పదవులు హామీ ఇచ్చినట్టు పార్టీ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరిగింది. అది ఒక రాజకీయ ఒప్పందంలో భాగమని కూడా చెబుతారు. కానీ ఇప్పుడు వివేక్‌కి మాత్రమే మంత్రి పదవి దక్కగా, రాజగోపాల్‌కి మాత్రం మళ్ళీ మొండిచెయ్యే ఎదురైంది. ఈ ‘హామీ’ అమలు కాకపోవడం రాజగోపాల్ రెడ్డి అసంతృప్తికి ప్రధాన కారణమని పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.
పార్టీ అధిష్టానం తనను పట్టించుకోవడం లేదన్న భావన రాజగోపాల్‌లో బలంగా ఏర్పడినట్టు సమాచారం. మంత్రివర్గ విస్తరణ అనంతరం ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారని సమాచారం. ఈ పరిణామంతో అప్రమత్తమైన ఏఐసీసీ పరిశీలకురాలు మీనాక్షి నటరాజన్, అసంతృప్త నేతలను బుజ్జగించే పనిలో ఉన్నారని చెబుతున్నారు. రాజగోపాల్‌ను ఆమె కలిసే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. రాజగోపాల్‌కు చీఫ్ విప్ లేదా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ఇవ్వాలన్న యోచనలో అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, మంత్రి పదవిని ఆశించిన రాజగోపాల్ ఆశలకి ఇది సరిపోతుందా అనేది మాత్రం ఇంకా సందిగ్ధంగానే ఉంది. రాజీనామా అస్త్రంపై ఆయన ప్రకటన, పార్టీకి తీవ్ర ఒత్తిడిని పెంచుతోంది.
రాజగోపాల్ రెడ్డితో పాటు, మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కని ఇతర నేతలు కూడా తీవ్ర అసంతృప్తిలో ఉన్నారట. మల్ రెడ్డి రంగారెడ్డ, పెద్ది సుదర్శన్ రెడ్డి లాంటి సీనియర్లు కూడా ఈ విస్తరణలో స్థానం లభించక నిరాశ చెందారు. రంగారెడ్డి, హైదరాబాద్, నిజామాబాద్ జిల్లాలకు ఇప్పటికీ మంత్రులు లేకపోవడం పార్టీలోని అసంతృప్త వర్గాలకి మరింత బలం ఇచ్చే అవకాశం ఉంది. దీనితో ఈ ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించే నేతలు అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నారట.
మంత్రివర్గంలో చోటు దక్కకపోవడమే కాదు – పార్టీలోని బలమైన నేతల లాబీయింగ్, వ్యూహాలతో రాజగోపాల్ రాజకీయం పక్కదారి పట్టినట్టుగా టాక్ వినిపిస్తోంది. వాస్తవానికి, ఆయనకి హోంమంత్రి పదవి హామీ ఇచ్చినట్టుగా విస్తృతంగా ప్రచారం జరిగినా – ఇప్పుడు అది అమలు కాకపోవడంపై ఆయన వర్గీయులు అనేక ప్రశ్నలు లేవనేత్తుతున్నారు. ఇకపై ఆయన స్పందన ఏంటి? పార్టీకి విధేయుడిగా పని చేస్తారా? లేక మరోసారి తిరుగుబాటు జెండా ఎగరేస్తారా? జిల్లా రాజకీయాల్లోనే కాదు, రాష్ట్ర కాంగ్రెస్ లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది.