
రైతులకు ఎంతో ఉపయోగపడేలా భూభారతి చట్టాన్ని జాగ్రత్తగా రూపకల్పన చేశామని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. భూభారతి లాంటి చట్టం మన దేశంలో చాలా అరుదుగా వస్తాయన్నారు. దేశ చరిత్రలోనే ఇది అరుదైన చట్టం అని తెలిపారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం ములుగుమాడులో రెవెన్యూ సదస్సు ప్రారంభోత్సవంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో పాటు భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడారు. అత్యంత పారదర్శకంగా భూభారతి చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. కొత్త చట్టాలపై రైతులకు అవగాహన కల్పిస్తూ సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు.
దేశానికి ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చిన విధంగానే వచ్చే ఆగస్టు నాటికి ధరణి నుంచి విముక్తి కల్పిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆధార్ లాగే ప్రతి రైతుకు ఒక భూధార్ నెంబర్ ఇస్తామన్నారు. భూ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని ప్రజలకు మంత్రి హామీ ఇచ్చారు. నూతన రెవెన్యూ చట్టం భూ భారతి అమలులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుంది.ఈ క్రమంలో ఖమ్మంలో జరిగిన సదస్సులో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
దేశ చరిత్రలో అరుదైన చట్టం భూభారతి అని అన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రైతుల భూములు సర్వే చేయించి సరిహద్దులు గుర్తించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయడమే ఈ చట్టం లక్ష్యమన్నారు. గత ప్రభుత్వం తీసుకు వచ్చిన ధరణి చట్టం రైతుల హక్కులను కాల రాసిందని, రైతును ఆగం చేసిందని భట్టి ఆరోపించారు.తిరిగి సవరణ చేసే అవకాశం లేకుండా ధరణి చట్టాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిందన్నారు. పది ఎకరాల భూమి ఉంటే 17 ఎకరాలకు పాస్ బుక్కులు ఇచ్చారన్నారు. ఇవాళ ఖమ్మంలో జరిగిన రెవెన్యూ సదస్సులో భట్టి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన గత ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు.