
తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలని భారతీయ జనతా పార్టీ పట్టుదలతో ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటుకుంటామని, అధికారంలోకి వచ్చేస్తామని ధీమా వ్యక్తం చేసినప్పటికీ సింగిల్ డిజిట్‌కే పరిమితమై చతికల పడింది. లోక్‌సభ ఎన్నికల్లో ఫర్యాలేదు అనిపించుకున్నప్పటికీ.. ఆశించిన లక్ష్యాన్ని మాత్రం చేరుకోలేకపోయింది. ఇకలాభం లేదనుకుంటున్న కాషాయ నేతలు హిందుత్వ ఎజెండానే నమ్ముకుంటున్నారా? మున్ముందు రాబోయే ఎన్నికల్లో గెలుపు రుచి చూడాలంటే హిందుత్వ జెండాను బలంగా మోయాల్సిందేనా..?అసలు ప్రజా క్షేత్రంలో బలం పెంచుకోవడంలో కాషాయ పరివార్ ఎక్కడ విఫలమవుతోంది..?
కమల దళం ప్రజాక్షేత్రంలో పోరు బాటకు రోడ్‌మ్యాప్ రెడీ చేసుకుంటుంది. హిందుత్వ, నాన్ హిందుత్వ ఫార్ములాతో తెలంగాణలో అధికారమనే కుంభస్థలాన్ని కొట్టాలని స్కెచ్ గీస్తోందంట. ఇప్పటికే జనజాగరణ పేరుతో కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, రాష్ట్రానికి అందిస్తున్న నిధులు, చేస్తున్న అభివృద్ధి పనులు ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా బీజేపీ ఫోకస్ చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లకే పరిమితమై చతికిల పడినప్పటికీ, తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 8 స్థానాలు దక్కించుకున్న కమలం పార్టీలో ఒకింత ధీమా పెరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు షాక్ లిచ్చి బీజేపీ ఫుల్ జోష్‌లో ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే సంస్థాగతంగా పార్టీ బలోపేతం, అధికారం పీఠం కైవసం చేసుకోవడంలో ఎందుకు విఫలమవుతోందనే చర్చ పొలిటికల్ సర్కిల్‌లో నడుస్తోంది
తెలంగాణలో సంస్థాగతంగా పార్టీ బలోపేతమే లక్ష్యంగా కాషాయ పార్టీ అడుగులు వేస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల జోష్‌ను కంటిన్యూ చేయాలనే ఆలోచనలో అధిష్టాన పెద్దలు ప్రణాళికలకు పదును పెడుతున్నారంట. కానీ రాష్ట్ర నేతల వ్యవహారం మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తుండటంతో అధిష్టానం తలలు పట్టుకుంటుందంటున్నారు. పార్టీలో ఉన్న నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలు పార్టీ ఎదుగుదలకు మైనస్ అవుతున్నాయనే టాక్ వినిపిస్తోంది.
త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుకొని, నగర మేయర్ పీఠాన్నీ కైవసం చేసుకునేందుకు బీజేపీ పార్టీ కసరత్తులు చేస్తుంది. 2020లో జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో 40కి పైగా సీట్లు సాధించిన బీజేపీ, మజ్లిస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు వ్యూహం రచిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే హైదరాబాద్ ప్రజలను అకట్టుకునేందుకు జీహెచ్ఎంసీ లోకల్ బాడీ ఎమ్మెల్నీ స్థానానికి పోటీ చేసి, హైదరాబాద్‌లో ఎంఐఎంను టార్గెట్ చేస్తూ హిందుత్వ ఎజెండాను సమర్ధంగా వినిపించిందని, భవిష్యత్తులో తమకు కావలసిన మైలేజీని పెంచుకుందంటున్నారు. వాస్తవానికి లోకల్ ఎమ్మెల్సీ స్థానానికి బీజేపీకి ఓటర్ల సంఖ్య లేకపోయినా, బరిలో నిలవడం వెనక జీహెచ్ఎంసీ ఎన్నికలే మెయిన్ టార్గెట్ అన్న వాదనలు ఆ పార్టీలోనే వినిపిస్తున్నాయి.
లోకల్ బాడీ ఎన్నికలు మరో మూడు, నాలుగు నెలల్లో రాబోతున్నాయనే చర్చ జరుగుతోంది. అంతేకాదు 9 నెలల్లో జీహెచ్ఎంసీ కౌన్సిల్ గడువు కూడా ముగియనుండటంతో బీజేపీ రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ సంస్థాగత బలం పెంచుకోవడానికి వ్యూహాలు పన్నుతోంది. పార్టీ కార్పొరేటర్లు ఉన్న డివిజన్లలో వారిని, కార్పొరేటర్లు లేని చోట డివిజన్ స్థాయి నాయకులు కాస్త ముందు నుంచే ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ ఆదేశించినట్లు కాషాయ శ్రేణులు చెబుతున్నాయి.
హిందూత్వ ఎజెండాతో జీహెచ్ఎంసీ ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ ఇప్పటికే నిర్ణయించుకుందంట. జీహెచ్ఎంసీ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కి ఓట్లు ఉన్నా, కార్పొరేటర్లను, ఎక్స్ అఫిషియో సభ్యులను ఓటింగ్ వెళ్లొద్దని ఆదేశించడం, పోలింగ్ రోజున కనీసం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వైపు వెళ్లొద్దని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రధానాస్త్రంగా మార్చుకోవాలని బీజేపీ భావిస్తోందంట. దానికి తోడు అధికార కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంకు మద్దతిచ్చి, తనకున్న 14 ఓట్లను ఎంఐఎం పార్టీ అభ్యర్థికి వేయించి గెలిపించిన తీరును కూడా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగితే … జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనుకున్న లక్ష్యాలు అందుకోవచ్చనే అంచానాల్లో పార్టీ నాయకత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది.
మొత్తమ్మీద జీహెచ్ఎంసీ ఎన్నికల నాటికి కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్‌లు ఒక్కటే అని ప్రచారం చేసే పనిలో కమలనాథులు పడినట్టు కనిపిస్తున్నారు. ఎన్నికల్లో కూడా దాన్నే ప్రధాన ప్రచారాస్త్రంగా వాడుకుని హిందుత్వ ఎజెండాతో మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని భావిస్తున్నారంట. మొత్తం మీద రాబోవు ఎన్నికల్లో హిందుత్వ, నాన్ హిందుత్వ ఫార్ములాతో బీజేపీ వేస్తున్న పాచికలు ఎంత వరకు ఫలిస్తాయో?.. అందని ద్రాక్షగా మారిన మేయర్ పీఠాన్ని ఏ మాత్రం కైవసం చేసుకుంటారోచూడాలి.