ఆపరేషన్ కగార్ …

ఆపరేషన్ కగార్.. ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుంటోంది. ఆదివాసీలను ఇబ్బంది పెట్టేలా బ్లాక్ హిల్స్ లో సెర్చ్ ఆపరేషన్ ఏంటన్న ప్రశ్నలను వామపక్షాలు, పౌరహక్కుల సంఘాలు, బీఆర్ఎస్ వినిపిస్తున్నాయి. పార్టీ నిర్ణయం తర్వాత శాంతి చర్చలపై నిర్ణయం దిశగా తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తోంది. సో ఛత్తీస్ గఢ్ వైపు నుంచి వచ్చిన బలగాలు కర్రెగుట్టలను ఈనెల 21న చుట్టుముట్టాయి. అప్పటి నుంచి కూంబింగ్ కొనసాగుతూనే ఉంది. మొత్తం 24 వేల మంది బలగాలతో ఆపరేషన్ కగార్ సంచలనంగా మారింది.

అపరేషన్ కగార్ పేరుతో కర్రె గుట్టల్లో జరుగుతున్న కూంబింగ్ ఆపరేషన్ పొలిటికల్ టర్న్‌ తీసుకుంటుంది. బ్లాక్ హిల్స్, దుర్గం గుట్టలు మావోయిస్టులకు స్ట్రాటజిక్ లొకేషన్. ఇక్కడ కేంద్ర కమిటీ సమావేశాలు, ఇతర ప్లీనరీలు, భారీగా ఆయుధ డంపులు, ట్రైనింగ్ జరుగుతుందన్న ఉద్దేశంతో బలగాలు ఈ గుట్టలను రౌండప్ చేస్తున్నాయి. హెలికాప్టర్లు, డ్రోన్ల నిఘాలో జల్లెడపడుతున్నారు. అయితే ఈ ఆపరేషన్ తెలంగాణ పోలీసులతో సంబంధం లేదని పోలీస్ వర్గాలు అంటున్నాయి. కేంద్రబలగాలే లీడ్ చేస్తున్నాయని చెబుతున్నారు.

బ్లాక్ హిల్స్ లో ఆపరేషన్ కగార్ ను వెంటనే ఆపాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. అటు చర్చల విషయంపై మావోయిస్టుల లేఖలు కూడా బయటికొచ్చాయి. ఇక లెఫ్ట్ పార్టీల నేతలు, పౌర హక్కుల సంఘాలు కూడా ఆపరేషన్ కగార్ ను ఖండించాయి. శాంతి చర్చలు జరపాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు. కార్పొరేట్ శక్తులకు ఎదురు నిలుస్తే నేరమా అని ప్రశ్నిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలు సరికాదని ప్రొఫెసర్ హరగోపాల్, కూనంనేని సహా పలువురు కామెంట్ చేస్తున్నారు. చర్చలకు వస్తామని అంటున్నా చంపడమేంటని క్వశ్చన్ చేస్తున్నారు. అంతకు ముందు బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ కూడా ఆపరేషన్ కగార్ ప్రస్తావించారు. ఎన్ కౌంటర్లు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, బలవంతంగా మావోయిస్టులను అంతం చేయడం కాకుండా శాంతి చర్చలు జరపాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

గత 10 ఏళ్ల BRS పాలనలో 3,500 మంది నక్సలైట్లు లొంగిపోయారని, రెడ్ కారిడార్ రాష్ట్రాలు, రాజకీయ పార్టీలతో చర్చలు జరపాలని కవిత అంటున్నారు. ఆపరేషన్ కగార్‌ను మారణకాండగా అభివర్ణిస్తూ తెలంగాణలో చాలా చోట్ల నిరసన ర్యాలీలు జరుగుతున్నాయి. భారత్ బచావో సంస్థ వంటి సంస్థలు ఆపరేషన్‌ను ఆపాలని తెలంగాణ మంత్రి సీతక్కను కోరాయి. అడవుల్లోని ఖనిజ సంపదను కార్పొరేట్ సంస్థలకు అప్పగించే కుట్రలో భాగంగా ఆదివాసీలను బలిపశువులుగా చేస్తున్నారన్న ఆరోపణల్ని వినిపిస్తున్నారు. తుడుం దెబ్బ వంటి సంస్థలు కర్రెగుట్టలో ఆపరేషన్‌ను ఆపాలని, ఆదివాసీలు భయాందోళనలో ఉన్నారని, వారికి తాగునీరు కూడా అందని దుస్థితి నెలకొందని అంటున్నారు.

మరోవైపు ఆపరేషన్ కగార్ పై రాష్ట్ర బీజేపీ నేతలు రియాక్ట్ అవుతున్నారు. చేతిలో తుపాకీ పట్టుకొని శాంతి చర్చలు అనడం ఎంత వరకు సమంజసం అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి క్వశ్చన్ చేస్తున్నారు. శాంతి చర్చల కంటే ముందు మావోయిస్టులు తుపాకులు వదలాలని, తుపాకులు వదిలేస్తున్నామని ప్రకటించి శాంతి చర్చలకు రావాలన్నారు. సో ఆపరేషన్ కగార్ కాస్తా పొలిటికల్ కగార్ గా మారిపోయింది. ఇది ఇప్పుడు తెలంగాణలో సెన్సిటివ్ సబ్జెక్ట్ గా మారింది. బలగాలు మాత్రం కూంబింగ్ ఆపడం లేదు. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందన్న ఉత్కంఠ పెరుగుతోంది.