
తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై మళ్ళీ చర్చలు ఊపందుకున్నాయి. జూన్ మొదటి వారంలో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం జరిగే అవకాశం కనిపిస్తోంది. వాయిదాలు, ఊహాగానాల మధ్య సాగిన రాజకీయ ధోరణికి ఇప్పుడు తెరపడే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఈసారి ఎవరికి మంత్రిపదవి దక్కుతుంది? ఎవరికి నిరాశ ఎదురవుతుంది? ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గంలో ముగ్గురు ప్రముఖులు పోటీలో ఉండటంతో ఉత్కంఠ మరింత పెరిగింది. మరి ఫైనల్ లైన్ దాటేది ఎవరు? లెట్స్ వాచ్ దిస్ ఆఫ్ ది రికార్డ్
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయి.ఇందులో ఐదుగురిని నియమించేందుకు అధిష్టానం సంసిద్దత చూపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం..సామాజిక న్యాయం సాధించాలనే దృష్టితో –ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం వర్గాలకు ఒక్కొక్క పదవి ఇవ్వాలని నిర్ణయించారట. బలమైన ప్రాతినిధ్యం లేని ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు ఈసారి అవకాశాలు కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
వెనుకబడిన వర్గాల ఎంపిక దాదాపు తేలిపోయినా… రెడ్డి సామాజిక వర్గంలో మాత్రం పోటీ తీవ్రంగా ఉంది. నిజామాబాద్ నుంచి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి,రంగారెడ్డి జిల్లాలోని సీనియర్ నేత మల్లా రెడ్డి,నల్లగొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..ఈ ముగ్గురూ మంత్రిపదవిపై ఆసక్తితోపాటు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పార్టీలోని కొంతమంది సీనియర్లు సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇస్తున్నారని తెలుస్తోంది. అదే సమయంలో మల్లా రెడ్డి.. రంగారెడ్డి జిల్లా కోటాలో తానే అర్హుడినని బలంగా వాదిస్తున్నారు.అసంతృప్తి గళాన్ని బహిరంగంగానే వినిపించారు కూడా..దీనికి తోడు జానా రెడ్డి రాసిన లేఖ మల్లా రెడ్డికి బలంగా నిలిచే అంశంగా మారినట్టు సమాచారం.
ఇక మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రిపదవిపై తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.ఏఐసీసీ నేత వేణుగోపాల్‌తో సన్నిహితంగా ఉన్న ఆయన… ఢిల్లీ స్థాయిలో దూకుడుగా లాబీయింగ్ చేస్తున్నారు. తన అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానా రెడ్డి వంటి కీలక నేతలతో కలిసి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు.రాజకీయంగా నల్లగొండ జిల్లాలో పార్టీకి బలం తీసుకొచ్చే నేతగా ఆయన్ను పరిశీలిస్తున్న వర్గాలు కూడా ఉన్నాయట.అయితే… ముగ్గురిలో ఎవరికైనా ఒకరికి పదవి ఇస్తే, మిగిలిన ఇద్దరిలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశం ఉంది. అదే ఇప్పుడు విస్తరణకు ప్రధాన అడ్డంకిగా మారినట్లు తెలుస్తోంది.
ఒక్క మంత్రి పదవికోసం ముగ్గురు రెడ్డి నేతల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది..ఎవరి చివరి ప్రయత్నాల్లో వారున్నారు.జూన్ మొదటి వారంలో విస్తరణ ఖాయం అంటున్నారు.అయితే “ఫైనల్ లైన్” దాటేది ఎవరు? బుజ్జగింపుల పర్వం ఎవరికి? అనేది వేచి చూడాల్సిందే