పిసిసి కొత్త కమిటి…

కాంగ్రెస్ పార్టీలో పదవుల పంచాయితీ తేలడం లేదు. కనీసం పీసీసీ కార్యవర్గం ఏర్పాటు కూడా ఇప్పటి వరకు పూర్తి కాలేదు. గత కొంత కాలంగా కార్యవర్గ రూపకల్పన జరుగుతున్నట్లు ప్రచారం చేస్తున్నారు…లిస్టు ఢిల్లీకి వెళ్లిందని చెప్పుకొస్తున్నారు. పలుమార్లు సీఎం, పీసీసీ చీఫ్​ లు కూడా ఢిల్లీకి వెళ్లి కార్యవర్గం ఏర్పాటుపై తమ వివరణ ఇచ్చారు. కానీ కార్యవర్గం ప్రకటన లో జాప్యం జరుగుతూనే ఉంది. దీంతో పదవులు ఆశిస్తున్న పార్టీ నేతల్లో స్థబ్దత నెలకుంటోంది. మరి పీసీసీ ప్రెసిడెంట్ చెపుతున్నట్లు ఈ నెలలో అయినా పీసీసీ కార్యవర్గాన్ని ప్రకటిస్తారా?

తెలంగాణ కొత్త పీసీసీ అధ్యక్షుడిగా మహేష్‌కుమార్‌గౌడ్ బాధ్యతలు చేపట్టి దాదాపు 9 నెలలు కావొస్తుంది. అయినా పీసీసీకి పూర్తిస్థాయి కార్యవర్గాన్ని ఇప్పటి వరకు ఏర్పాటు చేయకపోవడం విస్మయానికి గురి చేస్తుందంటున్నారు. హైకమాండ్ ఆదేశాల మేరకు పీసీసీ టీమ్‌లోకి గతంలోనే కొన్ని పేర్లను ఎంపిక చేశారు. జిల్లాల వారీగా ఫీడ్ బ్యాక్ తీసుకొని మరీ హైకమాండ్ కు పంపించారు. కానీ ఎలాంటి ఫలితం లేదని ఆశావహులు అంసతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వాయిదాలు వేస్తున్నారే తప్ప…కొత్త కమిటీల ప్రకటన ఊసే లేకపోవడంతో గాంధీభవన్ కు వస్తున్న నేతలు నిరాశకు గురవుతున్నారట.

ప్రస్తుతం పాత కార్యవర్గంతోనే పీసీసీ కార్యక్రమాలు చేయాల్సి వస్తోంది. పైగా టీమ్ కూడా పూర్తి స్థాయిలో లేదు. చాలా మంది వేర్వేరు పార్టీ పోస్టులలో బాధ్యతలు నిర్వహిస్తున్న పరిస్ధితి. దీంతో పార్టీ చేపట్టిన కార్యక్రమాలేవీ పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నారనే టాక్ నడుస్తోంది. ప్రభుత్వానికి, పార్టీకి మధ్య కో ఆర్డినేషన్ లేకపోవడానికి ఇదే కారణమంటున్నారు. ఆ క్రమంలో ప్రభుత్వంపై నెగెటివ్ టాక్ పెరుగుతుందనే చర్చ మొదలైంది. పీసీసీ కార్యవర్గం ప్రకటన ఇంత ఆలస్యంగా ఎప్పుడూ జరగలేదని సీనియర్ నాయకులు అంటున్నారు. పార్టీ కోసం ఎంత పనిచేసినా, పదవులు లేకపోవడంతో తమకు గుర్తింపు లేదని నేతలు మధనపడుతున్నారు. క్యాబినెట్ విస్తరణ అటు ఉంచితే…పీసీసీ కార్యవర్గాన్ని కూడా పెండింగ్ పెట్టడంతో నాయకులు తీవ్ర అసంతృప్తితో కనిపిస్తున్నారు.

కొత్త పీసీసీ కార్యవర్గంలో స్థానం కోసం స్టేట్ ఆఫీస్ గాంధీ భవన్ నుంచి జిల్లా స్థాయి లో కమిటీ ల వరకు పుల్ కాంపిటేషన్ నెలకొంది. దాదాపు రెండు వందల మంది నేతలు పార్టీ పదవుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే నేతల మధ్య అభిప్రాయ భేదాలు, సమన్వయ లోపం లేకుండా కొత్త పీసీసీ కమిటీ ప్రకటిస్తామని ముఖ్య లీడర్లు చెబుతున్నారు. ఇక గతంలో పీసీసీ కార్యవర్గంలో జంబో ప్యాక్ ఉండేది. సుమారు 90 మంది సభ్యులు ఉండే కానీ ఈ సారి ఆలా కాకుండా లిమిటెడ్‌గా జిల్లాకి ఇద్దరి చొప్పున పార్టీ కోసం సిన్సియర్ గా పని చేసే వారికి అవకాశం కల్పించనున్నట్లు గాంధీభవన్ వర్గలో చర్చ నడుస్తుంది. అలాగే పీసీసీ సెక్రటరీ లు, స్పోక్స్ పర్సన్స్ విషయం లో కూడా అచి తూచి లిస్ట్ తయారౌతున్నట్లు సమాచారం