మిర్యాలగూడ ఎమ్మెల్యే దూకుడు..!

మిర్యాలగూడ ఎమ్మెల్యేగా మొదటి సారి గెలిచిన బత్తుల లక్ష్మారెడ్డి తనదైన మార్క్ చూపించుకోవడానికి తెగ పాట్లు పడుతున్నారంట. సామజిక సేవా కార్యక్రమాలతో నియోజకవర్గంలో తొందరగా పాపులారిటీ సంపాదించుకొని భారీ మెజార్టీతో ఆయన కాంగ్రెస్ నుంచి గెలుపొందారు . కాని ఎమ్మెల్యేగా గెలిచాక ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటూ సతమతమవుతున్నారంట. ఎమ్మెల్యే కాకముందే మంచి పేరు ఉన్న లక్ష్మారెడ్డి గెలిచాక అంత మైలేజ్ రావడం లేదని ఫీలవుతున్నారట. అసలు అధికారపక్షంలో ఉన్నా ఆయనకు ఆ పరిస్థితి ఎందుకొచ్చింది?

నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డికి గట్టి పట్టున్న నియోజకవర్గం. జానారెడ్డి అనుచరుడు ప్రస్తుత ఎమ్మెల్సీ శంకర్‌నాయక్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మిర్యాలగూడ టికెట్ ఆశించారు. అప్పటికే తన ఇద్దరు కుమారులకు ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు దక్కించుకున్న జానారెడ్డి.. శంకర్‌నాయక్‌కు టికెట్ కోసం ఎంత ప్రయత్నించినప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం బత్తుల లక్ష్మారెడ్డి వైపు మొగ్గు చూపింది. దాంతో నియోజకవర్గంలో కాంగ్రెస్ రెండు గ్రూప్‌లుగా మారిన పరిస్ధితి.

ఎన్నికల సమయం నుంచే రెండు వర్గాల వారు ఎవరికి వారన్నట్లు వ్యవహరిస్తూ వస్తున్నారు. అధికారంలో వచ్చిన తర్వాత కూడా రెండు వర్గాలుగా చీలిపోయి పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు. తాజాగా శంకర్‌ నాయక్‌కు జానారెడ్డి పట్టబట్టి మరి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. దాంతో మిర్యాలగూడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వర్గాల మధ్య మరితంగా గ్రూప్‌ రాజకీయాలు పెరిగాయనే టాక్ నడుస్తోందట.

ఇపుడు శంకర్ నాయక్ ఎమ్మెల్సీ కావడంతో పార్టీ క్యాడర్ జానారెడ్డి వర్గం వైపు మొగ్గు చూపుతోందంట. ఆ క్రమంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ని ఒంటరి చేయాలని చూస్తున్నారనే టాక్ విస్తోంది. రాజకీయ అనుభవం లేకపోవడం… తొలిసారిగా గెలవడంతో లక్ష్మారెడ్డి రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే చర్చ నియోజకవర్గంలో నడుస్తోంది. జానారెడ్డి వర్గం, శంకర్‌ నాయక్‌కు మద్థతుగా నిలవడంతో ఎమ్మెల్యేకు పెద్ద ఇబ్బందిగా మారిందట. దాంతో మిర్యాలగూడలో లక్ష్మారెడ్డి గ్రాఫ్ తగ్గుకుంటూ వస్తుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

మరోవైపు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు కూడా యాక్టివ్‌గా కార్యక్రమాలు చేస్తూ.. ప్రజలోకి వెళుతున్నారు. దాంతో ఓ వైపు ప్రతి పక్షం దూకుడు, మరో వైపు సొంత పార్టీ నేతల సహకారం లేకపోవడంతో తన గ్రాఫ్ తగ్గుతుందని గమనించిన లక్మారెడ్డి ఇక లాభం లేదనుకొని దూకుడు పెంచాలనే వ్యూహంలో ఉన్నారట. వరుస కార్యక్రమాలు చేస్తూ జనాల్లోకి చొచ్చుకుపోవడానికి ప్రయత్నిస్తున్నారు. నియోజకవర్గంలో పెద్ద కార్యక్రమాలకి భారీ జనసందోహం ఉండేలా, తనతో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యేలా చూసుకుంటున్నారు.

మొన్న మిర్యాలగూడలో ఇరిగేషన్‌పై మంత్రుల సమీక్ష సమావేశానికి దగ్గరుండి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసి మంత్రుల మందు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ తర్వాత తన పుట్టిన రోజును బాహుబలి తరహాలో సెట్ వేసి వేలాది మందితో కనీవినీ ఎరుగని రీతి లో వేడుకలు జరుపుకున్నారు. కామ్‌గా ఉంటే అందరు తక్కువ అంచనా వేస్తున్నారని, అందుకే రూట్ మర్చి తన సత్తా ఏంటో తెలియాలని దూకుడుగా ముందుకుపోతున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. నాగార్జున సాగర్ బుద్ధవనంలో జరిగిన మిస్ వరల్డ్ కార్యక్రమంలో కూడా పాల్గొని ఇంగ్లీష్ స్పీచ్ ని ఇరగదీసారు.

ఒక్కసారిగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి దూకుడు పెంచడంతో జిల్లా కాంగ్రెస్ శ్రేణులన్నీ ఆయన గురించే చర్చించుకుంటున్నాయంట. సడన్‌గా ఎమ్మెల్యే స్పీడ్ పెంచడానికి జానారెడ్డి ఎఫెక్టే అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మిర్యాలగూడలో ఎప్పటి నుంచో పాతుకుపోయిన జానారెడ్డి వర్గం ప్రభావంతో తన ప్రాబల్యం తగ్గిపోతుందన్న ఫీలింగుతో మిర్యాలగూడ ఎమ్మెల్యే తనదైన మార్క్ కోసం ప్రయత్నిస్తున్నారంటున్నారు. మరి చూడాలి కురు వృద్దుడు జానారెడ్డి వ్యూహాల ముందు లక్ష్మారెడ్డి స్పీడ్ ఎంత వరకు వర్కౌట్ అవుతుందో?