
ఆ జిల్లా అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ నెలకొందట..పదవి కోసం ఎవరికి వారుఅగ్రనాయకులను ప్రసన్నం చేసుకునే పనిలో బిజీ బిజీగా ఉన్నారట.ఎలాగైనా పదవి దక్కించుకోవాలని పావులు కదుపుతున్నారట. నేను సీనియర్ అంటే నేనే సీనియర్ అంటూ పోటీ పడుతూ నాకు అన్ని అర్హతలు ఉన్నాయంటే నాకే ఉన్నాయంటూ పదవి కోసం పైరవీలు చేస్తున్నారట. ఇంతకీ ఏదా జిల్లా ,అసలు కాంగ్రెస్ అధిష్టానం మనసులో ఎవరున్నారు, ఎవరికి అధ్యక్ష పదవి దక్కనుంది లెట్స్ వాచ్.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 6 జిల్లాలు ఉంటే అందులో హన్మకొండ జిల్లా అధ్యక్ష పదవికి ఫుల్ డిమాండ్ వుందట.సుదీర్ఘ కాలం తర్వాత అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ క్యాడర్ ఉత్సాహంగా ఉంది. బీఆరేస్, బీజేపీ నుండి పెద్ద ఎత్తున చేరిక కావడంతో పార్టీ బలోపేతానికి ఇదే సరైన సమయమని భావించిన కాంగ్రెస్ అధిష్టానం.. జిల్లాకు నూతన అధ్యక్షుడిని నియమించాలని ఆలోచనలో పడిందట. ఇదే కరెక్ట్ టైం అనుకుని కొంతమంది నేతలు ఎమ్మెల్యేను,మంత్రులను,రాష్ట్ర నాయకులను కలిసి పైరవీ లు మొదలుపెట్టేశారట. స్థానిక ఎన్నికలు,కార్పొరేషన్ ఎన్నికలు కూడా ఉండడంతో సమర్ధుడు,పార్టీ విధేయుడెవరో వెతికే పనిలో కాంగ్రెస్ అధిష్టానం ఉందట. త్వరలో అధ్యక్ష ఎన్నిక ఉంటుందనే సంకేతాల నేపథ్యంలో ఒక్కసారిగా ఆశావహులు తమ అదృష్టాన్ని పరిశీలించుకునే పనిలో పడ్డారట.
హన్మకొండ జిల్లా అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ నెలకొంది. ఇప్పటికే సీనియర్ల జాబితాను కాంగ్రెస్ అధిష్టానం పరిశీలిస్తుందట. ప్రస్తుతం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే గా ఉన్న నాయిని రాజేందర్ రెడ్డి అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు.గతంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా పని చేసిన నాయిని రాజేందర్ రెడ్డి జిల్లాల విభజన తర్వాత హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.అయితే త్వరలో జిల్లా అధ్యక్ష పదవి ఎన్నికలు ఉంటాయనే ప్రచారం నేపథ్యంలో ఆశావహులు ఎమ్మెల్యే పై ఒత్తిడి చేస్తున్నారని చర్చ సాగుతుంది. ఎవరికి అధ్యక్ష పదవి ఇస్తే బాగుంటుంది, పార్టీ బలోపేతం అవుతుంది, సామాజిక సమీకరణాలేంటి అని కాంగ్రెస్ క్యాడర్ లో చర్చ సాగుతోందట.
త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు,మున్సిపల్ ఎన్నికలు ఉండడం తో అనుభవం తో పాటు బలమైన సీనియర్ కాంగ్రెస్ నేతకే అవకాశం దక్కాలని కాంగ్రెస్ క్యాడర్ కోరుకుంటుందట. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కని నేత కు అధ్యక్ష పదవి ఇస్తామని అప్పట్లో హామీ ఇచ్చారట. జంగా రాఘవ రెడ్డి,ఇనుగాల వెంకట్రామ్ రెడ్డి లో ఒకరికి అధ్యక్ష పదవి దక్కుతుందని భావించారు. కానీ కాంగ్రెస్ అధికారం లోకి వచ్చాక జంగా రాఘవ రెడ్డి కి ఆయిల్ ఫెడరేషన్ చైర్మన్ గా, ఇనుగాల వెంకట్రామ్ రెడ్డికి కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ ఛైర్మెన్ గా అవకాశం దక్కడం తో అసలు జిల్లా అధ్యక్ష పదవి ఎవరికి దక్కుతుందో అనే చర్చ జోరుగా సాగుతుంది. ఇప్పటికే 15 నుండి 20 మంది నేతలు అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారట.
జిల్లా అధ్యక్ష పదవి కోసం ప్రస్తుతం ఆయిల్ ఫెడరేషన్ చైర్మన్ గా కొనసాగుతున్న జంగా రాఘవ రెడ్డి, దొమ్మటి సాంబయ్య, నమిండ్ల శ్రీనివాస్, భట్టి శ్రీనివాస్ ,జక్కుల రవీందర్,బంక సంపత్ తో పాటు మరికొంత మంది నేతలు ఎవరికివారే పావులు కదుపుతున్నారాని పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. నేనే సీనియర్ ను నాకే అవకాశం ఇవ్వాలంటూ అధిష్టానం పై ఒత్తిడి చేస్తున్నారట. నామినేషన్ పదవి ఆశించి బంగపడ్డవారు ఈసారైనా మాకు అవకాశం దక్కాలని కోరుకుంటున్నారట. ఇదిలా ఉంటే పార్టీ అధికారంలోకి వచ్చినా కాంగ్రెస్ లో వర్గ పోరు మాత్రం ఆగడం లేదు. ఎప్పటినుండో ఉన్న మమ్మల్ని కాదని కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని ఆ మధ్య జరిగిన కాంగ్రెస్ సమీక్షా సమావేశంలో ఓ సీనియర్ కాంగ్రెస్ నేత ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తో వాగ్వాదం కు దిగడంతో అక్కడే కూర్చున్న సీనియర్ నాయకులు అసహనానికి గురయ్యారట.
ఓ వైపు అసంతృప్తులు,మరోవైపు భారీగా పెరిగిన ఆశావహులు… ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మనసులో ఎవరున్నారు, అధిష్టానం ఎవరికి మొగ్గు చూపుతుందో వేచి చూడాల్సిందే….