
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో… గత ఎన్నికల్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతిలో ఓటమి పాలైన బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు కష్టకాలం నడుస్తోంది. మాజీ బీఆరెఎస్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీ తీర్థం పుచ్చుకోవడంతో.. హుజూర్ నగర్ బీఆర్ఎస్ డ్రైవర్ లేని కారులా తయారైంది.అ పార్టీకి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ లేకపోవడం, ద్వితీయ శ్రేణి నాయకుల మధ్య ఆధిపత్య పోరు, వర్గ విభేదాలు.. హుజూర్ నగర్ బీఆర్ఎస్ రాజకీయ సమీకరణాలను సంక్లిష్టం చేస్తున్నాయి.
మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కి శిష్యుడు గా పేరున్న”శానంపూడి సైదిరెడ్డి బీజేపీలో చేరిన తర్వాత..హుజూర్ నగర్ బీఆర్ఎస్ లో నాయకత్వంలో శూన్యత ఏర్పడింది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు ద్వితీయ శ్రేణి నాయకులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తమకే నియోజకవర్గ పగ్గాలు అప్పగించాలని అధిష్టానం వద్ద లాబీయింగ్ చేస్తున్నారు. అయితే.. ఇక్కడ అసలు సమస్య వేరే ఉంది. పార్టీలో ఏకాభిప్రాయం లేకపోవడమే ప్రధాన అడ్డంకిగా మారింది. స్థానిక జడ్పీటీసీ సభ్యుడితో పాటు సీనియర్ నేత ఒంటెద్దు నర్సింహా రెడ్డి, మరో ఇద్దరు నేతలు రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు ఆశిస్తున్నారు. అంతేకాదు.. సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అనుచరులు ఒక వర్గంగా, మిగిలిన నేతలు మరో వర్గంగా విడిపోయారనే చర్చ కూడా జరుగుతోంది. దీంతో.. పార్టీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి.”
హుజూర్ నగర్ లోనే కాదు రాష్ట్రం లో కూడ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తిరుగులేని నాయకుడిగా కొనసాగుతున్నారు. ఆయనను ఎదుర్కొనేందుకు అక్కడ బలమైన నాయకుడు లేకపోవడం బీఆర్ఎస్ పార్టీకి ప్రతికూలంగా మారింది. పార్టీలో నాయకత్వ లేమి, వర్గ విభేదాలు కార్యకర్తల్లో నైరాశ్యాన్ని నింపుతున్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి దెబ్బకు పార్టీ వీడి బీజేపీలో చేరిన శానంపూడి సైదిరెడ్డి కూడా నియోజకవర్గంలో కనుమరుగయ్యారు. ఇటీవల సూర్యాపేటలో జరిగిన కేటీఆర్ మీటింగ్, వరంగల్‌లో జరిగిన కేసీఆర్ రజతోత్సవ సభకు ఒంటెద్దు నర్సింహా రెడ్డి హుజుర్ నగర్ నుండి జన సమీకరణ బాధ్యతలు తీసుకున్నారు. దీంతో.. అందరు నియోజకవర్గ బాధ్యతలు తమకే అప్పగించాలని ఎవరి ప్రయత్నం వారు చేస్తున్నారు.
హుజూర్ నగర్ బీఆర్ఎస్ లో జరుగుతున్న పరిణామాలపై అ పార్టీ అధిష్టానం కూడా ఆరా తీస్తోంది. అయితే.. ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పార్టీలో ఏకాభిప్రాయం సాధించి, బలమైన నాయకుడిని ఎంపిక చేయడం అధిష్టానానికి పెను సవాలుగా మారింది. రాబోయే రోజుల్లో హుజూర్ నగర్ బీఆర్ఎస్ లో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయోనని క్యాడర్ లో తీవ్ర చర్చ జరుగుతుంది.చివరికి.. ఈ నియోజకవర్గంలోబిఆరెస్ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతుందనే టాక్ వినిపిస్తోంది.
హుజూర్ నగర్ బీఆర్ఎస్ లో నెలకొన్న రాజకీయ పరిస్థితులు ఆసక్తికరంగా మారాయి. పార్టీని నడిపించే నాయకుడు లేకపోవడం, ద్వితీయ శ్రేణి నాయకుల మధ్య ఆధిపత్య పోరు, వర్గ విభేదాలు..ఆ పార్టీ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయి.ఈ కష్టకాలంలో హుజుర్ నగర్ లో “డ్రైవర్ లేని కారు” ఎలా ముందుకు సాగుతుందో వేచి చూడాలి.