ఆ మంత్రుల మధ్య దోస్తీ కుదిరినట్లేనా..?

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లో కీలకపాత్ర పోషిస్తున్న ఆ జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు ఇప్పటి వరకు ఎవరికి వారే యమునాతీరే అన్నట్లు పర్యటిస్తున్నారు. కానీ ఇటీవల కాలంలో మంత్రుల మధ్య కొత్త మార్పు కనిపిస్తోంది. కొన్నిచోట్ల ముగ్గురు, మరికొన్ని చోట్ల ఇద్దరు కలిసి పర్యటనలు చేయడం ఆ జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మంత్రుల మధ్య పెరిగిన దోస్తీ శాశ్వతంగా ఉంటుందా? లేక తాత్కాలికమేనా ? అన్న చర్చ ఆ జిల్లాలోని అధికార, విపక్ష పార్టీల్లో జరుగుతోంది.ఇంతకీ అది ఏ జిల్లా? ఆ మంత్రులెవరు? ఈ కొత్త మార్పుకు కారణమేంటి? లెట్స్ వాచ్ దిస్ ఆఫ్ ది రికార్డ్.

ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పోంగులూటి శ్రీనివాస్, డిప్యూటి సీఎం మల్లు భట్టి విక్రమార్కా తమ నియోజకవర్గాల్లో తిరిగినా, ఇతర నియోజకవర్గాలకు వెళ్లినా ఎవరో ఒక్కరే వెళ్లి కార్యక్రమాలు నిర్వహించేవారు. గత ఏడాది కాలంగా జిల్లాలో ముగ్గురు మంత్రుల పర్యటనలు ఎవరికి వారే అన్న చందంగా సాగాయి. అయితే ఇటీవల కొంత మార్పు కనిపిస్తోంది. ఖమ్మం లో ప్రభుత్వ మెడికల్ కళాశాల శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ పర్యటన సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు పాల్గొని సంయుక్తంగా శంకుస్థాపన చేశారు. చాలాకాలం తర్వాత ఈ ముగ్గురు కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం ఆసక్తికరంగా మారింది. పైకి అంతా ఐక్యమని చెబుతున్నా అంతర్గతంగా ఎవరివారు తమదైన శైలిలో ప్రయాణం సాగిస్తున్న నేపథ్యంలో ఖమ్మం మెడికల్ కాలేజీ శంకుస్థాపన కార్యక్రమంలో అందరూ కలిసి పాల్గొనడం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.

మరోవైపు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా జిల్లాలో కలిసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తుండడం మరింతగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. రీసెంట్ గా ఆశ్వారావుపేట నియోజకవర్గంలో భట్టి విక్రమార్క , పొంగులేటి శ్రీనివాస్ లు కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారని పర్యటన షెడ్యూల్ తయారు చేశారు. ఇద్దరు కలిసి ఇల్లెందు నియోజకవర్గంలో పర్యటిస్తారని ఎమ్మెల్యే కోరం కనకయ్య ప్రకటించారు. అయితే మంత్రి పొంగులేటి ఇల్లెందు పర్యటనకు వెళ్లలేదు. దీంతో భట్టి ఒక్కరే శంకుస్థానలు, ప్రారంభోత్సవాలు చేశారు. అందుకు కారణం గతంలో ఈ ఇద్దరి మధ్య రాజకీయంగా చాలాకాలం ఏర్పడిన ఎడబాటు అని సమాచారం.

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జిల్లా రాజకీయాల్లోకి ప్రవేశించినప్పుడు 2014లో వైసీపీ నుంచి ఎంపీగా పోటీచేయగా, అప్పుడు కాంగ్రెస్ ఓటుబ్యాంకు భారీగా చీలే పరిస్థితి ఉండడంతో డిప్యుటీ స్పీకర్ గా ఉన్న భట్టి …మంత్రిగా ఉన్న రాంరెడ్డి వెంకటరెడ్డి నియోజకవర్గాల్లో వైసీపీ పోటీచేయకుండా సీపీఎం పోటీ చేసింది. దీంతో కాంగ్రెస్, వైసీపీల మధ్య క్రాస్ ఓటింగ్ జరగడంతో అటు ఎంపీగా పొంగులేటి, ఎమ్మెల్యేలుగా భట్టి విక్రమార్క, రాంరెడ్డి వెంకటరెడ్డి అప్పట్లో గెలుపొందారు. వైసీపీతో మిత్రపక్షంగా ఉన్న సీపీఎం రెండుచోట్ల ఓటమి చెందగా పొంగులేటి గెలుపులో కూడా సీపీఎం కీలక పాత్ర పోషించింది.

అప్పట్లో కాంగ్రెస్, వైసీపీల మధ్య మితృత్వం సాగినా పొంగులేటి బీఆర్ఎస్ లో చేరిన తర్వాత మధిర నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న భట్టి విక్రమార్క నియోజకవర్గంపై కూడా పొంగులేటి దృష్టిపెట్టడంతో ఇద్దరి మధ్య అప్పట్లో రాజకీయంగా విమర్శలు, ప్రతి విమర్శలు సాగాయి. అలా చాలాకాలం ఇద్దరి మధ్య గ్యాప్ కొనసాగింది. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కూడా చాలా కాలం ఇద్దరి మధ్య సఖ్యత లేదన్న అభిప్రాయాలు వినిపించాయి. అయితే ఇటీవల వారిద్దరూ కలిసి సాగిస్తున్న పర్యటనలు ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇక మునుముందు ముగ్గురు కలిసి జిల్లా ను అభివృధ్ధి బాట పట్టిస్తారా లేక మళ్ళి ఎవరికి వారే అన్నట్లు ఉంటారో చూడాలి.