
Goshamahal MLA Raja Singh: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బీజేపీకి ఆయన రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి అందజేశారు.
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవికి నామినేషన్ల ప్రక్రియ జరుగుతున్న వేళ ఆ పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజేపీకి గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డికి సోమవారం హైదరాబాద్‌లో అందజేశారు. అనంతరం పార్టీ కార్యాలయంలో వద్ద విలేకర్లతో ఎమ్మెల్యే రాజా సింగ్ మాట్లాడుతూ.. రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్ వేసేందుకు వెళ్లితే.. తనను అడ్డుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎమ్మెల్యే రాజా సింగ్ వివరించారు.
కిషన్ రెడ్డికి లిఖిత పూర్వకంగానే లేఖ రాసినట్లు తెలిపారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు కిషన్ రెడ్డికి చెప్పి.. లేఖ రాశానన్నారు. ఎమ్మెల్యేగా డిస్ క్వాలీఫై చేసేలా అసెంబ్లీ స్పీకర్‌కు లేఖ పంపమని ఆయనతో పేర్కొన్నట్లు చెప్పారు. 2014 నుంచి ఎన్నో ఇబ్బందులు పడ్డానన్నారు. తాను టెర్రరిస్టుల హిట్ లిస్ట్‌లో ఉన్నానని గుర్తు చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాకూడదని పార్టీలోని కొందరు పెద్ద నాయకులు కోరుకుంటున్నారని వివరించారు. Goshamahal MLA Raja Singh.
ఇక తాను బీజేపీలో కొనసాగలేనని ఆయన స్పష్టం చేశారు. తనకు మద్దతు ఇస్తే.. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామంటూ తన అనుచరులను కొందరు బెదిరించారని ఆరోపించారు. బీజేపీ అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు తాను ముహూర్తం సైతం చూసుకున్నానని తెలిపారు. మీకో దండం.. మీ పార్టీకో దండమని బీజేపీ అగ్రనాయకత్వాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే రాజా సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
మరో వైపు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా రామచందర్ రావు పేరును పార్టీ అగ్రనాయకత్వం ఖరారు చేసింది. ఇప్పటికే ఆయన నామినేషన్ దాఖలు చేశారు. రామచందర్ రావు పేరును మంగళవారం ప్రకటించే అవకాశముంది. అదీకాక కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆదివారం తెలంగాణలో పర్యటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడిగా రామచందర్ రావు పేరును ఎంపిక చేసినట్లు రాష్ట్ర నేతలకు ఈ సందర్భంగా అమిత్ షా సూచించినట్లు తెలుస్తోంది. ఆయన పేరును అధికారికంగా పార్టీ ఎన్నికల కమిటీ మంగళవారం ప్రకటించనుంది. ఇక మరో నామినేషన్ దాఖలైతే ఎన్నికలు అనివార్యమయ్యే పరిస్థితి ఏర్పడేది. కానీ నామినేషన్ దాఖలు చేసేందుకు తన అనుచర గణంలో పార్టీ కార్యాలయానికి వెళ్లిన ఎమ్మెల్యే రాజాసింగ్‌ను లోపలికి అనుమతి ఇవ్వలేదు. దీంతో బీజేపీకి రాజాసింగ్ గుడ్ బై చెప్పారు.
ఇంకోవైపు ఎమ్మెల్యే రాజాసింగ్‌తో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సమావేశమయ్యారు. పార్టీకి రాజీనామా చేయడంపై మరోసారి ఆలోచించాలంటూ రాజాసింగ్‌కు బండి సంజయ్ సూచించారు. అయితే పార్టీకి రాజీనామా నిర్ణయం జరిగిపోయిందంటూ స్పష్టం చేశారు. దీనిపై పునరాలోచన లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు కుండ బద్దలు కొట్టారు.