
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 39 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించారు. హైడ్రా రంగంలోకి దిగి భూములను స్వాధీనం చేసుకొని.. హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేస్తే.. ఆ బోర్డును కాస్తా తొలగించేశారు. ఇదంతా చేసింది మైలవరం ఎమ్మెల్యే వసంత. అయితే, మళ్లీ రంగప్రవేశం చేసిన హైడ్రా.. బోర్డు తొలగించిన స్థానంలో మళ్లీ హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేసింది. దీంతో వసంత కృష్ణప్రసాద్ న్యాయపోరాటానికి సిద్దమవుతున్నారు. అయినా తగ్గని హైడ్రా.. సంబంధిత ఎమ్మెల్యేపై చట్టపరమైన చర్యలకు పూనుకుంటుండటం చర్చనీయాంశంగా మారింది
హఫీజ్‌పేట్‌లోని టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వివాదస్పద భూములకు సంబంధించి ఇప్పుడు సరికొత్త వివాదం మొదలైంది. వసంత కృష్ణప్రసాద్ అధీనంలో ఉన్న భూములను కొద్దిరోజుల క్రితం హైడ్రా స్వాధీనం చేసుకుంది. ఆ సమయంలో ఈ భూములపై కోర్టులో ఐదు పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయంటూ బోర్డు పెట్టింది హైడ్రా. అయితే, హఫీజ్‌పేట్‌లోని భూముల్లో హైడ్రా ఏర్పాటు చేసిన బోర్డును తాజాగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మనుషులు మాయం చేశారు. దీంతో హైడ్రా మరోసారి రంగంలోకి దిగింది. తొలగించిన బోర్డు స్థానంలోనే మళ్లీ హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేసింది.
హఫీజ్‌పేట్ భూముల విషయంలో హైడ్రా చేపట్టిన చర్యలపై ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సర్వే నెంబర్ 79లోని 39 ఎకరాల భూములను తాము రెగ్యులరైజ్ చేయించుకున్నామంటున్నారు ఎమ్మెల్యే వసంత. హైడ్రాపై పోలీస్ స్టేషన్‌లో కేసు పెడతామంటున్నారు.
ఇక వసంత వ్యాఖ్యలపై హైడ్రా మరోసారి స్పందించింది. సర్వే నంబర్ 79లో ఉన్న 39 ఎకరాల భూమంతా ప్రభుత్వానిదేనని ప్రకటించింది హైడ్రా. ఈ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని.. స్టేటస్ కో మెంటెయిన్ చేస్తూ.. నాట్ టు ఇంటర్‌ఫియర్ అంటూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చినట్టు హైడ్రా స్పష్టం చేసింది. అలాగే, చట్టపరమైన చర్యలు తీసుకోమని హైడ్రాకు హైకోర్టు స్పష్టమైన సూచనలు చేయడంతోనే ప్రభుత్వ భూమిలో బోర్డు ఏర్పాటు చేశామని హైడ్రా చెబుతోంది.
ప్రభుత్వ భూములను కబ్జా చేసిందిగాక.. హైడ్రా పెట్టిన బోర్డులను తొలగించినందుకు.. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తామని.. ఎమ్మెల్యే వసంతపై చట్టపరమైన చర్యలకు ముందుకు సాగుతోంది హైడ్రా. మొత్తంమీద హఫీజ్‌పేట్‌లోని సర్వే నెంబర్ 79లో ఉన్న 39 ఎకరాల భూమిని ఎమ్మెల్యే వసంత ఆధీనం నుంచి హైడ్రా పూర్తి స్థాయిలో స్వాధీనం చేసుకుంది. హైదరాబాద్‌లోని మరికొన్ని ప్రభుత్వ భూముల కబ్జాలపై కూడా హైడ్రా ఇదే స్థాయిలో ముందుకు సాగనున్నట్టు తెలుస్తోంది.