కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఓవర్‌లోడ్ …

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయింది. ఎన్నడూ లేని విధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రికార్డ్ స్థాయిలో సీట్లు వచ్చాయి. అన్నీ బాగానే ఉన్నప్పటికీ పార్టీ పరిస్థితి పై మాత్రం ఎవరికీ పట్టింపు లేదు. ఆ నలుగురు నేతలు అటు డీసీసీ అధ్యక్షులుగా ఇటు ఎమ్మెల్యేలుగా డ్యూయల్ రోల్ పోషిస్తున్నారు. వారు జిల్లాలో పార్టీని పట్టించుకోకుండా నియోజకవర్గాలకే పరిమితం కావడంతో ఆయా జిల్లాల్లో పార్టీ పరిస్థితి నానాటికి తీసికట్టు అన్నట్టుగా మారిందట. హస్తం పార్టీ పరిస్థితి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అస్తవ్యస్తంగా మారిందట. స్థానిక సంస్థల ఎన్నికల సీజన్ దగ్గర పడుతున్న తరుణంలో ఈ పరిస్థితిపై పార్టీ క్యాడర్ టెన్షన్ పడిపోతుందంటున్నారు

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పార్టీ అత్యధిక సీట్లు దక్కించుకోవడంలో ఆ నలుగురు జిల్లా పార్టీ అధ్యక్షులు తమవంతు పాత్ర పోషించారు. జిల్లా పార్టీ అధ్యక్షులుగా పనిచేస్తూ అప్పటి బీఅర్ఎస్ ‌ప్రభుత్వంపై పోరాటాలు సాగించారు. 2023 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ నలుగురు డీసీసీ ప్రెసిడెంట్లు కూడా ఎమ్మెల్యేలుగా విజయం సాధించి ప్రభుత్వంలో కూడా కీలకపాత్ర పోషిస్తున్నారు. అయితే పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా ఇప్పటికీ జిల్లా అధ్యకులుగా వారే కొనసాగుతుండటంతో పార్టీ కార్యక్రమాలలో దృష్టి పెట్టలేకపోతున్నారనే చర్చ కొనసాగుతుంది.

కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు ఆది శ్రీనివాస్, జగిత్యాల జిల్లా పార్టీ సారథి ‌ఆడ్లూరి‌ లక్ష్మణ్ కూమార్, పెద్దపల్లి పార్టీ ప్రెసిడెంట్‌గా మక్కన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ కొనసాగుతున్నారు. ఆది శ్రీనివాస్ ‌వేములవాడ నుండి ఎమ్మెల్యే గా విజయం సాధించి, ప్రభుత్వం విప్ గా ఎన్నిక అయ్యారు. అదే విధంగా ధర్మపురి నుంచి అడ్లూరి లక్ష్మణ్ ఎమ్మెల్యేగా గెలిచి ప్రభుత్వం విప్ గా కొనసాగుతున్నారు. ‌కవ్వంపల్లి సత్యనారాయణ మానకొండూరు నుంచి ఎమ్మెల్యే గా గెలిచారు. రాజ్ ఠాకూర్ రామగుండం నుంచి గెలిచారు. ఈ నలుగురు నేతలు కూడా ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తున్నారు.

కాంగ్రెస్ అధికారం లోకి వచ్చి ఏడాదిన్నర దాటినా ఇంకా కాంగ్రెస్ కొత్త జిల్లా అధ్యక్షులని నియమించలేదు. నాయకులకు జోడు పదవులు ఉండడంతో వారు పార్టీ కార్యక్రమాలకు సరియైన ‌న్యాయం చేయడం లేకపోతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఆ ఎఫెక్ట్‌తో నాలుగు జిల్లాలలో సమన్వయ లోపం స్పష్టంగా కనబడుతుందంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఆ నలుగురు ఎమ్మెల్యేలు ప్రభుత్వం కార్యకలాపాల్లో బిజీగా ఉండడంతో పార్టీలో ఏమైనా సమస్యలు వస్తే పరిష్కరించడంలో తీవ్ర జాప్యం జరుగుతోందంట.

గ్రామస్థాయి, మండలస్థాయిలో పార్టీ కార్యక్రమాలు కూడా అంతంత మాత్రంగానే కొనసాగుతున్నాయని అంటున్నారు. ముఖ్యంగా కరీంనగర్ జిల్లా ‌కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింత స్థబ్ధతుగా కనబడుతుంది. పార్టీ కార్యక్రమాలు కూడా నామమాత్రంగా కొనసాగుతున్నాయి. ఆ నలుగురు డీసీసీ ప్రెసిడెంట్లు జిల్లాలకు వచ్చినప్పుడు వారి‌ అసెంబ్లీ నియోజకవర్గాలకే పరిమితం అవుతుండటంతో జిల్లా పార్టీపై ఆ పరిస్థితి స్పష్టంగా రిఫ్లెక్ట్ అవుతూందని క్యాడర్ వాపోతోంది. కనీసం కాంగ్రెస్ జిల్లా పార్టీ కార్యలయాలలో కూడా సదరు పార్టీ అధ్యక్షులు అడుగు పెట్టడం లేదంట. గడచిన ఏడాది కాలంలో వారు పార్టీ కార్యక్రమాలకు హాజరైన సందర్భాలు వెళ్లపై లెక్కించ వచ్చని… వారు వచ్చినా ఏదైనా ముఖ్యమైన పార్టీ కార్యక్రమం ఉంటేనే హాజరు అవుతున్నారని కార్యకర్తలు విమర్శిస్తున్నారు.

పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లాకు చెందిన కీలక నేతలు దాదాపు రిలాక్స్ మూడ్‌లోకి వెళ్లారట. దాంతో జిల్లాల్లో పార్టీ పరిస్థితి .. ఎవడికి పుట్టిన బిడ్డరా ఎక్కెక్కి ఏడుస్తోంది.. అన్నట్టుగా మారిందట. మండల స్థాయిలో పార్టీలో ఎదురవుతున్న సమస్యలను పట్టించుకునే నాధుడే కరువయ్యారట. ఈ పరిస్థితి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ద్వితీయ శ్రేణి నేతల్లో గుబులు రేపుతోందంట. సహజంగా అధికార పార్టీపై కాలం గడిచేకొద్దీ క్షేత్ర స్థాయిలో కొంచెం వ్యతిరేకత కనిపిస్తుంటుంది. ఆ వ్యతిరేకతను అధిగమించాలంటే పార్టీని సమన్వయం చేయగలిగే నేతలు కచ్చితంగా అవసరం. అదీ గాక అధికార పార్టీ ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గాల్లో పార్టీని నడిపించాలంటే ఫుల్ టైం పార్టీకోసం పని చేసే నాయకుడు సారథ్య బాధ్యతలు చేపట్టాలి.

ప్రస్తుతం ఉన్న జిల్లా పార్టీ అధ్యక్షులకు ప్రభుత్వ కార్యక్రమాలు, సొంత నియోజకవర్గాల పరిధిలో తిరగడానికే సమయం చాలడం లేదంట. అధ్యక్ష బాధ్యతలు తలకు మించిన భారంగా పరిణమించాయని భావిస్తున్నారట. సర్పంచ్ , మండల, జిల్లాపరిషత్ ఎన్నికల్లో సత్తా చాటాలి అంటే పార్టీకి బలమైన నాయకత్వం కావాలని ద్వితీయ శ్రేణి నేతలు కోరుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో రెండు మేయర్ సీట్లు .. 12 మున్సిపల్ పీఠాలను కైవసం చేసుకోవాలి అంటే పార్టీని మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని సీనియర్ నేతలు సూచిస్తున్నారు. కరీంనగర్, సిరిసిల్ల, హుజురాబాద్, కోరుట్ల నియోజకవర్గాల్లో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న నేపథ్యంలో అక్కడ పార్టీని నడిపించలే కపోతే పరిస్థితి గాడితప్పే అవకాశాలు ఉన్నాయని సీనియర్స్ హెచ్చరిస్తున్నారు. అందుకే ఎమ్మెల్యేలు కూడా తమను పార్టీ బాధ్యతల నుంచి తప్పించాలని కోరుతున్నారట. అయినా అధినాయకత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం పార్టీ శ్రేణులకు మింగుడుపడటం లేదంట.

ఇప్పటికైనా ఆ నాలుగు జిల్లాలలో పార్టీకి కొత్త అధ్యక్షులని నియమించాలని కార్యకర్తలు కోరుతున్నారు. ఈ నలుగురు నేతలు పార్టీ పదవులని వదులుకోవడానికి సిధ్ధంగా ఉన్నప్పటికీ ..కొత్తవారిని నియమించే విషయం లో అధిష్టానం ఎందుకు జాప్యం చేస్తుందో వారికి అంతుపట్టడం లేదంట. ఇప్పటి నుండి స్థానిక సంస్థల ఎన్నికలకి‌ సిద్ధం కావాలంటే ఖచ్చితంగా నాయకత్వం మార్పు జరగాలని కాంగ్రెస్ క్యాడర్ బలంగా కోరుతుంది . మరి కాంగ్రెస్ పెద్దలు కొత్త డీసీసీ ప్రెసిడెంట్లపై ఎప్పటికి దృష్టి సారిస్తారోచూడాలి.