మంత్రి కావాలని భావించిన నేత, వరించిన పీసీసీ చీఫ్ పదవి..!

ఓడలు బళ్ళు అవుతాయి.. బళ్ళు ఓడలు అవుతాయి.. అనేది సామెత.. ఇది నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీలోని ఇద్దరికి సరిగ్గా వర్తిస్తుంది.. సుదర్శన్ రెడ్డి నాలుగు సార్లు ఎమ్మెల్యే.. మంత్రిగా పని చేసిన సీనియర్.. రేవంత్ సర్కార్ లో ఆయనకు మంత్రి పదవి రెండుసార్లు కూడా రాలేదు.. అదే మొన్నటివరకూ పార్టీ పదవుల్లో ఉండి.. ఒక్కసారిగా ఎమ్మెల్సీ ఆపై ఏకంగా పార్టీలో రాష్ట్రానికే చీఫ్ గా మారారు మహేష్ కుమార్ గౌడ్.. నిజామాబాద్ జిల్లాకు మంత్రి పదవి రాకపోవడం తో ఇప్పుడు జిల్లాలో అంతా ఆయనే రాజు… ఆయనే మంత్రి.

నిజామాబాద్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత మహేష్ కుమార్ గౌడ్. ఎమ్మెల్సీ అయిన తర్వాత మంత్రి కావాలనుకున్నారు ఆయన. అయితే కాలం కల్సిరావడంతో ఏకంగా ఆయనకు పీసీసీ చీఫ్ పదవి వరించింది. కాంగ్రెస్ పార్టీ కమిటెడ్ వర్కర్ గా, బీసీ నేతగా అధిష్టానం దగ్గర మహేష్ గౌడ్ కు మంచి పేరుంది. అందుకే ఆయన సీనియారిటీకి, సిన్సియారిటీకి సరైన సమయంలో అధిష్టానం గుర్తింపు ఇస్తూ వస్తోంది.

గతంలో నిజామాబాద్ అర్బన్ సీటు నుంచి పోటీ చేసినా ఉపయోగం లేకుండా పోయింది. ఆ తర్వాత ఎమ్మెల్సీ దక్కించుకుని ఇందూరుపై పట్టు సాధిస్తున్న తరుణంలోనే మంత్రిగా కూడా చాన్స్ కోసం ప్రయత్నం చేశారు. కానీ అనూహ్యంగా అతనికి పీసీసీ చీఫ్ పగ్గాలు కట్టబెటింది అదిషానం. సామాజిక సమీకరణలు కలిసి రావడం, సీఎం రేవంత్ సపోర్టుగా నిలబడడంతో అది సాధ్యమయ్యింది.

ఇక మంత్రివర్గ విస్తరణలో పూర్తిగా రెడ్లకు చెక్ పెట్టింది అధిష్టానం. అందుకే నిజామాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి సీనియర్ నేత, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి ఆఖర్లో చెక్ పడింది. ఇది మహేశ్ గౌడ్ కు కల్సొచ్చిందనే చెప్పాలి. పీసీసీ చీఫ్ అవ్వడంతో నిజామాబాద్ జిల్లాకు ఆయనే అనధికార మంత్రిగా చెలామణీ అవుతున్నారట. మరో విషయం ఏంటంటే, అర్బన్ ఇంచార్జిగా షబ్బీర్ అలీ, జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రిగా జూపల్లి కృష్ణారావు ఉన్నా, వారు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండరు. ఇదంతా మహేష్ గౌడ్ కు కల్సొచ్చిందని జిల్లా ప్రజలు భావిస్తున్నారు.