
మొత్తానికి కాంగ్రెస్ లో అసంతృప్తుల పర్వం కొనసాగుతుంది. తమకు మంత్రి పదవులు దక్కకపోవడంతో నేతలు రాజీనామాలకు సిద్దమయ్యారనే టాక్ జోరుగా వినిపిస్తోంది. దీంతో పార్టీలో ఇప్పుడు బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది. కచ్చితంగా మంత్రి పదవి దక్కుతుందని గట్టి నమ్మకంతో ఉన్న ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డికి మంత్రివర్గంలో మొండి చెయ్యి దక్కింది. దీంతో ఆయన రాజీనామాకు సిద్ధమయ్యారా? మల్ రెడ్డి రంగారెడ్డి ని బుజ్జగించేందుకు కాంగ్రెస్ హై కమాండ్ దిగి వచ్చిందా?
మంత్రివర్గ విస్తరణలో ఆరింటికి మూడు మాత్రమే భర్తీ చేయడంతో చోటు దక్కని నేతలు నిరాశకు లోనయ్యారు, ఈసారి కచ్చితంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలకు మంత్రి పదవులు దక్కుతాయని కూడా ఆ సామాజిక వర్గ నేతలు గట్టి నమ్మకంతో ఉన్నారు. కానీ కేవలం బీసీ లోని ముదిరాజ్ వర్గానికి చెందిన మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి, ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి, అదేవిధంగా మాదిగ సమాజిక వర్గానికి చెందిన ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరు లక్ష్మణ్ కి క్యాబినెట్ బెర్తులు ఖరారు అయ్యాయి. దీంతో మంత్రి పదవి దక్కుతుందని ఆశలు పెట్టుకున్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన బోధన్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి,మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి,ఇబ్రహీం పట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి లు తీవ్ర నిరాశతో ఉన్నారు. హై కమండ్ పై అసంతృప్తి రాగం వినిపిస్తున్నారు. దీంతో వీరంతా రాజీనామాలకు కూడా సిద్దమయ్యారనే టాక్ పార్టీలో హాట్ టాపిక్ అయ్యింది.
ముఖ్యంగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి క్యాబినెట్ విస్తరణ లో కచ్చితంగా తనకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే లేదంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ లో సామాన్య కార్యకర్తగా కొనసాగుతాని హై కమాండ్ కు అల్టిమేటం జారీ చేశారు. ఎందుకంటే రంగారెడ్డి జిల్లాలో టిఆర్ఎస్ పార్టీని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ను ధైర్యంగా ఎదుర్కొన్న.. ఆ టైమ్ లోనే తనపై టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో కేసులు బనాయించి ఇబ్బందులు పెట్టిందన్నారు. అయినా సరే బెదరకుండా కేసీఆర్ ను ఎదిరించి నిలబడి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేశానని మల్ రెడ్డి రంగారెడ్డి తెలిపారు. ఈనేపథ్యంలో తనకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వరని ఆయన సీఎం రేవంత్ రెడ్డిని, అప్పటి ఇన్చార్జ్ దీపాదాస్ మున్షి కలిశారు,కొత్తగా వచ్చిన ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ను కూడా ఆయన కలిసి వినతిపత్రం అందజేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రంగారెడ్డి జిల్లాలో మంత్రివర్గ విస్తరణలో ప్రాతినిధ్యం లేదు. అదే విధంగా గ్రేటర్ హైదరాబాద్ తోపాటు రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ వీక్ గా ఉంది. బీఆర్ఎస్ బలంగా ఉంది . అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మెజార్టీ సీట్లు బిఆర్ఎస్ ఇక్కడే గెలిచింది, సో జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఈసారి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి దృఢ సంకల్పంతో ఉన్నారు. అందుకే మంత్రివర్గంలో చోటు కల్పించేటట్టు అయితే పార్టీ బలోపేతం చేయాలనే దిశగా కూడా ఆలోచనలో జరిగాయి. దీంతోపాటు సీనియర్ నేత జానారెడ్డి కూడా రంగారెడ్డి జిల్లాకు మంత్రివర్గ విస్తరణ లో చోటు కల్పించాలంటూ హై కమాండ్ కు ఒక లేఖ కూడా రాశారు.
సామాజిక సమీకరణాల నేపథ్యంలోనే ఈసారి మంత్రివర్గ విస్తరణలో మూడు మాత్రమే చేపట్టామని హైకమాండ్ చెప్తున్నప్పటికీ సీనియర్ నేత ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మాత్రం లేదు తనకు మంత్రివర్గంలో చోటు కల్పించాల్సిందే అంటూ తనను సంప్రదించిన కాంగ్రెస్ పెద్దలతో స్పష్టంగా చెప్తున్నారట. ఈ నేపథ్యంలో ఆయన రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన అనుచరుల దగ్గర చెప్పారంటూ ప్రచారం జరుగుతోంది. దీంతో ఇంచార్జి మీనాక్షి నటరాజ్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆయన ఇంటి దగ్గరికి వెళ్లి బుజ్జగించాలని చూస్తున్నారు. అయినా సరే ఆయన ఒప్పుకునే ప్రసక్తే లేదంటూ తన అనుచరుల దగ్గర చెప్పినట్టు తెలుస్తుంది. మరి హైకమాండ్ పెద్దలు మల్ రెడ్డిని ఏ విధంగా బుజ్జగిస్తారు అనేది వేచి చూడాలి.
మొత్తానికి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఎపిసోడ్ పీక్స్ కి చేరింది. ఆయన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారన్న ప్రచారం జోరందుకుంది. మరి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఇన్చార్జి మీనాక్షి నటరాజ్ ఆయనను ఏ విధంగా బుజ్జగిస్తారు అనేది ఆసక్తిగా మారింది. మరి మల్ రెడ్డి అధిష్టానం మాట ఒప్పుకుంటారా .. లేదంటే తన దారి తాను చూసుకుంటారా అనేది మాత్రం వేచి చూడాలి.