
Online Matrimonial Scam: పాకిస్థాన్ హీరోయిన్ తో పెళ్లి. వరుడిది హైదరాబాద్. మ్యాట్రిమోని గ్రూప్ లో పరిచయం. అందమైన భార్య వస్తోందని ఆ యువకుడు మురిసిపోయాడు. ఏడాదిగా చాటింగ్ చేసుకుంటూ దగ్గరయ్యాడు. మరికొద్ది రోజుల్లో వివాహం అనగా.. పెళ్లి కూతరు చెల్లి ఎంటరైంది. బావ డబ్బులు కావాలంటే.. లక్షల రూపాయలు పంపాడు. సీన్ కట్ చేస్తే పాకిస్థాన్ పెళ్లికూతురు ఫోన్ స్విచ్ఛ్ ఆఫ్.. చెల్లి అడ్రస్ కూడా గల్లంతు. యువకుడు పోలీసులను ఆశ్రయిస్తే అసలు విషయం బయట పడింది. అసలు ఏమైంది…? పాకిస్థాన్ హీరోయిన్ ఎందుకు మోసం చేసింది..? అసలు ఈ మొత్తం కథ వెనుక మోసం ఏంటి..?
మ్యాట్రిమోని సైట్లు, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లో పరిచయమైయ్యారు కదా అని నమ్మితే … నిండా ముంచేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. అందమైన అమ్మాయిల ఫోటోలు పెట్టి యువతను బురిడి కొట్టిస్తున్నారు. ఇలానే పెళ్లి పేరుతో పాకిస్థాన్ హీరోయిన్ ఫొటోలు పెట్టి హైదరాబాద్ లోని బహదూర్‌పురాకి చెందిన ఓ యువకుడిని సైబర్ నేరగాళ్లు మోసగించారు. బాధితుడి నుంచి లక్షలు కాజేశారు. రెండేళ్ల క్రితం మ్యాట్రిమోని గ్రూప్‌లో యువకుడిని యాడ్ చేశారు. ఫాతిమా పేరుతో పెళ్లి కుమార్తెగా, హనీసా పేరుతో ఆమె సోదరిగా పరిచయం చేసుకున్నారు. పాకిస్థాన్ హీరోయిన్ ఫొటోలను వాట్సప్ డీపీగా పెట్టి బాధితుడితో చాటింగ్ చేశారు. పాపం అందంగా ఉండటంతో యువకుడు నమ్మేశాడు. పగలు రాత్రి అనే తేడా లేకుండా చాటింగ్ చేశారు. బాగా నమ్మకం కుదిరాక.. అసలు నాటకం మొదలు పెట్టారు. నకిలీ డాక్యుమెంట్లు పంపి తల్లికి అనారోగ్యం, ఆర్థిక సమస్యలు ఉన్నాయని నమ్మించారు. దీంతో బాధితుడు కొంత మొత్తాన్ని ఇవ్వగా.. దాన్ని కొద్ది రోజులకు తిరిగి ఇచ్చేశారు. ఆ తర్వాత సైబర్ నేరగాళ్లు రెండో లెవల్ కు వెళ్లారు.. తల్లికి చికిత్స చేయించాలి, ఇంటి లోన్ కట్టాలంటూ 21 లక్షలు తీసుకున్నారు. ఆ తర్వాత అతడిని బ్లాక్ చేశారు. మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీన్ కట్ చేస్తే వారు డీపీ కింద వాడింది ఓ పాకిస్థానీ హీరోయిన్ ఫోటో. అసలు విషయం తెలియడంతో యువకుడు మోసపోయానని గ్రహించాడు. అయితే ఇలాంటి ఘటనలో భారత్ లో కొత్తేంకాదు. రోజుకో విధంగా.. పుటకో పేరుతో సైబర్ నేరగాళ్లు అమాయకులను టార్గెట్ చేస్తున్నారు. దీనికి తోడు ఈ మధ్య కాలంలో డిజిటల్ అరెస్టుల పేరుతోను మోసాలు పెంచారు సైబర్ నేరగాళ్లు. Online Matrimonial Scam.
గతంలో కూడా ఇలాంటి పెళ్లి మోసాలు, డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లు చాలా జరిగాయి. గత ఏడాది ముంబైలో 77 ఏళ్ల రిటైర్డ్ టీచర్‌ను సీబీఐ, ట్రాయ్ అధికారులమని చెప్పి 76 లక్షల రూపాయలు కాజేశారు. నేరగాళ్లు వ్యక్తిగతంగా కలిసి డబ్బు తీసుకున్నారు. అదే సంవత్సరం, పంచ్‌కులాలో రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ నుంచి డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసగించి 82 లక్షల రూపాయలు కొట్టేశారు. నేరగాళ్లు నకిలీ సీబీఐ అధికారులుగా నటించి, వీడియో కాల్స్‌తో భయపెట్టారు. అతడు నమ్మేశారు. అలాగే సూరత్‌లో 81 ఏళ్ల వృద్ధుడు 16 లక్షలు పోగొట్టుకున్నాడు, అతడు కూడా నకిలీ సుప్రీం కోర్ట్ వారెంట్‌లతో మోసపోయాడు. గుజరాత్‌లో 67 లక్షల డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లో ముగ్గురిని అరెస్ట్ చేశారు, వారు రిటైర్డ్ ఎయిర్ ఇండియా అధికారిని టార్గెట్ చేశారు. 2023లో దేశవ్యాప్తంగా 15 లక్షల సైబర్ మోసం కేసులు నమోదయ్యాయి, రూ.10 వేల కోట్లు సామాన్యులు నష్టపోయారు. ఉత్తర్ ప్రదేశ్, బిహార్, ఒడిశా, గుజరాత్ లాంటి ప్రాంతాలు సైబర్ నేరాలకు హబ్‌లుగా మారాయి. బాధితులను భయపెట్టడం, నమ్మించడం ద్వారా ఈ మోసాలు చేస్తున్నారు. అలాగే పెళ్లి, ఉద్యోగ, పెట్టుబడి హామీలతో ప్రజలను సులభంగా మోసం చేస్తున్నారు.
సైబర్ నేరాలను అడ్డుకోవడానికి సీబీఐ, కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోంది. సీబీఐ ఆపరేషన్ చక్ర-V అనే కార్యక్రమం ద్వారా జూన్‌లో 5 రాష్ట్రాల్లో 42 చోట్ల దాడులు చేసి, 9 మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేసింది. ఈ నేరగాళ్లు 8.5 లక్షల నకిలీ ఖాతాలతో రూ.117 కోట్ల మోసం చేశారు. ఎఫ్‌బీఐ, ఇంటర్‌పోల్‌తో కలిసి సీబీఐ ఈ నెట్‌వర్క్‌ను ఛేదించింది. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ద్వారా 2024లో 4.5 లక్షల మ్యూల్ ఖాతాలను ఫ్రీజ్ చేశారు. 2021లో లాంచ్ చేసిన ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ సిస్టమ్ ద్వారా 9.94 లక్షల ఫిర్యాదుల నుంచి రూ.3,431 కోట్లు రికవర్ చేశారు. నేషనల్ సైబర్ ఫోరెన్సిక్ లాబొరేటరీ, ఎవిడెన్స్ లాబ్ ద్వారా డిజిటల్ ఆధారాలను విశ్లేషిస్తున్నారు. సైట్రైన్ అనే ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లో 98,000 మంది పోలీసులకు శిక్షణ ఇచ్చారు. కేంద్రం సంచార్‌సాతి, సైబర్‌దోస్త్ లాంటి పోర్టల్‌ల ద్వారా అవగాహన కల్పిస్తోంది. ఈ చర్యల ద్వారా ప్రభుత్వం సైబర్ నేరాలను తగ్గించడానికి ప్రయత్నిస్తోంది.
సైబర్ మోసాల నుంచి తప్పించుకోవడానికి ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా సోషల్ మీడియాలో అపరిచితులతో చాటింగ్‌లో వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ వివరాలు షేర్ చేయడం మంచిది కాదు. మనకు అంతగా తెలియని వారు మనకు లాభం కలిగిలే చేస్తామంటే .. గుడ్డిగా నమ్మి మోసపోకూడదు. పెళ్లి, ఉద్యోగ, పెట్టుబడి హామీలు చాలా ఆకర్షణీయంగా ఉంటే అనుమానించండి. నకిలీ సీబీఐ, ఈడీ, పోలీసు అధికారులని చెప్పుకునే కాల్స్‌ను నమ్మొద్దు, ఎందుకంటే అసలు అధికారులు ఫోన్, వీడియో కాల్స్‌లో డబ్బు డిమాండ్ చేయరు. డిజిటల్ అరెస్ట్ అనే భావన చట్టంలో లేదు. అనుమానాస్పద లింక్‌లు, యాప్‌లు క్లిక్ చేయొద్దు, OTP షేర్ చేయొద్దు. ఫోన్ కాల్స్‌లో భయపెట్టినా, డబ్బు డిమాండ్ చేసినా వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలి. సంచార్‌సాతి పోర్టల్‌లో మీ పేరిట ఎన్ని సిమ్‌కార్డులు ఉన్నాయో చెక్ చేసుకోండి. సైబర్‌దోస్త్ సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను ఫాలో అయి అవగాహన పెంచుకోండి. ఏదైనా మోసం జరిగితే వెంటనే ఫిర్యాదు చేయడం వల్ల డబ్బు రికవరీ అవకాశం ఉంటుంది. అవగాహన, జాగ్రత్తలతో సైబర్ నేరాలను నిరోధించొచ్చు.