మందులా..ఏ క్యా హై..!

ఆ ఎమ్మెల్యే నియోజక వర్గంలో ఉన్నా లొల్లే!!.. రాష్ట్ర రాజధానికి వచ్చినా లొల్లేనా! గాలికి పోయే కంపను తనకు తగిలించుకొందే ఆయనకు నిద్ర పట్టదా? ఎప్పుడు ఏదో ఓ వివాదాన్ని నెత్తినేసుకొని తిరిగితే తప్ప ఆయనకు రాజకీయం చేసినట్లు ఉండదా?? కేర్ ఆఫ్ కాంట్రవర్సీ లిస్ట్ లో చేరుతున్న ఆ శాసన సభ్యుడు ఎవరు? ఆయన కదిపిన తాజా తుట్ట ఏంటి? వాచ్ థిస్ స్టోరీ.

ఓపెన్ గా ఉండాలి..బోళాగా మాట్లాడాలని అనుకుంటూ ఉంటారు కొందరు పొలిటీషియన్స్. ఆ తత్వం వాళ్ళని ఒక్కోసారి సమస్యల నుంచి బయట పడేస్తే ..ఇరుకున పెట్టే సందర్భాలే ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి సిచువేషన్స్ కి సరిగ్గా సరితూగే నేత తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్. రాజకీయాలు ఆయనకు కొత్త కాదు,ఆయన మీద పెద్ద పెద్ద అవినీతి ఆరోపణలు కూడా లేవు. కానీ ప్రతిసారి ఆయన నాలుక మాత్రం చిక్కుల్లోకి నెడుతూ ఉంటుంది. అందుకు నియోజక వర్గంలోని గ్రూపులు ఆజ్యం పోస్తూ ఉంటాయి. గాలికి పోయే కంపను తగిలించుకున్నట్టుగా ఆయన వ్యవహారం ఉంటుందని, అనవసర రచ్చ కొని తెచ్చుకుంటూ ఉంటారని చెప్పుకుంటారు సామేల్ ను దగ్గరగా గమనిస్తున్నవారు.

తుంగతుర్తి నియోజకవర్గం మీద కాంగ్రెస్ సీనియర్స్ దామోదర్ రెడ్డి, ఉత్తం కుమార్ రెడ్డి, కోమటరెడ్డి బ్రదర్స్ ఆధిపత్యం ఎక్కువ. అందుకే అందరినీ కలుపుకొనిపోవడం సాధ్యమయ్యే పని కాదన్నది అక్కడి నేతల అభిప్రాయం. ఇంత సంక్లిష్టమైన రాజకీయ వాతావరణం ఉన్నచోట బ్యాలెన్స్డ్ గా ఉండాల్సిందిపోయి ఎమ్మెల్యే మందుల సామెల్ తాజాగా మరో వివాదాన్ని నెత్తి మీదకి తెచ్చుకున్నారట. మాదిగలకు మంత్రి పదవి ఇవ్వాలంటూ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కోరారు ఆ సామాజిక వర్గం నేతలు. ఇక మీడియాలో మంత్రివర్గ విస్తరణపై మాట్లాడొద్దు మాకు మంత్రి పదవి ఇవ్వాలని అడగొద్దంటూ సిఎల్పి సమావేశంలో కూడా స్పష్టం చేశారు సీఎం. కానీ ఆ సామాజిక వర్గ నేతలంతా మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఆ తర్వాతే అసలు సమస్య మొదలైందట.

మాదిగలకు క్యాబినెట్ విస్తరణలో అవకాశం ఇవ్వాలని అంటూనే మంత్రి దామోదర రాజనరసింహ నికార్స్ అయిన మాదిగ కాదని తుట్టెను కదిపారు. అక్కడితో ఆగారా అంటే అది లేదు.ఓవైపు నికార్సైన మాదిగ కాదని మంత్రిని విమర్శిస్తూ మరోవైపు ఆయన సీనియర్ కాంగ్రెస్ నేత అంటూ పొగడ్తలు కురిపించారు. అనవసరంగా దామోదర రాజనరసింహ వ్యవహారాన్ని ప్రస్తావించి ఎమ్మెల్యే కొత్త సమస్యల్లో ఇరుక్కున్నారని అభిప్రాయం వ్యక్తమవుతుంది.

రాజ నరసింహతో పాటు కడియం శ్రీహరి ప్రస్తావన కూడా రావడం వివాదస్పదమవుతోంది. అనవసరమైన అంశాలను కోట్ చేస్తూ తుంగతూర్తి ఎమ్మెల్యే పార్టీని కొత్త సమస్యల్లోకి నెట్టారన్న ఫీలింగ్ ఉందట కాంగ్రెస్ వర్గాల్లో. సొంత పార్టీ నేతల మీద కామెంట్స్ చేయడం ..ఆ సామాజిక వర్గంపై ఇప్పటికే రచ్చ నడుస్తున్న క్రమంలో.. అగ్గి కి ఆజ్యం పోసినట్టు సామేలు మాట్లాడటం కొత్త తలనొప్పి తప్ప..ఈసమెత్తు ప్రయోజనం ఉందా అన్న చర్చ జరుగుతోందట.. గాంధీ భవన్లో కాంగ్రెస్ నాయకత్వం కూడా పార్టీ క్రమశిక్షణా కమిటీకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం లేదా..? లేదంటే పార్టీ పట్టించుకోవడం మానేసిందో కానీ.. నేతలనోటికి మాత్రం అడ్డు కట్టలేకుండా పోతుందని మాట్లాడేసుకుంటున్నాయట కాంగ్రెస్ వర్గాలు.

ఉన్నకాడ ఉండక పార్టీకి కొత్త తలనొప్పి తెచ్చిన ఎమ్మెల్యే సామెల్ తీరు పై అధిష్టానం గుర్రుగా ఉందట.. ఢిల్లీ లో ఓ వైపు మంత్రి వర్గ విస్తరణ పై తుది కసరత్తు జరుగుతుంటే సొంత ఇంట్లో రాజకున్న కుంపటి ఎటు దారి తీస్తుందో వేచి చూడాలి.