
మంత్రి కొండా సురేఖ.. ఫైర్ బ్రాండ్. ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతారు.. మనసులో ఏదీ దాచుకోరు.. కల్మషం లేని వ్యక్తి అని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ ఉంది. అయితే మాట తెచ్చిన తంటాలు కూడా ఆమె చుట్టే ముసురుకుంటున్న పరిస్థితి. ఏ ఉద్దేశంతో అన్నాగానీ.. మరో కాంటెక్ట్స్ లో వైరల్ అవుతుంటాయి. మాట అనడం, ఆ తర్వాత కవర్ చేసుకుంటున్నా.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. ఇప్పటికే చాలా ఇన్సిడెంట్లు కొండా సురేఖ చుట్టూ ముసురుకున్నాయి. లేటెస్ట్ గా ఫైళ్ల క్లియరెన్స్, మంత్రుల కమీషన్ల కామెంట్ల చుట్టూ పెద్ద రచ్చే నడుస్తోంది. తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఫైర్ అవుతున్నారు. ఇంతకీ కొండా సురేఖ ఏమన్నారు? బయట ఏం వైరల్ అయింది?
కొండా సురేఖ.. పొలిటికల్ ఫైర్ బ్రాండ్. లోపల ఒకటి.. బయట మరొకటి మాట్లాడే లీడర్ కాదు అన్న టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో ఉంది. అయితే తాజాగా ఆమె వరంగల్ లో చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. కాంగ్రెస్ పార్టీకే ఇబ్బందికర పరిస్థితి తీసుకొచ్చాయి. మంత్రి ఏ ఉద్దేశంతో అన్నారోగానీ.. ప్రత్యర్థులు ఊరికే ఉండరు కదా.. గట్టిగానే కౌంటర్లు ఇచ్చేశారు.
వరంగల్‌లోని కృష్ణ కాలనీ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఆవరణలో అరబిందో ఫార్మా ఫౌండేషన్ కొత్త బిల్డింగ్ నిర్మించేందుకు ముందుకు వచ్చింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ కింద 4.5 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమైంది. దీంతో భవన నిర్మాణానికి మంత్రి కొండా సురేఖ మే 15న శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో క్లియరెన్స్ కోసం మంత్రుల వద్దకు కొన్ని ఫైల్స్ వస్తుంటాయని, కొందరు డబ్బులు తీసుకుని క్లియర్ చేస్తారని, తాము మాత్రం నయాపైసా అవసరం లేదని కాలేజ్ ను అభివృద్ధి చేయాలని కోరామన్నారు.
మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌పై బీఆర్ఎస్, బీజేపీ నేతలు రెస్పాండ్ అయ్యారు. ఏయే మంత్రులు ఎంతెంత కమీషన్ తీసుకున్నారో కూడా చెప్పాలని కిషన్ రెడ్డి అంటే.. కొన్ని నిజాలు మాట్లాడినందుకు మంత్రి కొండా సురేఖకు చాలా అభినందనలు అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్.. కమీషన్ సర్కార్ నడుపుతోందన్నారు. కాంట్రాక్టర్లు సచివాలయం లోపల ధర్నా చేసి, ప్రభుత్వ కమీషన్ వ్యాపారాన్ని బయటపెట్టారని ఆరోపించారు.
సో సోషల్ మీడియాలో ఇటు ప్రత్యర్థి పార్టీలకు ఈ టాపిక్ అస్త్రంగా మారింది. సొంత ప్రభుత్వంలోని మంత్రులపైనే సురేఖ ఈ కామెంట్స్ చేశారన్న ప్రచారం జరిగింది. అయితే నిజానికి కొండా సురేఖ కామెంట్స్ లో ఎక్కడా సొంత ప్రభుత్వం గురించి మాట్లాడలేదు. అయినా సరే ఆపాదిస్తూ వైరల్ చేశారు. దీంతో కొండా సురేఖ వివరణ ఇచ్చారు. తన కామెంట్స్ ను వక్రీకరించారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసిన మంత్రులను ఉద్దేశించి తాను ఆ కామెంట్స్ చేశానన్నారు. ఏ పనికైనా అప్పటి మంత్రులు డబ్బులు తీసుకునేవారని అన్నానని చెప్పుకొచ్చారు. క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేస్తానని చెప్పారు.
అయితే వివరణ ఇచ్చుకున్నప్పటికీ పార్టీకి, ప్రభుత్వానికి జరగాల్సిన నష్టం జరిగిపోయిందన్న టాక్ వినిపిస్తోంది. ఈ ఇన్సిడెంటే కాదు.. అంతకు ముందు కొండా సురేఖ పేషీలో జరిగిన మీడియా సమావేశం సందర్భంగా తమ బంధువుకు ఉద్యోగం విషయంలో మంత్రి శ్రీధర్ బాబుతో మాట్లాడిన మాటలు రికార్డ్ అయ్యాయి. అది ఏ ఉద్యోగం, విషయం ఏంటన్నది పక్కన పెడితే ఈజీగా సోషల్ మీడియాకు టార్గెట్ అయ్యారు. కామెంట్స్ వైరల్ అయ్యాయి. అటు హీరో నాగార్జున ఫ్యామిలీపై చేసిన కామెంట్స్ తో పరువు నష్టం కేసును ఎదుర్కొంటున్నారామె.
తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకున్నా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇదే కాదు.. మంత్రి కొండా సురేఖ కుటుంబ వక్తిగత వ్యవహారాల్లో మాట్లాడిన ఫోన్ ఆడియో రికార్డులు కూడా రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపాయి. తన మనవడి బర్త్ డే సందర్భంగా చేసిన కామెంట్లు కూడా వైరల్ అయ్యాయి. సో ఇలాంటివి రెగ్యులర్ గా జరుగుతుండడం, సోషల్ మీడియాలో, అటు ప్రత్యర్థులకు టార్గెట్ అవుతుండడంతో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుంటే బెటరేమో అన్న సూచనలు పెరుగుతున్నాయి.