ఖమ్మం జిల్లా అధికార పార్టీలో ప్రోటోకాల్ రగడ!

ఖమ్మం జిల్లా అధికార పార్టీలో ప్రోటోకాల్ రగడ ఉవ్వెత్తున కొనసాగుతుందట..ఎమ్మెల్యేలకే తెలియకుండా మంత్రులు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తుండటం వివాదాలకు దారి తీస్తుందట..మంత్రుల మధ్య సమన్వయం కొరవడడంతో అధికారులు కూడా ఇబ్బందులు పడాల్సి పరిస్థితి నెలకొన్నదట. ఓకే రోజు ఇద్దరు ముగ్గురు మంత్రుల పర్యటనలతో అధికారులు ఎవరి కార్యక్రమానికి హాజరు కావాలో అర్థం కాని స్థితిలో కొట్టు మిట్టాడుతున్నారట..ఒక మంత్రి ప్రోగ్రాం కు వెళితే మరొక మంత్రి నొచ్చుకోవడం దాన్ని మనసులో పెట్టుకుని ఎదో ఒక రూపంలో అధికారులపై కోపతాపాలను చూపిస్తుండటం పరిపాటిగా మారిందట..ఇంతకీ అది ఏ జిల్లా? ఏంటా ప్రోటోకాల్ గొడవ అనుకుంటున్నారా లెట్స్ వాచ్ దిస్ ఆఫ్ ది రికార్డ్.

ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముగ్గురు ఖమ్మం జిల్లా నుండే రాష్ట్ర క్యాబినెట్ లో కొనసాగుతున్నారు. అయితే ముగ్గురు మంత్రులులో నిత్యం ఎవరో ఒకరు లేదంటే ఇద్దరు మంత్రులు ఒక్కో సారి ముగ్గురు అప్పుడప్పుడు QAE జిల్లా ఇంచార్జ్ మంత్రులు పర్యటనలు ఉండటం సర్వ సాధారణంగా మారింది. ఇద్దరు లేదా ముగ్గురు పర్యటించిన సమయంలో కలెక్టర్ పలు శాఖల అధికారులు వారితో వెళ్లాల్సి వస్తుండటం తలనొప్పిగా మారిందట..అధికారులు మంత్రుల పర్యటనలలో ఉండటంతో..

ఆయా శాఖలకు సంబంధించిన పనుల పర్యవేక్షణ కొరవడుతుందనే చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగా జిల్లాలో ఇద్దరు మంత్రులు పర్యటనలు ఉన్నప్పుడు అధికారులు ఏ మంత్రి వస్తే ఎటువంటి కార్యక్రమాలు చేయాలో తెలియక సతమతం అవుతున్నారట. పలుచోట్ల స్థానిక ఎమ్మెల్యే లకే తెలియకుండా ప్రభుత్వ కార్యక్రమాలు జరపడంతో అధికార పార్టీలో ప్రోటోకాల్ వివాదం తలెత్తిన ఘటనలు చోటు చేసుకున్నాయి.

తాజాగా అశ్వరావుపేటలో ఒకరోజు మంత్రి పొంగులేటి స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో కలిసి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలులో పాల్గొన్నారు. ఆ మరుసటి రోజే ఎమ్మెల్యే జారే ఆదినారాయణ కు తెలియకుండా మంత్రి తుమ్మల పర్యటించడం వివాదానికి దారి తీసింది..తన నియోజకవర్గంలో తన ప్రమేయం లేకుండా అధికారిక కార్యక్రమాలు ఎలా ఏర్పాటు చేస్తారని మంత్రి తుమ్మల ఎదుటే ఎమ్మెల్యే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై మంత్రి తుమ్మల సైతం అధికారుల తీరును ప్రశ్నించారు. ఎమ్మెల్యే జారే కు సర్ది చెప్పిన తుమ్మల మరోసారి ఇలాంటి ఇష్యుస్ రాకుండా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

మరోవైపు జిల్లాలో పలువురు ఎమ్మెల్యే లు ఆయా మంత్రులకు వర్గీయులు గా ఉన్నారు. ఒక మంత్రి వర్గానికి చెందిన ఎమ్మెల్యే ఇలాఖాకు మరో మంత్రి వెళితే అసహనం వ్యక్తం చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు మంత్రుల అనుచరులుగా కొందరు నాయకులు చేస్తున్న అత్యుత్సాహంతో అధికారులకు ఇక్కట్లు తప్పడంలేదట. జిల్లా అభివృద్ధి కోసం పాటుపడుతున్న మంత్రులకు ప్రోటోకాల్ గొడవలు ఇబ్బందిగా మారుతున్నాయట. జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గాల లొల్లితో ప్రోటోకాల్ వివాధాలు తలెత్తుతుండటంతో అధిష్టానం దృష్టి సారించిందనే ప్రచారం జోరుగా సాగుతోంది..ఇప్పటికే జిల్లా అధికార పార్టీలో నెలకొన్న విభేధాలపై దృష్టిపెట్టిన అధిష్టానం చర్యలు తప్పవని తెలిపినా పాత కొత్త కాంగ్రెస్ నాయకుల మధ్య ఇష్యుస్ మాత్రం రోజు రోజుకు పెరగుతున్నాయే తప్ప తగ్గటం లేదనే టాక్ నడుస్తోంది.

జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు కలిసి పని చేస్తున్నా కింది స్థాయి జిల్లా నాయకుల హడావుడితో క్యాడర్ కు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయట..ఇక ఎటువంటి పదవులు లేని కొందరు నేతలు మంత్రుల పక్కన ఉంటూ చేసే హడావుడి అధికారులను సైతం విస్మయానికి గురిచేస్తున్నాయట.. కొందరు నేతలు ఇతర పార్టీ నుండి వచ్చిన మంత్రుల పర్యటనలో ఉంటూ పాత కాంగ్రెస్ సీనియర్ నేతలను సైతం పక్కకు పెట్టేస్తున్నారని కొందరు సీనియర్ నేతలు వాపోతున్నారు. మరి ఖమ్మం జిల్లాలో నెలకొన్న ప్రోటోకాల్ లొల్లిపై అమాత్యులు ఎలాంటి ఆలోచన చేస్తారో వేచి చూడాల్సినదే మరి.