ఆ పెద్దాయనకు కోపమొచ్చిందా ..?

రెండో విడత మంత్రివర్గ విస్తరణలో తనకు చోటు దక్కుతుందన్న నమ్మకంతో ఎదురు చూసిన ఆ పెద్దాయనకు కాంగ్రెస్ అధిష్టానం మొండి చెయ్యే చూపించిందా? రెండో విడత కూడా నిరాశే ఎదురవడంతో ఆ మాజీ మంత్రికి కోపమొచ్చిందా? స్వతహాగా సహనంతో, ఓపికతో వ్యవహరించే ఆ నాయకుడు దశాబ్దాలుగా తాను నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీ తన పట్ల అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా రాజీనామాస్త్రాన్ని సంధించేందుకు సిద్ధమయ్యారా? మూడో విడతలో అవకాశం ఇస్తామని అధిష్టానం ఇస్తున్న హామీకి ఆయన ఓకే అంటారా? ఇంతకీ ఎవరా పెద్దాయన…ఆయన నెక్ట్స్ ప్లాన్ ఏంటి లెట్స్ వాచ్ దిస్ ఆఫ్ ది రికార్డ్.

రాష్ట్రంలో ఉన్న సీనియర్ ఎమ్మెల్యేల్లో సుదర్శన్ రెడ్డి ఒకరు. పైగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు సైతం పీసీసీ కోశాధికారిగా వ్యవహరించారు. తీరా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఆయన ఎమ్మెల్యేగా గెలిచినా.. మంత్రి పదవి అందని ద్రాక్షగానే మారింది. రెండో విడత మంత్రివర్గ విస్తరణలో కూడా ఆయన పేరు లేకపోవడం సర్వత్రా చర్చకు దారితీసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ నుంచి సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ సీనియర్ నాయకులుగా ఉన్నారు. అయితే షబ్బీర్ ఓడిపోయారు. దీంతో బోధన్ ఎమ్మెల్యేగా గెలిచిన సుదర్శన్ రెడ్డికి మొదటి విడతలోనే మంత్రి పదవి వస్తుందని అంతా అనుకున్నారు. గతంలో వైఎస్, రోశయ్య హయంలో కీలక శాఖలకు మంత్రిగా పనిచేసిన అనుభవం సుదర్శన్ రెడ్డికి ఉంది. జిల్లాలో సీనియర్ నాయకుడు కావడంతో పదవి వస్తుందని అంతా భావించారు. అయితే అప్పుడు ఆయనకు పదవి రాలేదు. దీంతో రెండో విడతలో మంత్రి పదవి ఖాయం అనే వార్తలు వచ్చాయి. ఆయనే స్వయంగా తన అనుచరగణంకు ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. ఒక దశలో ‘హోంమంత్రి పదవి” అని కూడా లీకులిచ్చారు. చివరకు ఆయనకు మంత్రి పదవి ఊరించి ఉసూరుమనిపించింది.

ప్రస్తుత మంత్రివర్గంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ప్రాతినిధ్యం లేదు. ఉమ్మడి జిల్లా నుంచి గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో సుదర్శన్ రెడ్డి సీనియర్ కావడంతో ఆయనకు రెండో విడతలో మంత్రి పదవి వస్తుందని వార్తలు వచ్చాయి. వీలుకాని పక్షంలో.. షబ్బీర్ అలీ లేక మదన్ మోహన్ రావు, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావులకు పదవి రావొచ్చని అంతా భావించారు. సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆఖరకు ఉమ్మడి జిల్లాకు నిరాశే మిగిలింది. కాగా.. మంత్రి పదవి చివరి ఆశగా ఉన్న సుదర్శన్ రెడ్డి.. తాజా పరిణామాలను ఏ విధంగా చూస్తారు..? ఎలా తీసుకుంటారు..? తన అనుచరగణంకు ఏమని సమాధానం ఇస్తారు..? అనే చర్చ జరుగుతోంది..

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి కాంగ్రెస్ కు పెద్దదిక్కుగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఉన్నారు. కానీ ప్రొటోకాల్ పరంగా రాష్ట్ర మంత్రి వర్గంలో జిల్లా నుంచి ప్రాతినిధ్యం లేకపోవడంతో కిందిస్థాయి నేతలు, నాయకులు గందరగోళంలో ఉన్నారు. ప్రత్యేకించి పలు నియోజకవర్గాల ఇన్ ఛార్జీలు ఎవరికి వారే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. పార్టీలో అంతర్గతంగా ఏవైనా విభేదాలు వచ్చినా, ఇతర ఇబ్బందుల తలెత్తినా చెప్పుకునేందుకు ఎవరూ లేకపోయారు. మంత్రి పదవి లేకపోవడం జిల్లా అభివృద్ధిపై ప్రభావం చూపిస్తుందంటాయి అక్కడి కాంగ్రెస్ వర్గం. అధికారులు సైతం ప్రభుత్వం వద్ద నివేదించాలనుకునే పనుల విషయంలో ఎవరికి చెప్పాలో తెలియక ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారట.

రెండో విడత మంత్రివర్గ విస్తరణలో కూడా చోటు దక్కకపోవడంతో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. సామాజిక కూర్పు నేపథ్యంలో ముగ్గురికి మాత్రమే అవకాశం ఇవ్వగా అందులో తన పేరు లేకపోవడంతో ఆయన కినుక వహించారు. ఉమ్మడి జిల్లా నుంచి గత 18 నెలలుగా మంత్రి పదవిపై సుదర్శన్ రెడ్డి ఆశ పెట్టుకున్నారు. కాగా, రెడ్డి సామాజిక వర్గానికి ఇదివరకే నలుగురికి మంత్రి పదవులు ఉండడంతో సామాజిక సమీకరణాల కారణంగా ఇతర నేతల ఒత్తిడితో మంత్రి పదవి మిస్ అవుతోంది. రెండో విడత మంత్రివర్గ జాబితాలో తన పేరు రాకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని అనుచరులతో అన్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధినాయకత్వం సుదర్శన్ రెడ్డితో మాట్లాడేందుకు ప్రయత్నించారు. కానీ ఆయన అందుబాటులోకి రాలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ తో పాటు పీసీసీ చీఫ్ మంత్రి పొన్నం ప్రభాకర్లు గౌడ్ లు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఇంటికి వెళ్లి బుజ్జగించేందుకు ప్రయత్నించారు.. సామజిక వర్గాల సమీకరణలు తర్వాత మూడో విడతలో అవకాశం ఇస్తారని హామీ ఇచ్చినట్టు సమాచారం..