రేషన్‌ కార్డుదారులకు బిగ్ అలర్ట్….!!

రేషన్ కార్డుదారులకు తెలంగాణ ప్రభుత్వం బిగ్ జలక్ ఇవ్వనుంది. గత 6 నెలలుగా రేషన్ కార్డుపై సరుకులు తీసుకోని వారి కార్డులను రద్దు చేయాలని యోచిస్తోంది. కేంద్ర సర్కార్ నుంచి వచ్చిన ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 6 నెలల కంటే ఎక్కువ కాలం రేషన్ తీసుకోని కార్డుదారులు రాష్ట్రంలో లక్షా 59వేల మంది ఉన్నట్టు అధికారులు గుర్తించారు.ఈ క్రమంలో కార్డులపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి ఓ నివేదిక ఇవ్వాలని సివిల్ సప్లయ్ శాఖ అధికారులకు సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రేషన్ కార్డులను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 80 శాతానికిపైగా కార్డుల పరిశీలన పూరైనట్లు సమాచారం. వాటిలో 30 శాతం అనర్హులే అని తేలినట్టు తెలుస్తోంది.

నిత్యావసరాలు, ముఖ్యంగా బియ్యం, పప్పులు, చక్కెర, నూనె వంటి సరుకులను రేషన్ కార్డుల ద్వారా ప్రతి నెల సామాస్య ప్రజలు పొందుతున్నారు. రేషన్ వ్యవస్థ దేశంలోని పేద ప్రజలకు ఓ జీవనాధారంగా ఉంటోంది. అయితే కొంతమంది అధికారికంగా పేదరిక రేఖకు దిగువన లేనప్పటికీ రేషన్ కార్డులు పొందినట్లు తెలుస్తోంది. దీనివల్ల అసలైన అర్హులకు నష్టం జరుగుతోంది.రేషన్ కార్డుల దుర్వినియోగం అవుతున్నాయి. ఈ విషయం కేంద్ర ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అనర్హులైనవారిపై చర్యలు తీసుకోవాలన్న కేంద్రం సూచనల మేరకు తెలంగాణ ప్రభుత్వం క్షేత్రస్థాయిలో విచారణ మొదలుపెట్టింది. ముఖ్యంగా గత ఆరు నెలల నుంచి రేషన్ సరుకులు తీసుకోని కార్డుదారులను లక్ష్యంగా చేసుకుని వారి కార్డులను రద్దు చేయాలన్న సంకల్పంతో అధికారులు ముందుకు వెళ్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పంపిన జాబితాలో రేషన్ తీసుకోకుండా ఉన్న కార్డులతో పాటు, ఆధార్ వివరాల్లో లోపాలున్న కార్డులను కూడా చేర్చింది. అయితే, ఇప్పటి క్షేత్ర స్థాయి పరిశీలనలో 30 శాతం కార్డులు అర్హత లేవని గుర్తించారు సివిల్ సప్లై అధికారులు. 6 నుంచి 12 నెలలుగా రేషన్ తీసుకోని కార్డుల్లో అనర్హులున్నట్లు గుర్తించారు. కొందరు లబ్ధిదారులు ఇతర రాష్ట్రాల్లో రేషన్ కార్డులు కలిగి ఉండటం, మరికొంతమంది కార్డు హోల్డర్లు చనిపోవడం, డూప్లికేట్ ఆధార్ కార్డుల ద్వారా రేషన్ కార్డులు పొందడం, 18 ఏళ్లు నిండని వ్యక్తుల పేరిట కార్డులు జారీ కావడం, ఆధార్ కార్డులో ఉన్న పేర్లు, రేషన్ కార్డులో మరొకరి పేరిట ఉండటం వంటి లోపాలు ఈ పరిశీలనలో బయటపడ్డాయి.ఈ విచారణ పూర్తైన అనంతరం అనర్హుల రేషన్ కార్డులు రద్దయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

కేవలం రేషన్‌ కార్డులే కాదు.. రేషన్ కార్డుల ఆధారంగా ప్రభుత్వ పథకాలు, స్కాలర్షిప్‌లు, ఆరోగ్య భీమా పథకాలు వంటి ఎన్నో ప్రయోజనాలను పొందే వీలుండటంతో కొంతమంది అర్హత లేకపోయినా అడ్డదారుల్లో వీటిని పొందినట్లు సమాచారం. మొత్తం కార్డుదారులలో చాలామంది ఆరు నెలలకు పైగా రేషన్ తీసుకోకపోగా మరికొంతమంది నకిలీ ధృవీకరణ పత్రాలను సమర్పించి రేషన్ కార్డులు పొందిన వారు ఉన్నారని ఇన్ఫర్మేషన్. అందుకే క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నకిలీ రేషన్ కార్డులను రద్దు చేయాలని సర్కార్ నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని సామాన్యులు కూడా స్వాగతిస్తున్నారు. అర్హత ఉన్నవారికి మాత్రమే లబ్ధి జరగాలని , నకిలీ సర్టిఫికేట్లతో రేషన్ కార్డులు పొందినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇదిలా ఉంటే ఇక రానున్నది వర్షాకాలం. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఒకేసారి 3 నెలల రేషన్ సరుకులు పంపిణీ చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. దీంతో రేషన్ షాపుల ముందు భారీ క్యూ ఉంటోంది. 3 నెలల సరుకులు ఒకేసారి తీసుకునే ప్రక్రియలో 3 సార్లు బయోమెట్రిక్ తీసుకోవాల్సి రావడం, ఈ-పాస్ సాఫ్ట్‌వేర్‌లో టెక్నికల్ ఇష్యూస్ ఎదురవుతుండటంతో లబ్దిదారులు షాపుల వద్ద గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. ఇక మరోవైపు కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే మీసేవా కేంద్రాల ద్వారా అప్లై చేసుకున్న లబ్ధిదారులకు 2 లక్షల కార్డులు మంజూరయ్యాయి.