
పట్టమంటే కప్పకు కోపం విడమంటే పాముకు కోపం అన్న చందంగా ఉంది కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ తీరు. ఎన్నోరోజులుగా కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అంతర్గత విబేధాలు ఇంకా కొలిక్కి రాని పరిస్థితి దాపురించింది. ఇటీవల అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జీ నేతను పార్టీ నుండి బహిష్కరించినప్పటికి నాయకుల్లో మార్పు రావడం లేదు. దీంతో పార్టీ కార్యకర్తలకు ఏం చేయాలో అర్థంకాని పరిస్తితి ఏర్పడింది.
కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పరిస్తితి ఘోరంగా మారింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్నామన్న సంగతి మర్చిపోతున్నారు ఆ పార్టీ నేతలు. జిల్లా నేతలతో పాటు నామినేటెడ్ పదవులు పొందిన వారు సైతం ఒంటెద్దు పోకడలు పోతున్నారు. దీంతో పార్టీలో సమన్వయం లోపించిందన్న ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాదు, కార్యవర్గాన్ని కొత్తగా ఏర్పాటు చేద్దామన్నా, జిల్లాలోని ఎంఎల్ఏలు, మంత్రులు కూడా ముందుకు రావడం లేదు. దీంతో కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పరిస్తితి గందరగోళంగా మారింది. నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం లేకుండా పోవడంతో చాలా మంది పార్టీ వీడే పరిస్తితి ఏర్పడింది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నామినేటెడ్ పదవుల పంపిణీ గొడవకు కారణమైంది. మొదటి నుంచీ పార్టీ జెండా మోసిన వారికి కాకుండా నేతల అనుచరులకు నామినేటెడ్ పదవులు ఇవ్వడంతో పార్టీలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. మంత్రి పొన్నం ప్రభాకర్ తో సహా జిల్లా ఎంఎల్ఏలు, స్థానిక నేతలు జిల్లాలో పార్టీ పరిస్తితిని గాలికి వదిలేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో పార్టీనే నమ్ముకున్న కార్యకర్తలు డైలమాలో పడ్డారు. కొందరు నేతల మీద అసహనం వ్యక్తం చేస్తుంటే, మరికొందరు పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మానకొండూరు ఎంఎల్ఏ కవ్వంపల్లి సత్యనారాయణ మీద పార్టీలో తీవ్ర అసహనం నెలకొంది. ఎంఎల్ఏగా ఉంటూ జిల్లా అధ్యక్ష పదవిలో ఉండటంపై స్థానిక నేతలు మండిపడుతున్నారు. ఇక జగిత్యాల జిల్లాలో కూడా ఇదే పరిస్తితి కొనసాగుతోంది. ధర్మపురి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సైతం డీసీసీ అధ్యక్ష పదవిలో ఉండటంపై కూడా కార్యకర్తల నుంచి నిరసన వ్యక్తం అవుతోంది. ఈ ఇద్దరూ పార్టీ బలోపేతం కోసం పనిచేయడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఓవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పార్టీ కీలక పదవులు ఇంకా భర్తీ కాలేదు. దీంతో జిల్లా నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పదవులపై ఆశ వదులుకున్న వారు బీఆర్ఎస్, బీజేపీల వైపు చూస్తున్నారు. ఇదే జరిగితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.