రాజా సింగ్ దారెటు.?

Goshamahal MLA Raja Singh: బీజేపీ అంటేనే క్రమశిక్షణకు మారుపేరు. కాషాయ పార్టీలో కొనసాగే నేతలు.. పార్టీ సిద్దంతాలకు కట్టుబడి పనిచేస్తుంటారు. కానీ కొన్నేళ్లుగా రాజా సింగ్ పార్టీ కట్టుతప్పి ప్రవర్తిస్తున్నారు. తెలంగాణ బీజేపీలో హిందూత్వకు మారుపేరుగా మారిన ఈయన ఈ మధ్య తరుచుగా తెలంగాణ బీజేపీ పెద్దలపై సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. బహిరంగ వేదికలపై ఆడిపోసుకున్న సందర్భాలున్నాయి. అంతేకాదు పార్టీలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న తనకు కీలకమైన శాసనసభా పక్ష నేత పదవి కూడా ఇవ్వకపోవడంపై ఆయన పార్టీ అధిష్ఠానంపై బహిరంగ విమర్శలున్నాయి.

అయితే రాజా సింగ్ కు హిందూత్వకు బ్రాండ్ అంబాసిడర్ అయినా.. కొన్ని రాజ్యాంగ పరమైన కొన్ని విషయాల్లో అవగాహన తక్కువే. మరోవైపు తెలుగును స్పష్టంగా మాట్లాడలేకపోవడం ఆయనకు మైనస్ గా మారింది. ఆయన కేవలం హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని పాతబస్తీ గోషామహల్ కు మాత్రమే ఆయన రాజకీయాలు పరిమితం కావడం అంటి అంశాలున్నాయి. మరోవైపు ఆయనకు ఉత్తర తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటకలో ఆయనకంటూ కొంత మంది అభిమానులున్నారు.

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామంగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేసిన విషయం సంచలనం రేపింది. పార్టీ అధ్యక్ష పదవి కోసం నామినేషన్ వేసేందుకు అవకాశం ఇవ్వకపోవడంతో అసంతృప్తి చెందిన రాజాసింగ్, పార్టీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ రాజీనామా లేఖను రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి అందజేశారు. ఈ నిర్ణయం తెలంగాణ బీజేపీలో అంతర్గత కల్లోలాన్ని సృష్టించింది, మరియు రాజాసింగ్ వ్యాఖ్యలు పార్టీ అధిష్టానాన్ని ఆగ్రహానికి గురిచేశాయి. Goshamahal MLA Raja Singh.

బీజేపీ అధిష్టానం రాజాసింగ్‌పై క్రమశిక్షణ చర్యలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. రాజాసింగ్ రాజీనామాతో పాటు, అతని వ్యాఖ్యలను క్రమశిక్షణారాహిత్యంగా భావించిన పార్టీ, అతనిపై అనర్హత వేటు విధించాలని శాసనసభ స్పీకర్‌కు లేఖ రాసేందుకు సన్నాహాలు చేస్తోంది. షెడ్యూల్ 10, సెక్షన్ 2A ప్రకారం, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఎమ్మెల్యే ఆటోమేటిక్‌గా అనర్హత వేటుకు గురయ్యే అవకాశం ఉంది. ఒకవేళ రాజాసింగ్‌పై అనర్హత వేటు పడితే, గోషామహల్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

ఈ రాజీనామా వ్యవహారం గోషామహల్ నియోజకవర్గంలో రాజకీయ చర్చలను రేకెత్తిస్తోంది. రాజాసింగ్, హిందుత్వ ఎజెండాతో బలమైన పట్టు కలిగిన నాయకుడిగా, ఈ నియోజకవర్గంలో వరుసగా విజయాలు సాధిస్తూ వచ్చారు. అయితే, అతని రాజీనామాతో బీజేపీకి ఈ నియోజకవర్గంలో బలమైన అభ్యర్థిని నిలబెట్టడం ఒక సవాలుగా మారనుంది.

2018 అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ నుండి గెలిచి అసెంబ్లీలో ఆ పార్టీ ప్రతినిధిగా ఒకే ఒక్కడుగా ఉన్న రాజాసింగ్ రాజకీయ ప్రస్థానం టీడీపీతో మొదలైంది. మంగళ్ హాట్ కార్పొరేటర్‌గా గెలిచిన రాజాసింగ్ అనంతరం బీజేపీలో చేరి మూడు సార్లు గోషామహల్ సెగ్మెంట్ నుండి విజయం సాధించారు. అయితే హిందూ భావజాలంతో నరనరాన జీర్ణించుకున్న ఆయన ఓ వర్గాన్ని టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేయడం, వీడియోలు రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టులు చేయడం ఇప్పటికీ కొనసాగిస్తున్నారు.

ఇదే ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పెంచగా అదే ఆయనకు మైనస్‌గా కూడా మారింది. 2022 ఆగస్టులో హాస్య నటుడు మునావర్ ఫారూఖీ హైదరాబాద్ నగరంలో నిర్వహించిన షో సందర్భంగా ఓ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి జాతీయ స్థాయిలో చర్చలకు కారణమై బీజేపీ నుండి బహిష్కరణకు గురయ్యారు. అయితే సస్పెండ్ అయిన రాజాసింగ్‌పై 2023 అసెంబ్లీ టిక్కెట్లు ప్రకటించేంత వరకు నిషేదం ఎత్తి వేయలేదు. దీంతో ఆయన అప్పట్లోనే పార్టీ మారతారనే ప్రచారం జరిగినప్పటికీ చివరి నిమిషంలో బీజేపీ ఆయనకు టికెట్ ఇవ్వడం, మూడోసారి ఆయన విజయం సాధించడం జరిగిపోయాయి. తాజాగా ఆయన పార్టీ అసంతృప్తితో రాజీనామా చేయడంతో జనసేనలో చేరుతారనే వార్తలు విస్తృతం అయ్యాయి. దీనిపై ఆయన స్పందించి క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

ఒకవేళ బీజేపీ కేంద్ర నాయకత్వం సమ్మతిస్తే జూలై నెలాఖరులోపే రాజాసింగ్‌ వ్యవహారం తేలిపోతుందని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. పార్టీతోపాటు అసెంబ్లీ స్పీకర్‌ కూడా ఆయన రాజీనామాను ఆమోదిస్తే గోషామహల్‌లో ఉప ఎన్నిక తప్పదని తెలుస్తున్నది. జూబ్లీహిల్స్‌తోపాటే గోషామహల్‌కు కూడా ఉప ఎన్నిక జరిగే అవకాశాలు ఉంటాయి. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలకు అక్టోబర్‌లో షెడ్యూల్‌ విడుదల కానుంది. అప్పుడే రాష్ట్రంలోని ఈ రెండు నియోజకవర్గాలకు కూడా ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉంది.

మొత్తంగా రాజా సింగ్ ఆవేశంతో దూకుడిగా నిర్ణయాలు తీసుకుంటారనేది ఆయనను దగ్గర నుంచి గమనిస్తున్న వారు చెబుతున్న అంశం. హిందూత్వ వాదిగా ఆయనలో ప్లస్ పాయింట్స్ ఉన్నా.. ఓ జాతీయ రాజకీయ పార్టీని లీడ్ చేయడానికి ఆయన ఇంకా సమయం ఉంది.

మొత్తంమీద రాజాసింగ్ పేరును హైకమాండ్ కూడా పరిగణన తీసుకోవడం లేదు. ఇప్పుడు బీజేపీకి రాజీనామా చేసినట్లుగా ఆయన ప్రకటించారు కానీ.. రేపోమాపో మళ్లీ ఆయన తాను బీజేపీలోనే ఉంటానని ప్రకటించుకుంటారు. అందుకే తెలంగాణ బీజేపీ నేతలెవరూ పట్టించుకోవడం లేదనే టాక్‌ వినిపిస్తోంది.. చూడాలి మరి రాజాసింగ్ విషయంలో పార్టీ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో..!

Also Read: https://www.mega9tv.com/telangana/the-telangana-government-is-giving-pensions-to-the-dead-souls-instead-of-deserving-elders/