ఖమ్మం కార్పొరేషన్‎లో ఏం జరుగుతుంది..?

ఖమ్మం కార్పోరేషన్‌లో ఏం జరుగుతుంది? అధికారులకు, రాజకీయ నాయకులకు పొసగడం లేదా ? ఎవరికివారు ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్నారా? వీరి మధ్య చిచ్చు రాజేసి చూస్తూ ఆనందపడే వర్గం ఒకటి తయారైందా? అంటే అవుననే సమాధానం వస్తుంది. జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే పైకి ఏం లేదని చెబుతున్నా కార్పోరేషన్‌ కమిషనర్‌ వర్సెస్‌ మేయర్‌ మధ్య తీవ్ర అగాధం ఏర్పడినట్లు తెలుస్తుంది. కార్పోరేషన్‌లో తన మాట చెల్లుబాటు కావడంలేదని ఆమె సన్నిహితుల వద్ద చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారాయి.ఈ వ్యవహారం చినికిచినికి గాలివానగా మారుతుందా?లేదా టీ కప్పులో తుఫానులా సమసిపోతుందా ? లెట్స్ వాచ్ దిస్ ఇన్ ఆఫ్ ది రికార్డ్

ఖమ్మం నగరపాలక సంస్ధ కార్యాలయం పాలన విధానంలో మేయర్‌ వర్సెస్‌ కమిషనర్‌ మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. గత కొంతకాలంగా కార్పోరేషన్‌ కార్యాలయంలో ఉద్యోగులను సెక్షన్లు మారుస్తూ కమిషనర్‌ నిర్ణయాలు తీసుకోగా,మేయర్‌ ఆ విషయంలో విభేదిస్తున్నట్లు తెలుస్తోంది. సుమారు ఆరు నెలల క్రితం ఖమ్మం నగర పాలక సంస్ధలో విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్‌ కమిషనర్‌ సంపత్‌ స్ధానంలో మధిరలో పనిచేస్తున్న షఫీ ఉల్లాను ఉన్నత అధికారులు నియమించారు. అప్పడు మొదలైన అభిప్రాయ బేదాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని తెలుస్తుంది.

ఈ మధ్యకాలంలో అసిస్టెంట్‌ కమీషనర్‌ సూచనల మేరకే కమిషనర్‌ ఏకాభిప్రాయంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మేయర్‌ను సంప్రదించకుండానే పలు కాంట్రాక్ట్‌ పనులను మెప్మా ద్వారా నిర్వహిస్తుండటంతో ఈ విషయంపై ఆమె కూడా అసహనం వ్యక్తం చేస్తున్నట్లు కార్యాలయ సిబ్బంది చర్చించుకుంటున్నారు. అదేవిధంగా ఎంతో కాలంగా పలు సెక్షన్‌లో విధులు నిర్వహిస్తున్న ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందిని మేయర్‌కు తెలియకుండా మహిళా సిబ్బంది అని కూడా చూడకుండా మార్చడంతో భాదిత సిబ్బంది ఆమె వద్దకు వెళ్లి మెర పెట్టుకున్నట్లు సమాచారం. అంతేకాకుండా జౌట్‌సోర్సింగ్‌ సిబ్బంది విషయంలో అసిస్టెంట్‌ కమీషనర్‌ నిర్ణయం మేరకే కమిషనర్ కొంత మంది సిబ్బందిపై చర్యలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో మాధవి అనే ఉద్యోగిని కమిషనర్‌ సస్పెండ్‌ చేయడంతో ఆమె స్వయంగా కమిషనర్‌ చాంబర్ వద్దనే ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించడం సంచలనం సృష్టించింది.

అసిస్టెంట్‌ కమిషనర్‌ను నియమించిన మూడు నెలలకే డైరెక్టరేట్ ‌ నుంచి ఆదేశాలు వచ్చినా కమిషనర్ అతన్ని ఇక్కడి నుంచి పంపకుండా అడ్డుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం అసిస్టెంట్‌ కమిషనర్‌ షఫీ ఉల్లా ఖాన్ ఏదులాపురం నూతన మున్సిపాలిటీకి ఫుల్‌ అడిషనల్‌ ఇన్‌చార్జ్‌ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే అక్కడికంటే నగరపాలక సంస్ధ కార్యాలయం పనుల్లోనే ఏక్కువగా శ్రద్ద చూపుతూ పలువురు నుండి విమర్శలు ఎదుర్కుంటున్నారు. అయినప్పటికీ ఇక్కడ అసిస్టెంట్‌ కమిషనర్‌ను ఎందుకు కొనసాగిస్తున్నారో తెలియడం లేదని కమిషనర్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. కొంతమంది కాంట్రాక్టర్ల పట్ల కమిషనర్‌ వ్యవహరిస్తున్న శైలి వారిని ఇబ్బందులకు గురిచేస్తుందని దీంతో కార్యాలయం నుండి తమకు రావాల్సిన కోట్లాది రూపాయలు అడిగేందుకు వారు ధైర్యం చేయలేకపోతున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ విషయంపై ఇంటిలిజెన్స్‌ అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే వారు కమిషర్‌తో పలు అంశాలు చర్చించినట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై మేయర్‌ అభిప్రాయం కూడా సేకరించే పనిలో పడినట్లు సమాచారం. నగరపాలక సంస్ధ కార్యాలయంలో స్వచ్చమైన పాలన కొనసాగాలంటే వీరి ఇద్దరి మధ్య సఖ్యత ఉండాలని ప్రజలు, ఉద్యోగులు కోరుతున్నారు.