
భారతీయ జనతా పార్టీ.. సంస్థా గత కార్యకలాపాలు దాదాపునా పూర్తయ్యాయి.. జిల్లా అధ్యక్షుల ఎంపిక కూడా దాదాపు పూర్తయింది.. బీజేపీ బలంగా ఉన్న కరీంనగర్లోనే ఇంకా జిల్లా అధ్యక్షుడి ఎన్నిక పూర్తి కాలేదు. రేపుమాపు అంటూ రోజులు గడుస్తున్నాయి కాని కదలిక కనిపించడం లేదు. కార్యకర్తలు త్వరగా జిల్లా అధ్యక్షుడిని నియమించాలని కోరుతున్నా స్పందన కనిపించడం లేదు. జిల్లాకు చెందిన కేంద్ర మంత్రి సంజయ్ కూడా దీనిపై మౌనంగా ఉంటున్నారు. చాలా మంది పదవి ఆశిస్తున్నా, సంజయ్ ఆశీస్సులు ఉన్న నేతనే పదవి వరించనుంది. మరి సంజయ్ ఎందుకంత సైలెంట్‌గా ఉంటున్నారనేది పార్టీ శ్రేణులకే అంతుపట్టడం లేదంట
కరీంనగర్ జిల్లాలో బీజేపీ బలంగా ఉంది.. అక్కడ ప్రతి యేటా బలం పెంచుకుంటోంది. ప్రతి ఎన్నికల్లో తన సత్తాను చాటుతుంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గణనీయంగా ఓటింగ్ శాతం పెంచుకుంది. ఎంపి ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. బండి సంజయ్ రెండో సారి కరీంనగర్ ఎంపీగా విజయం సాధించి కేంద్ర మంత్రివర్గంలో స్థానం సంపాదించారు. తరువాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా సత్తాను చాటింది. సంస్థగతంగా జిల్లాలో పార్టీ బలంగా ఉండటంతో అన్ని జిల్లాల కంటే ముందుగానే.. ఇక్కడ జిల్లా అధ్యక్షుడిని ఎంపిక చేస్తారని కార్యకర్తలు, నేతలు భావించారు.
కానీ అందుకు భిన్నమైన పరిస్థితులు కనబడుతున్నాయి. అన్ని చోట్ల జిల్లా అధ్యక్షులు నియమిస్తే కరీంనగర్‌లో మాత్రం ఇంకా అధ్యక్ష పేరును ప్రకటించలేదు. ఇక్కడి నుంచే కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈయన చెప్పిన వ్య క్తికి మాత్రమే జిల్లా అధ్యక్ష పదవి వస్తుంది. పెద్ద ఎత్తున పోటీ ఉండటంతో సంజయ్ వ్యూహాత్మకంగా మౌనంగా ఉంటున్నారని తెలుస్తుంది. అధ్యక్ష పదవి ఆశిస్తున్న నేతలందరూ సంజయ్ చుట్టు తిరుగుతున్నారు. ఆయన మాత్రం.. ఎలాంటి సమాధానం ఇవ్వకుండా నవ్వుతూ పంపిస్తున్నారంట.
ప్రస్తుతం కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా గంగాడి కృష్ణారెడ్డి ఉన్నారు. ఆయన మరోసారి పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆయనకి కూడా ఎలాంటి గ్రీన్ సిగ్నల్ రాలేదు. ఆయనతో పాటు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, వాసుదేవరెడ్డి, కొట్టె మురళీకృష్ణ, బేతి మహేందర్ రెడ్డి, ప్రవిణ్‌రావు తదితర నేతలు రేసులో ఉన్నారు. వీరంతా సంజయ్ చుట్టు ప్రదక్షిణలు చేస్తున్నారు. సంజయ్ కరీంనగర్‌కి వచ్చినప్పుడల్లా ఆయన్ని కలుస్తూ లాబీయింగ్ చేసుకుంటున్నారు. ఆయన మాత్రం ఎవరికి స్పష్టమైన హామీ ఇవ్వడం లేదంట.
జిల్లా అధ్యక్షుడు ఇంకా ఎంపిక కాకపోవడంతో పార్టీ కార్యక్రమాలపై కూడా ప్రభావం చూపుతోంది. మిగిలిన పార్టీ కమిటీలు కూడా మరింత ఆలస్యం అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో బండి సంజయ్ ఎవరు పేరు చెబుతారు? ఎవరికి హామీ ఇచ్చారనే విషయం బయటకు పొక్కకపోవడంతో ఆశావహులంంతా తెగ టెన్షన్ పడిపోతున్నారంట. అయితే జిల్లా అధ్యక్ష పదవి ఆశిస్తున్న నేతలందరూ.. సంజయ్ ఆశీస్సులు తమకే ఉన్నాయని ప్రచారం చేసుకుంటున్నారు. జిల్లా అధ్యక్ష
నియమాకం ఆలస్యం కావడంతో.. పార్టీ శ్రేణులు అయోమయానికి గురవుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండటంతో ఈ ఉత్కంఠకు త్వరగా తెర దింపాలని పార్టీ అధిష్టానానికి పార్టీ శ్రేణులు విజ్ఞప్తి చేస్తున్నాయి