కొత్తగూడెం కాంగ్రెస్‎కు దిక్కెవరు..?

అక్కడ ఆ పార్టీకి నాయకులు చాలా మంది ఉన్నారు. ప్రత్యేకంగా ఆఫీసులు కూడా పెట్టుకుని కార్యక్రమాలు చేశారు.అయితే అదంతా ఎన్నికల ముందు మాట.ఆనాడు గంపెడు మంది సీటు కోసం ట్రై చేశారు. అంతే కాదు తలా ఒక్కరు స్వంతంగా పార్టీ కార్యాలయాలను కూడా నడిపారు. ఎన్నికలు అయిపోయాయి. అక్కడ సీటును పొత్తుల్లో వేరే వారికి పార్టీ దానం చేసింది. దీంతో అక్కడ ఇప్పుడు పార్టీ నేతలు అంతా చెల్లా చెదురు అయ్యారు. మళ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు చూసుకుందామని స్వంత పార్టీ కార్యాలయాలు ఎత్తివేశారు. ఎన్నికల ముందు నాలుగు కార్యాలయాలు ఉండగా ఇప్పుడు డిసిసి కార్యాలయం ఒక్కటే మిగిలిపోయింది.

భద్రాద్రి జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం మొదటి నుంచి కాంగ్రెస్ కు కంచుకోట. అయితే ఇక్కడ అడపా దడపా పార్టీ ఓటమిపాలు అయినప్పటికీ అది స్వయంకృతాపరాధంగానే ఉండేది. కాంగ్రెస్ ..సీపీఐకీ ఎన్నికల పొత్తు వచ్చిందంటే చాలు ఇక్కడ పార్టీ ఆశలు వదులుకోవలసిందే. సిపిఐకి సీటు ఇవ్వడం ఖాయమనే చెప్పాలి. మొన్నటి ఎన్నికల్లో కూడా అదే జరిగింది. కాంగ్రెస్ సిపిఐ పొత్తులో బాగంగా కాంగ్రెస్ అధిష్టానం సిపిఐకి సీటును ఇచ్చింది. దీంతో కాంగ్రెస్ క్యాడర్ సిపిఐని గెలిపించింది. ఇకపోతే ఇక్కడ సిపిఐ పాతుకుని పోయేందుకు శత విదాలా ప్రయత్నిస్తోంది.

భద్రాద్రి జిల్లా కొత్తగూడెం నియోజకవర్గంలో నిన్నటి వరకు మున్సిపాలిటీ ఉండగా ఇప్పుడు కార్పోరేషన్ అయ్యింది. ఆ కార్పోరేషన్ నే కాదు, మెజారిటీ గ్రామ పంచాయితీ, స్థానిక ఎన్నికల్లో కూడా తమదే ఆధిపత్యం కావాలని సిపిఐ ప్రయత్నిస్తోంది. అందుకు అనుగుణంగా పావులు కదుపుతుంది. దీంతో ఇప్పుడు ఇక్కడి కాంగ్రెస్ నేతల్లో.. మళ్లీ కాంగ్రెస్ కు పుట్టగతులు ఉంటాయో ఉండవో అన్న ఆందోళన నెలకొందనే టాక్ వినిపిస్తోంది. అందువల్ల ఇక్కడ కాంగ్రెస్ కు నాయకులు ఉన్నప్పటికీ కాంగ్రెస్ నాయకులు పార్టీని మోసేవారు మాత్రం కనిపించడం లేదు. ఎన్నికల ముందు ఉర్రూతలూగిన కాంగ్రెస్ నేతలు , పోటీ పడ్డ కాంగ్రెస్ నేతలు అంతా ఇప్పుడు తలో దిక్కుకు వెళ్లిపోయారంట. వారంతా పార్టీనే నమ్ముకుని ఉన్నప్పటికి వారిలో మాత్రం ఎన్నికల ముందు ఉన్న జోష్ అయితే లేదంట.

ఎన్నికల ముందు కొత్తగూడెం నుంచి నలుగురు కాంగ్రెస్ నేతలు పొటీ పడ్డారు. అయితే పోటీ పడ్డ నలుగురు నాలుగు కాంగ్రెస్ కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్నారు. ఆ పార్టీ కార్యాలయాల నుంచి కార్యక్రమాలు కొనసాగించారు. మాజీ ఎంఎల్ సి సీనియర్ నేత అయిన పోట్ల నాగేశ్వరరావు కాంగ్రెస్ నుంచి కొత్తగూడెం సీటు కోసం తీవ్రంగా ప్రయత్నించారు. ఆయనకు భట్టి విక్రమార్క మద్దతు కూడా ఇచ్చారు. గతంలో టిడిపి పార్టీలో ఎంఎల్ సి , టిడిపి జిల్లా అధ్యక్షుడుగా పని చేశారు ఈ సీనియర్ నేత. ఈయన ప్రస్తుతం కార్పోరేషన్ పదవిని ఆశిస్తన్నారు. భట్టి విక్రమార్క ను నమ్ముకుని రాజకీయాల్లో తిరుగుతున్నారు. ఇకపోతే ఇక్కడ పార్టీ నే నమ్ముకుని మొదటి నుంచి కార్యక్రమాలు చేపట్టిన మోతుకూరి ధర్మారావు కూడా భట్టి విక్రమార్క ను నమ్ముకుని కార్యక్రమాలు చేపట్టారు.

బీసీ నేత అయిన మోత్కూరి ధర్మారావు జిల్లా కాంగ్రెస్ కార్యాలయాన్ని కేరాఫ్ చేసుకుని సీటు కోసం ప్రయత్నాలు చేశారు. అయితే ఈ కార్యాలయానికి మాత్రం ఎన్నికల ముందు మాత్రం మిగిలిన పోటీదారులు ఎవరూ వచ్చే వారు కాదు. ఇకపోతే మరో కాంగ్రెస్ నేత బిసి నేత నాగ సీతారాములు సైతం సీటు ను ఆశించి పార్టీ కార్యాలయాన్ని ఎన్నికల ముందు ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆయన కార్యాలయాన్ని ఎత్తేసి పొంగులేటి క్యాంపు కార్యాలయానికి అందుబాటులో ఉంటున్నాడు. ఇకపోతే మరోనేత యడవెళ్లి కృష్ణ నిన్నటి ఎన్నికలు తప్ప గతంలో నాలుగు సార్లు ఏదో ఒక్క పార్టీ నుంచి అయితే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. స్వంతంగా మొన్న ఎన్నికల ముందు పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ తరువాత ఇప్పుడు కార్యాలయం మాత్రం కనిపించడం లేదు. ఇలా నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతలు ఎవ్వరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. వనమా వెంకటేశ్వర రావు కు కో బ్రదర్ అయిన యడవెల్లి కృష్ణ గతంలో 2009 లో పిఆర్ పి నుంచి పోటీచేసి 38876 ఓట్లను తెచ్చుకున్నారు. ఆ తరువాత వైసిపి నుంచి సీటు కోసం ప్రయత్నించి విపలం అయ్యారు. అయితే ఈ సీటును వనమా వెంకటేశ్వర రావు ఎగరేసుకుని పోవడంతో మళ్లీ ఇండిపెండెంట్ గా 2014 ఎన్నికల్లో పోటీ చేసి 22981 ఓట్లను తెచ్చుకున్నారు. ఇకపోతే 2018 ఎన్నికల్లో యడవెల్లి కృష్ణ సిపిఎం ఏర్పాటు చేసిన బి ఎల్ ఎఫ్ నుంచి పోటీ చేసి 5520 ఓట్లు తెచ్చుకున్నారు.