
ఎమ్మెల్సీ కవిత కూల్ గేమ్ ఆడుతున్నారా..? లేక మైండ్ గేమ్ తో కొడుతున్నారా…? కేసీఆర్ తప్ప ఎవరి నాయకత్వం ఒప్పుకోనని కేటీఆర్ గురించి చెప్పకనే చెబుతూ స్పీడ్ పెంచేశారు..! బీ ఆర్ ఎస్ ను బీజేపీలో విలీనం చేసే కుట్ర అంటూ కారు పార్టీని ఇరకాటంలో పడేశారు.. పక్కా ప్రణాళికతో మాటల తూటాలు పేల్చుతున్న కవిత కొత్త రాజకీయ బాటకు బలం చేకూర్చే విధంగానే ఉన్నాయా..? కవిత మాటలు గులాబీ పార్టీలో మంటలు రేపుతున్నాయా..! లెట్స్ వాచ్ దిస్ ఆఫ్ ది రికార్డ్
తండ్రి కేసీఆర్ దేవుడన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇప్పుడు బాణం అన్నపై ఎక్కుపెట్టిన్నట్టు స్పష్టం అయిపోయింది. ఇవాళ హైదారాబాద్ లో మీడియాతో జరిగిన చిట్ చాట్ లో ఆమె అనేక విషయాలపై కుండ బద్దలు కొట్టారు. ఆమె వ్యాఖ్యల్లో ప్రాధాన్యతా అంశాలు గమనిస్తే.. ఆమె ఈసారి తన అన్న కేటీఆర్ టార్గెట్ గా సంచలన పరోక్ష వ్యాఖ్యలు చేశారు. తండ్రి కేసీఆర్ తప్ప ఎవరి నాయకత్వం అంగీకరించేది లేదన్నారు. కేటీఆర్ కు బీఆర్ఎస్ పగ్గాలు అప్పగిస్తే తాను సహకరిస్తానని ఇటీవల మాజీ హరీష్ రావ్ ప్రకటించారు. ఆపై హరీష్ రావ్ ఇంటికి కేటీఆర్ కూడా వెళ్ళి మాట్లాడారు.. దీన్ని బట్టి కేటీఆర్ కు పగ్గాలు అప్పగిస్తే ఒప్పుకునేది లేదనే సంకేతం కవిత ఇచ్చారా అంటే అవుననే విధంగానే ఆమె వ్యాఖులున్నాయి.. అంతేకాక కాళేశ్వరం నోటీసులు ఇస్తే ఊరూరా ఆందోళనలు చేపట్టకుండా ట్విట్టర్ లో విమర్శలు ఏంటని అదే ఇంకో నేతకు నోటీసులు వస్తే బాగా స్పందించారని గుర్తు చేశారు. ఈ ఉదాహరణతో ఆమె బీ ఆర్ ఎస్ పార్టీలో ప్రస్తుత నాయకత్వ లోపాన్ని వేలెత్తి చూపారు. ఆ లైన్ కూడా కేటీఆర్ నే టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తోంది.
తనను పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించారు అంటున్నారు.. ఈ ఆరోపణలు కూడా బీ ఆర్ ఎస్ పైనే.. మొదటి సారి brs ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచే కవిత నిజామాబాద్ జిల్లా, అలాగే పార్లమెంట్ పరిధిలోని బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేల తీరుపై గుర్రుగా ఉన్నారు. 2019 ఎంపీ ఎన్నికల్లో బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలు సరిగ్గా పని చేయలేదని ఆమె తనకు వచ్చిన ఓట్లు అంతకు ముందు వారికి అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల లెక్కలు తీసి జరిగిన పరిణామాలను మైండ్ లో పెట్టుకున్నారు.. ఇప్పుడు ఆ ఆవేదన అగ్ని పర్వతంలా బద్దలు అవుతోంది.. ఇదంతా ఒక పథకం ప్రకారం కూడా జరిగిందనే అనుమానం ఆమెది. ఇలా అనేక మాటల తూటాలు పేల్చడమే కాదు పనిలో పనిగా తన జోలికి రావద్దని మాస్ వార్నింగ్ కూడా ఇచ్చేశారు కవిత.
మరో ప్రధాన ఆరోపణ కవిత నుంచి విలీనం అంశంపై వచ్చింది.. బీ ఆర్ ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపణలు చేశారు. అయితే తాను అడ్డుకున్నానని ఇప్పుడు అందుకే తండ్రి కేసీఆర్ కు పార్టీకి దూరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. . చాలా కాలంగా బీజేపీ బీ ఆర్ ఎస్ ఒకటేనని కాంగ్రెస్ ఇతర పార్టీలు ఆరోపిస్తున్నా ఇప్పుడు ఏకంగా కేసీఆర్ కుటుంబం లోని సభ్యురాలే కుండ బద్దలు కొట్టడంతో బీ ఆర్ ఎస్ పార్టీని ఆ వ్యాఖ్యలు తీవ్రంగా డ్యామేజ్ చేస్తాయనే నిపుణులు అంటున్నారు. బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలు సీనియర్ నేతలు ఈ అంశాన్ని జీర్ణించుకోగలరా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కవిత ఆరోపణలు నిజమే అయితే తమ రాజకీయ భవిష్యత్ ఏంటి అనే మీమాంసంలో బీ ఆర్ ఎస్ నేతలను తొలవక మానదు. కవిత నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా ఉన్నారు.. ఆ పదవిపై కూడా ఆమె ప్రస్తావించారు. జైలుకు వెళ్లే సందర్భంలో తాను రాజీనామా చేస్తానంటే వద్దన్నారని గుర్తు చేశారు. కవిత నిజామాబాద్ నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి గతంలో నిజామాబాద్ ఎంపీగా పని చేశారు కాబట్టి ఉమ్మడి జిల్లాలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే పార్టీ నేతలు సైలెంట్ గా ఉన్నారు.. పార్టీ శ్రేణులు సైతం స్తబ్దుగా ఉండిపోయారు. ఇతర పార్టీలు మాత్రం కవిత ఎపిసోడ్ ను గమనిస్తున్నాయి.
ఇక మాటల స్పీడ్ పెంచిన కవిత బాట ఏంటనేది అందరినీ తొలుస్తున్న ప్రశ్న. అమెరికా నుంచి వచ్చాక మాట్లాడిన మాటలకు హైదారాబాద్ లో చిట్ చాట్ మాటలకు ఎంతో మార్పు కనిపిస్తోంది.. ఆమె జూన్ రెండున కొత్త పార్టీ ప్రకటిస్తారు అని ప్రచారం జరుగుతోంది.. తాజా పరిణామంతో గులాబీ అధినేత కేసీఆర్ కుటుంబంలో అంతర్గతంగా గూడు కట్టుకున్న అసమ్మతి బయటకు వచ్చి రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. కవిత కేటీఆర్ మధ్య ఏర్పడిన చిచ్చు తారస్థాయికి చేరింది. నేరుగా విమర్శలు చేసుకునేంత దూరం పెరిగింది. అన్నాచెల్లెళ్ల మధ్య పూడ్చలేని అగాధం ఏర్పడిందని అర్థమవుతోంది.. ఇంత దూరం వచ్చాక కవిత వెనుకడుగు వేస్తుందని అనుకోవడం లేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.. అందుకే జాగృతిని జాగృతం చేస్తుందని అంటున్నారు.. జూన్ రెండున కవిత నుంచి కొత్త రాజకీయ బాట పడుతుందనే అభిప్రాయాలు బలంగానే వినిపిస్తున్నాయి.