
ఆ జిల్లా బీజేపీకి నాయకత్వ లేమి సమస్యగా మారిందట. కార్యకర్తల బలంతో పాటు మంచి బలమైన నేతలున్నా కూడా ప్రజల్లోకి వెళ్లలేక సతమతమవుతుందట. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి నడిపించే నాయకుడు లేక జిల్లాలో కార్యకర్తల పరిస్థితి ఎవరికి వారే అన్నట్టు తయారయ్యిందట. అసలే నాయకత్వ లేమితో సతమతమవుతున్న పార్టీకి అధ్యక్ష ఎన్నిక తలనొప్పిగా మారిందట.ఇంతకీ అది ఏ జిల్లా? లెట్స్ వాచ్ దిస్ ఆఫ్ ది రికార్డ్ .
ఓ వైపు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ..8 మంది ఎంపీలు ఉన్న పార్టీ. స్మార్ట్ సిటీ,హెరిటేజ్ సిటీ, అమృత్ సిటీ అంటూ వివిధ కేటగిరీల్లో వరంగల్ ను కేంద్ర ప్రభుత్వం గుర్తించినా…కాజీపేట లో వ్యాగన్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ను ప్రారంభించినా.. కూడా ఆ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే నాయకుడే కరువయ్యారట. గత సార్వత్రిక ఎన్నికల ముందు వరకు ఒక ఊపు మీద ఉన్న పార్టీ ఒక్కసారిగా ఎందుకు డీలా పడిపోయిందని కార్యకర్తలు మదనపడుతున్నారట. ఓ వైపు కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలను బీఆరెస్ పార్టీ ప్రజల్లో ఎండగడుతుంటే బీజేపీ కి మాత్రం ఏమి పట్టనట్టు వ్యవహరిస్తుందన్న టాక్ జిల్లాలో వినిపిస్తోంది.ఎవరికి వారే అన్నట్టు వ్యవహరిస్తూ పార్టీని పూర్తిగా గాలికి వదిలేశారని సొంతపార్టీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారట.ఇంతకీ హన్మకొండ బీజేపీ లో ఏం జరుగుతుందనీ పార్టీలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోందట.
అసలే నాయకత్వ లేమితో బాధపడుతున్న హన్మకొండ బీజేపీ లో అధ్యక్ష ఎన్నిక అగ్గి రాజేసిందట. పార్టీకి ఎంతో విధేయంగా ఉండి, ఖర్చు పెట్టి ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మమ్మల్ని పట్టించుకోవడం లేదంటూ కొంతమంది బీసీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. హన్మకొండ జిల్లా అధ్యక్ష ఎన్నికల ముందు నుండి పార్టీ కార్యక్రమాలకు పిలవడం లేదని పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి దేశిని సదానందం,అసెంబ్లీ ఇంచార్జి కందకట్ల సత్యనారాయణ,యువ మోర్చా అధ్యక్షుడు తీగల భరత్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. జిల్లా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసినందుకే మమ్మల్ని దూరం పెడుతున్నారా అని బాహాటంగానే ప్రశ్నిస్తున్నారట.
8 సంవత్సరాలు పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న రావు పద్మ ఎవరిని ఎదగనివ్వలేదని, కొంతమంది నాయకులు పార్టీని వీడడానికి కూడా ఆమె కారణమని మరోసారి చర్చ జరుగుతుంది. 8 ఏళ్లలో కనీసం పార్టీ ఆఫీసుకూడా కట్టలేని వారు సూచించిన వ్యక్తికి అధ్యక్ష పదవి ఇవ్వడం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. తనకు నమ్మకస్తుడైన కొలను సంతోష్ రెడ్డికి అధ్యక్ష పదవి ఇప్పించుకోవడం ద్వారా తెరవెనుక చక్రం తిప్పొచ్చనే ఆలోచనతో మాజీ అధ్యక్షురాలు రావు పద్మ కావాలనే ఇదంతా చేస్తున్నారని బీసీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా ఆమధ్య కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హన్మకొండ పర్యటనలో బీసీ , రెడ్డి నేతల మధ్య గ్యాప్ ఉందని స్పష్టం అయింది. కేంద్ర మంత్రి పర్యటనకు సైతం సమాచారం ఇవ్వకపోవడం తో సదరు బీసీ నేతలు కిషన్ రెడ్డి ప్రెస్ మీట్లో ప్రసంగిస్తుండగానే వాట్సాప్ లో తమ అసహనాన్ని వ్యక్తం చేశారు.
పార్టీలోకి కొత్తగా వచ్చిన సీనియర్ నేతలను సైతం పట్టించుకోవడం లేదని జిల్లాలో టాక్. అరూరి రమేష్,కన్నెబోయిన రాజయ్య యాదవ్,అభినవ్ భాస్కర్,మాజీ ఎంపీ సీతారాం నాయక్ వంటి నాయకులను కనీసం పార్టీ కార్యక్రమాలకు కూడా పిలవడం లేదని బాధ పడుతున్నారట.అసలు బీజేపీ లోకి ఎందుకు వచ్చామని కొంతమంది నేతలు కార్యకర్తల ముందు వాపోయ్యారట.ఈ మధ్య జరిగిన తీరంగా ర్యాలీ కి సైతం పిల్వకపోవడంపై కొంతమంది నేతలు లోలోపల మదన పడుతున్నారట.ఇంత జరుగుతున్నా కూడా రాష్ట్ర పార్టీ నాయకులు కూడా ఎవరితో సంప్రదింపులు జరపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట.
జిల్లా అధ్యక్ష పదవిలోకి కొత్తగా వచ్చిన సంతోష్ రెడ్డి ఇకనుంచైనా బీసీ నేతలను,అసంతృప్త నేతలనుకలుపుకుపోతారా,లేకపోతే మాజీ అధ్యక్షురాలు బాటలోనే నడుస్తారా, పోనీలే అని బీసీ నేతలు సర్దుకుపోతారా మున్ముందు వేచి చూడాల్సిందే.