వెయ్యేళ్ల చరిత్రకు ఆనవాళ్లు.. గోల్కొండ కోటలో ఎల్లమ్మ వైభోగం..!

Yellamma’s celebration at Golconda Fort: డిల్లం డల్లం మోతలు..ఘల్లుమనే పోతురాజుల కాళ్ల గజ్జెలు…శివసత్తుల విన్యాసాలు, పసరు వేపల సువాసనలు నడుమ కల్లు సాకలు పోసి అమ్మకు పెట్టే భోజనం..నువ్వు పెద్దపులి ఎక్కినావమ్మో అంటూ అంతా కలిసి ఆడుతూ పాడుతూ చేసే వేడుకే బోనాల జాతర. దశాబ్దాల చరిత్ర కల్గిన భాగ్యనగర బోనాల జాతర రానే వచ్చేసింది. అమ్మల గన్న అమ్మ ఆది పరాశక్తి. గ్రామ దేవతగా కొలువై ప్రజలను కాపాడే కల్పవల్లికి పూజలు చేస్తూ ఊరువాడ అంతా పులకించిపోతోంది.

భాగ్యనగరంలో ప్రతి ఏటా ఆషాఢ మాసంలో బోనాల సంబురాలు ఎంతో వైభవంగా జరుగుతాయి. ఆషాఢ మాసం తొలి వారం నుంచి ప్రారంభమయ్యే బోనాల ఉత్సవాలు..ఎంతో చరిత్రాత్మక గోల్కొండ కోటలో ఓ రాతి గుహలో నెలకొన్న శ్రీ మహంకాళి దేవి ఆలయం నుంచే మొదలవుతాయి. ఈ అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో భాగ్యనగరంలో ఆషాఢ బోనాల ఉత్సవాలు షురూ అవుతాయి. కోరిన కోర్కెలు నెరవేర్చే శక్తి స్వరూపిణిగా పూజలు అందుకుంటున్న మహంకాళి అమ్మవారికి బోనం పెడితే, ఏడాదంతా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉంటారని భక్తుల విశ్వాసం. గోల్కొండ అమ్మవారికి తొలి బోనం ఎత్తిన తర్వాతే, భాగ్యనగరంలోని మిగతా ఆలయాల్లో బోనాల పండుగ మొదలువుతుంది.Yellamma’s celebration at Golconda Fort.

గోల్కొండ జగదాంబికా అమ్మవారికి తొలిరోజు మూడు బోనాలను సమర్పిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించే పట్టుచీర, బోనాలను లంగర్‌హౌస్ నుంచి ఊరేగింపుగా తీసుకువెళ్తారు. ముందుగా లంగర్‌హౌస్‌లోని పూజారి ఇంటి వద్ద ఉండే ఉత్సవ విగ్రహాలకు పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. ఆ తర్వాత ఉత్సవ విగ్రహాలు, బోనాలను కోటపైకి డప్పు చప్పుళ్లు, డోలు మోతలు, పోతరాజుల విన్యాసాల మధ్య ఊరేగింపుగా తీసుకువస్తారు. అక్కడ ఘటాలకు ప్రత్యేక పూజలు చేసి బోనాలను సమర్పిస్తారు. ప్రభుత్వం ఇచ్చే బోనాలతో పాటు బంజర్ దర్వాజ నుంచి నజర్ బోనం తీస్తారు. మహంకాళి ఆలయ పూజారి ఇంటి నుంచి మరో బోనం అమ్మకు వెళ్తుంది. ఇలా తొలి రోజు మూడు బోనాలు అమ్మకు సమర్పిస్తారు. ఈ మాసంలో అమ్మవారికి మొత్తం తొమ్మిది బోనాలు సమర్పిస్తారు. ప్రతి గురు, ఆదివారాల్లో భక్తులు బోనాలు చెల్లిస్తారు. ఆషాఢమాసం ముందు వచ్చే అమావాస్య రోజు అమ్మవారి ఆలయానికి వెళ్లే మార్గంలోని మెట్లకు పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది.

గోల్కొండ బోనాలకు వెయ్యేళ్ల చరిత్ర ఉంది. ఈ అమ్మవారికి బోనం సమర్పించడం వెనుక ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. హైదరాబాద్ నగరం ఏర్పడక ముందు ఈ ప్రాంతంలో రామ్ దేవ్ రావు అనే పశువుల కాపరీ పశువులు కాస్తుండగా..అమ్మవారి విగ్రహం దొరికిందట. అద్భుత తేజస్సు కలిగిన ఆ విగ్రహం గురించి అప్పటి కాకతీయ రాజులకు తెలిసిందట. దీంతో ఆ ప్రాంతంలో ఆలయాన్ని కట్టించి.. అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించారట. ఆ ప్రాంతానికి గొల్లకొండ అనే పేరు పెట్టారట. అంతేకాదు, కాకతీయ రాజు ప్రతాప రుద్రుడు మహంకాళి ఆలయంలో బోనాల సందర్భంగా ప్రత్యేక పూజలు చేసేవారట. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడ బోనాల ఉత్సవాలు జరుగతున్నాయి. కాకతీయుల తర్వాత ఈ ప్రాంతాన్ని పాలించిన నిజాం నవాబులు కూడా ఆలయాన్ని అలాగే కొనసాగించారు. నవాబుల కాలంలోనే హిందూవులు భక్తితో జరుపుకునే బోనాల వేడుకలకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసేవారట.

గోల్కొండ బోనాల వెనుక ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. హైదరాబాద్ నగరాన్ని నిజాం నవాబులు పాలిస్తున్న సమయంలో ప్లేగు వ్యాధి సోకి ఎంతో మంది చనిపోయారట. స్థానికంగా ఉండే ఓ వ్యక్తి కలలోకి మహంకాళి అమ్మవారు వచ్చి, తనకు బోనాలు సమర్పిస్తే, ప్లేగు వ్యాధి తగ్గిపోతుందని చెప్పిందట. ఆ వ్యక్తి ఈ విషయాన్నిఇరుగుపొరుగు వారికి చెప్పడంతో అంతా కలిసి గోల్కొండ మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించారట. దాంతో కొద్ది రోజుల్లోనే ప్లేగు వ్యాధి తగ్గడంతో ప్రజలు ఆనందంతో…ప్రతి ఏటా ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనాలు సమర్పించే సంప్రదాయం ఆనవాయితీగా కొనసాగిస్తున్నారట.

ఇదెలా ఉంటే..భాగ్యనగరంలోని మిగతా ఆలయాలకు, గోల్కొండలోని మహంకాళి ఆలయానికి ఓ తేడా ఉంది. సాధారణంగా ఆషాడ మాసంలో వచ్చేఆదివారంలోనే ఆయా ఆలయాల్లో అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. కానీ, గోల్కొండ కోటలో కొలువుదీరిన మహంకాళి అమ్మవారి కి మాత్రం ఆషాఢ మాసంలోని ప్రతి గురు, ఆదివారాల్లో భక్తులు బోనాలు చెల్లిస్తారు. ఇలా బోనాలు సమర్పించడం ద్వారా ఏడాదంతా సంపూర్ణ ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉంటారని భక్తులు భావిస్తారు.

Also Read: https://www.mega9tv.com/devotional/the-specialities-of-puri-jagannath-rath-yatra-2025/