విషాదం.. వివాదం.. తొక్కిసలాటకు ఇదే కారణమా..?

బెంగళూరులో ఆర్సీబీ విజయోత్సవ సభలో జరిగిన తొక్కిసలాట ఘటన కర్ణాటకలో రాజకీయ దుమారం రేపింది. ఈ ఘటనలో 11 మంది మరణించగా, 33 మంది గాయపడ్డారు. ఈ ఘటన ఎలా జరిగింది? రాజకీయ పార్టీల మధ్య ఎలాంటి మాటల యుద్ధం నడుస్తోంది? కర్ణాటక ప్రభుత్వం, కోర్టు ఎలా స్పందించాయి? క్రికెటర్లు ఏం చెప్పారు?

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద ఆర్సీబీ విజయోత్సవ సభ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటన రాజకీయ దుమారాన్ని రేపింది. దీనిపై రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మొదటి ఐపీఎల్ టైటిల్‌ను సాధించిన సందర్భంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ విజయోత్సవ సభ ఏర్పాటు చేశాయి. అహ్మదాబాద్‌లో పంజాబ్ కింగ్స్‌ను ఓడించి టైటిల్ గెలిచిన ఆర్సీబీ జట్టు, బెంగళూరు చేరుకుని విధానసౌధ వద్ద కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చేతుల మీదుగా సన్మానం అందుకుంది. అక్కడి నుండి చిన్నస్వామి స్టేడియం వరకు ఓపెన్ బస్ పరేడ్ ప్లాన్ చేశారు. కానీ జనసమూహం ఎక్కువగా ఉంటుందని భావించి దానిని రద్దు చేసి, జట్టు సాధారణ బస్‌లో స్టేడియానికి చేరుకుంది.

అయితే, చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన సన్మాన కార్యక్రమంలో తీవ్ర విషాదం నెలకొంది. స్టేడియం సామర్థ్యం 35 వేల మంది మాత్రమే అయినప్పటికీ, సుమారు 2 నుంచి 3 లక్షల మంది అభిమానులు విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్ వంటి ఆటగాళ్లను చూసేందుకు గుమిగూడారు. ఈ క్రమంలో అభిమానులు స్టేడియం గేట్లను దూకేందుకు, లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 11 మంది మరణించగా, 33 మంది గాయపడ్డారు. గాయపడినవారిని స్థానిక ఆసుపత్రులకు తరలించారు. జనసమూహం కారణంగా అంబులెన్స్‌లు సకాలంలో రాకపోవడం వల్ల పరిస్థితి మరింత దిగజారింది.
బైట్.. సీఎం డీకే శివకుమార్ (జనం ఎక్కువ రావడంపై బైట్ వేసుకోవాలి.)

ఈ ఘటన కర్ణాటక రాజకీయాల్లో పెను దుమారం రేపింది. విపక్షాలైన బీజేపీ, జేడీఎస్‌లు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించాయి. బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర, ప్రభుత్వం సరైన ప్రణాళిక లేకుండా, పబ్లిసిటీ కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. దీని వల్ల 11 మంది ప్రాణాలు కోల్పోయారు. న్యాయ విచారణ జరపాలి అని డిమాండ్ చేశారు. జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామి, ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయకపోవడమే ఈ విషాదానికి కారణం అని అన్నారు. బీజేపీ ఎమ్మెల్సీ చలవాది నారాయణస్వామి, ఇది పూర్తిగా భద్రతా వైఫల్యం అని ఆరోపించారు. దీనికి కాంగ్రెస్ నేతలు స్పందిస్తూ, దీనిపై రాజకీయం చేయవద్దని కోరారు. మంత్రి ప్రియాంక్ ఖర్గే స్పందిస్తూ.. బీజేపీ ప్రతిదీ రాజకీయం చేస్తుందని మండిపడ్డారు. ఓపెన్ బస్ పరేడ్ రద్దు చేసినప్పుడు తమని.. విమర్శించారని.., ఇప్పుడు మళ్లీ విమర్శలు చేస్తున్నారని అన్నారు. 5,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామని.. కానీ ఊహించిన దానికంటే జనం ఎక్కువగా వచ్చారని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలిపారు. ఇది తీవ్ర విషాదం. మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల పరిహారం, గాయపడినవారి వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది అని సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు.

ఈ ఘటనపై కర్ణాటక హైకోర్టు సీరియస్‌గా స్పందించింది. స్వయంగా సుమోటో కేసు తీసుకుని, విచారణ జరిపింది. పోలీసులు సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ అధికారులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటనలో యువత, విద్యార్థులు మరణించారని, పరేడ్ టైమింగ్‌లో గందరగోళం, ఉచిత పాస్‌ల పంపిణీలో అవకతవకలు జరిగాయని పోలీసులు తెలిపారు. ఈ అస్తవ్యస్తతే తొక్కిసలాటకు, ప్రాణ నష్టానికి దారితీసిందని వారు పేర్కొన్నారు. బెంగళూరు అర్బన్ డిప్యూటీ కమిషనర్ జీ. జగదీష్ నేతృత్వంలో మేజిస్టీరియల్ విచారణకు సీఎం ఆదేశించారు.

క్రికెటర్లు, బీసీసీఐలు కూడా ఈ ఘటనపై స్పందించాయి. ఈ ఘటనపై విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించారు. మాటలు రావడం లేదని… తన మనస్సు పూర్తిగా బాధతో నిండిపోయిందని రాశారు. ఈ ఘటనపై ఆర్సీబీ, కేఎస్‌సీఏ విచారం వ్యక్తం చేశాయి. అయితే, ఘటన తర్వాత కూడా స్టేడియంలో అరగంట పాటు విజయోత్సవ కార్యక్రమం జరిగింది, ఇది విమర్శలకు దారితీసింది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఘటనను హృదయవిదారకమన్నారు. బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునక్ సానుభూతి తెలిపారు. ఈ ఘటన ఆర్సీబీ విజయాన్ని మసకబరిచింది, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అన్ని వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.