అంకిత కేసులో సంచలన తీర్పు..!!

ఎట్టకేలకు న్యాయం జరిగింది. సుమారు మూడేళ్ల క్రితం దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన 19 ఏళ్ల రిసెప్షనిస్టు అంకిత భండారి మర్డర్ కేసులో ఉత్తరాఖండ్ స్థానిక కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. లైంగిక వాంఛ తీర్చలేదని ఆమె పని చేసే రిసార్ట్‌ ఓనరే ఆమెను దారుణంగా హతమార్చాడు.2022 సెప్టెంబరులో జరిగిన ఈ హత్య అప్పట్లో దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన బీజేపీ మాజీ నేత కొడుకు పుల్కిత్ ఆర్యతో పాటు మరో ఇద్దరు నిందితులు సౌరభ్ భాస్కర్, అంకిత్ గుప్తాలకు జీవిత ఖైదు విధిస్తూ కోట్‌ద్వార్‌లోని సెషన్స్ కోర్టు తీర్పు ఇచ్చింది. మే 19న తుది వాదనలు విన్న కోర్టు ఇవాళ ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చింది.

ఉత్తరాఖండ్ లోని పౌరీ జిల్లాలోని ఒక పేద కుటుంబానికి చెందిన అమ్మాయి అంకిత భండారి. చూడటానికి అందంగా…చదువు కూడా బాగా చదివేది. అంకిత తండ్రి ఒక గార్డుగా పనిచేసేవాడు. అయితే కోవిడ్ కారణంగా ఎదురైన ఆర్థిక సమస్యలతో హోటల్ మేనేజ్మెంట్ కోర్సును అంకిత మధ్యలోనే ఆపేసింది. ఇంట్లో కూడా చాలా కష్టంగా ఉండేది. ఈ క్రమంలో పుష్ప అనే ఫ్రెండ్ అంకితకు సహాయంచేసింది. పుష్ప ద్వారా రిషికేష్‌లోని వంతారా రిసార్ట్‌లో అంకిత రెసెప్షనిస్టుగా జాబ్ లో జాయిన్ అయ్యింది. అక్కడి వరకు అంతా బాగానే ఉన్నా 2022 సెప్టెంబర్ 18వ తేదీ నుంచి అంకిత కనిపించకుండా పోయింది. నాలుగు రోజుల తర్వాత ఆమె డెడ్ బాడీ ఒక కాలువలో కనిపించడంతో అప్పట్లో ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆమెపై హత్యాచారం జరిగి ఉండొచ్చన్న ప్రచారం జరగడంతో.. ఆ ప్రాంతంలో తీవ్రనిరసనలు వెల్లువెత్తాయి.
దీనిపై జనాగ్రహం వ్యక్తమైంది. జస్టిస్‌ ఫర్‌ అంకిత పేరుతో యువత రోడ్డెక్కింది. ఇటు సోషల్‌ మీడియాలోనూ జస్టిస్ ఫర్ అంకిత ఉద్యమం నడిచింది.

అంకిత రిసెప్షనిస్టుగా పనిచేసిన వంతారా రిసార్ట్‌ ఓనర్ పుల్కిత్ ఆర్యపై అనుమానాలు పెరిగాయి. పుల్కిత్ ఆర్య తండ్రి వినోద్ మాజీ బీజేపీ నేత కావడంతో కేసు నుంచి అతన్ని తప్పించే ప్రయత్నం జరుగుతోందంటూ ఆరోపణలు వచ్చాయి. రాజకీయ విమర్శల నేపథ్యంలో వినోద్‌ను బీజేపీ పార్టీ నుంచి బహిష్కరించింది. కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. పోలీసుల ప్రాథమిక విచారణలో ఆమె హత్యకు గురైనట్లు తేలింది. ఈ కేసులో రిసార్ట్‌ ఆపరేటర్‌ పుల్కిత్‌ ఆర్య, మరో ఇద్దరు ఉద్యోగులు సౌరభ్‌ భాస్కర్‌, అకింత్‌ గుప్తాలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే ఆమెపై అత్యాచారం జరగలేదని ఫోరెన్సిక్‌ రిపోర్ట్ ధృవీకరించింది. తన రిసార్ట్‌కు వచ్చేవాళ్లతో పాటు తనకు అదనపు సేవలు అందించాలని అంకితపై పుల్కిత్ ఒత్తిడి తెచ్చాడు. అయితే అందుకు ఆమె అంగీకరించలేదు. ఈ క్రమంలో 2022 సెప్టెంబర్ 18న ఇదే అంశంపై పుల్కిత్ అంకితతో వాగ్వాదానికి దిగాడు. ఆ తర్వాత జరిగిన పెనుగులాటలో అతను, అతని సహోద్యోగులు కలిసి అంకితను కాలువలోకి నెట్టేశారని పోలీసుల విచారణలో తేలింది. దీంతో వేధింపులు, హత్య, సాక్ష్యాలను ధ్వంసం చేయడం, ఇమ్మోరల్ ట్రాఫికింగ్ సహా పలు సెక్షన్ల కింద వీరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

అంకిత కేసు 2023 జనవరి 30న తొలిసారి కోట్‎ద్వార్ కోర్టులో విచారణకు వచ్చింది. మొత్తం 97 మందిలో 47 మంది సాక్ష్యులను సిట్ విచారించింది. 500 పేజుల ఛార్జిషీటును కోర్టుకు సమర్పించింది. ఎట్టకేలకు రెండేళ్ల విచారణ అనంతరం పుల్‌కిత్ ఆర్య, సౌరభ్ భాస్కర్, అంకిత్ గుప్తాలను అదనపు సెషన్స్ జడ్జి రీనా నెగి దోషులుగా ప్రకటించారు. ఈ ముగ్గురికి జీవిత ఖైదు విధించారు. అయితే, అంకిత కుటుంబం మాత్రం నిందితుకు మరణ శిక్ష విధించాలని డిమాండ్‌ చేస్తోంది. రాష్ట్ర ప్రజలంతా తమ కుటుంబానికి మద్దతుగా నిలవాలని కోరుకుంటోంది.