కందుకూరి వీరేశలింగం పంతులు.. వర్ధంతి నేడు!

ఆయనొక గొప్ప సంఘసంస్కర్త, గొప్ప కవి, రచయిత, ఉపాధ్యాయుడు, అభ్యుదయవాది..
తెలుగు సాహిత్యంలో ఆయన స్పృశించని సాహితీ ప్రక్రియ లేదంటే అతిశయోక్తి కాదు. వితంతు పునర్వివాహం, స్త్రీ విద్య కోసం ఎంతగానో కృషి చేశారు. తెలుగు సాహిత్యంలో ఆయనకు సమున్నతమైన స్థానం ఉంది. గద్య రచనలు, నవలలు, కథలు, వ్యాసాలు.. ఇలా అన్ని రకాల సాహితీ ప్రక్రియల్లో తనదైన ముద్ర వేసి.. తెలుగు సాహిత్యం ఉన్నంతవరకూ ఆయన పేరు శాశ్వతంగా నిలిచి ఉంటుందని రుజువు చేశారు. నేడు కందుకూరి వీరేశలింగం పంతులు గారి వర్ధంతి(మే 27). గద్య తిక్కనగా బిరుదాంకితులైన ఆయన జీవిత, సాహిత్య విశేషాలను ఇప్పుడు చూద్దాం.

1848 ఏప్రిల్ 16న సుబ్బరాయుడు, పున్నమ్మ దంపతులకు జన్మించారు కందుకూరి వీరేశలింగం పంతులు. వీరి పూర్వీకులది నేటి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఏలూరు కాగా వీరి తాతగారి పేరునే.. బాల వీరేశలింగానికి పెట్టడం జరిగింది. తండ్రితో పాటు పెద్దనాన్న వెంకటరత్నంలకు తెలుగు సాహిత్యంలో ప్రావీణ్యం ఉంది. వీరేశలింగంకు అనారోగ్య సమస్యలు ఉండటంతో ఇంట్లోవాళ్లు తనని అల్లారుముద్దుగా చూసుకునేవారు. అయినా బాల్యం నుంచే ఈయనకు విపరీతమైన దగ్గు, ఆయాసం ఉండేవి. ఇవి ఆయన్ను జీవితాంతం వెంటాడాయి. తండ్రికన్నా పెద్దనాన్నతోనే చనువు ఎక్కువ. తండ్రి మరణం తర్వాత ఆయన వద్దే పెరిగారు. పెద్దనాన్న ఉద్యోగం నిమిత్తం తిరిగి రాజమండ్రికి వచ్చేసింది వీరి కుటుంబం.

ఐదేళ్ళప్పుడు ఇంటికి సమీపంలో వీధి బడిలో అక్షరాలు, ఎక్కాలు, లెక్కలు నేర్చుకున్నాడు. కొన్నాళ్ళకు సోమరాజుగారి వద్ద బాలా రామాయణం, అమర నిఘంటువును చదివించాడు. వాచకం ఎలా చదవాలో, రాయాలో నేర్పించాడు కూడా. రుక్మిణి కళ్యాణం, సుమతి, కృష్ణ శతకాలను సైతం వల్లె వేయించాడు. ఆరోజుల్లో సామాన్యంగా ఇదే తెలుగుకు సంబంధించిన పాఠశాల విద్య. అప్పట్లో పాఠశాలలు, వార్షిక పరీక్షలు అంటూ ఉండేవి కావు. వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పనని నేర్చుకుంటూ.. వారి మెచ్చుకోలు తెచ్చుకునేవారు. అలా వారిని ఉద్యోగాల్లో చేర్చుకునేవారు.

ఇంట్లోనే ఉండటం మూలానా.. సమయం ఎక్కువగా దొరికి, చదివినదాన్నే మళ్ళీ మళ్ళీ చదవడం వల్ల ఏదైనా చదివితే.. వెంటనే ఙ్ఞప్తికి వచ్చేంత మేథను ఆయన స్వయంగా సంపాదించుకున్నారు. క్రమంగా తెలుగు, తెలుగు కావ్యాల మీద ఎక్కడలేని అభిమానం ఏర్పడింది. చదువయ్యాక.. పలు మండల పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేశారు. నెలకు 25 నుంచి 30 రూపాయల జీతం ఇచ్చేవారు. అప్పట్లో అదే అత్యధిక వేతనం. ఉపాధ్యాయ వృత్తితో పాటు సాంఘిక దురాచారాల నిర్మూలన, వితంతు పునర్వివాహా ప్రయత్నాలు చేశారు. ఆయన అభిప్రాయాలను ఎంతమందిలోనైనా నికచ్చిగా వెలిబుచ్చేవారు. స్త్రీ విద్య, వికాసం కోసం ఆయన ఎంతగానో పాటుపడ్డారు.

  • టీచర్ గా పని చేసిన సమయంలో ఎన్నో నాటకాలు రచించి, తన శిష్యులతో వేయించారు. అలా వేసిన నాటకం ‘వ్యవహార ధర్మబోధిని’.
  • 1874లో వివేకవర్థిని అనే పత్రికను నడిపారు. *అస్తిత్వం, సత్యం, అహింస అనే అంశాలపై పలు వ్యాసాలను రాశారు.
  • 1876లో హాస్య సంజీవని అనే మరో పత్రికను నడిపారు.
  • “మూఢ విశ్వాసాలను పోగొట్టాలనే ఉద్దేశంతో రాజశేఖర చరిత్ర అనే వచన ప్రబంధం రాశారు.
  • 1883లో స్త్రీల కోసమే ప్రత్యేకంగా ‘సతీహిత బోధిని’ అనే పేరుతో తెలుగు మాసపత్రికను ప్రారంభించారు.
  • ఆయన రాసిన పుస్తకాలు పది పెద్ద సంపుటాలుగా ముద్రణ అయ్యాయి.
  • ఆయన రచించిన గద్య రచనల వల్ల ‘గద్య తిక్కన’ అనే బిరుదు వచ్చింది.
  • ఆయన పదమూడో ఏట ఎనిమిదేళ్ళ బాపమ్మ (రాజ్యలక్ష్మమ్మ)తో బాల్య వివాహం జరిగింది. భర్త అడుగు జాడలవెంటే ఉన్న ఆవిడ 1910లో కన్నుమూశారు. అది ఆయనకు తీరని నష్టం.
  • మొట్టమొదటి వితంతు వివాహం జరిపించిన వ్యక్తి ఈయనే..
  • మొట్టమొదటి సహవిద్యా పాఠశాలను ప్రారంభించాడు.
  • తెలుగులో మొదటి స్వీయ చరిత్ర ఆయనదే..
  • ఆంధ్ర దేశంలో బ్రహ్మ సమాజం స్థాపించాడు.
  • దాదాపు 130కి పైగా గ్రంథాలు రచించిన ఆయన 1919 మే 27న తుదిశ్వాస విడిచారు.